close

ప్రధానాంశాలు

వడ్లు.. అమ్ముడెట్లు?

వరి ధాన్యం అమ్మకాలకు రైతుల నానా అవస్థలు
రోజుల తరబడి రైతుల పడిగాపులు
లారీల కొరత, రైస్‌మిల్లుల్లో స్థలాభావం
ఈ సమస్యలు చెప్పకుండాతేమ పేరుతో జాప్యం
గ్రామాల్లో రాత్రిపూట అడవి పందుల బెడద
సొమ్ము చెల్లింపుల్లో మరింత ఆలస్యం
బయటి వ్యాపారులకుఅమ్ముకుందామంటే ధరల్లో కోత

మంగమూరి శ్రీనివాస్‌
రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి


ఈ మహిళా రైతు కష్టం చూడండి..

నిర్మల్‌ జిల్లా మామడ మండలం కొత్తసాంగ్వికి చెందిన ఈ మహిళా రైతు పేరు సత్తెవ్వ. రెండెకరాల్లో వేసిన వరిని.. వరి కోత యంత్రాలు దొరక్క నానా ఇబ్బందులు పడి చివరకు పంట కోసి గ్రామ సమీపంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చారు. తేమశాతం ఎక్కువగా ఉండడంతో విక్రయించేందుకు వేచిచూడాల్సి వస్తోంది. అటవీ ప్రాంతానికి సమీపంలో కేంద్రం ఉండడంతో రాత్రిపూట అడవిపందులు వడ్లను తినేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పగటిపూట ఆరబెట్టి రాత్రి కుప్ప చేసి టార్పాలిన్లు కప్పేస్తున్నారు. పందులు వడ్లు తినకుండా చెట్టుకొమ్మలు, ముళ్లకంపను పెడుతున్నారు. రోజుల తరబడి ధాన్యాన్ని కొనకపోవడం వల్లే ఈ కష్టాలని తెలిపారు.


 

నానాకష్టాలు పడి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవాలంటే రైతులకు అనేక కష్టనష్టాలు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అరకొర సౌకర్యాలతో ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడిగాపులు పడాల్సి వస్తోంది. గ్రామగ్రామానా 3436 కేంద్రాలు ఏర్పాటుచేశారే తప్ప వేగంగా ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు లేవు. మహిళా సంఘాలకు సొంతంగా సదుపాయాలు ఏర్పాటుచేసుకునే సామర్థ్యం లేకపోవడం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్కెట్ల సిబ్బంది నిర్లక్ష్యం రైతులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.

సమస్యలివీ..
* గ్రామాల శివారులో పొలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ధాన్యం తెచ్చాక తేమ ఎక్కువ ఉందని కొనడానికి తిరస్కరిస్తున్నారు. 17శాతంలోపు తేమ ఉంటే కొనాలి. కానీ ఇతర సమస్యల వల్ల తేమ ఇంకాతగ్గాలని జాప్యం చేస్తున్నారు.
* ధాన్యం కొన్నాక తూకం వేసి లారీలో రైస్‌మిల్లుకు పంపాలి. అక్కడ లారీలో నుంచి దించాకే రైతు పేరుతో డబ్బు జమచేయాలని నిబంధన. లారీల కొరతతో తూకం వేయడానికి, వేసినా మిల్లుకు తరలించేందుకు జాప్యం చేస్తున్నారు.
* లారీ మిల్లుకు చేరినా స్థలాభావంవల్ల 2, 3రోజులపాటు అన్‌లోడ్‌ చేయడంలేదు. లారీ తిరిగొచ్చేదాకా  కొనకుండా తేమ ఎక్కువ ఉందని సాకులు చెపుతున్నారు. ఇదంతా అయ్యేసరికి వారం, పది రోజులు పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు.
* ఎవరైనా వ్యాపారి మద్దతు ధరకన్నా రూ.100 తక్కువ ఇచ్చినా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు తెలిపారు. వ్యాపారులు మాత్రం క్వింటాకు రూ.200-300దాకా తక్కువకు అడుగుతున్నారు. చిన్నరైతులు వచ్చినకాడికి రోడ్లపైనే వ్యాపారులకు అమ్మేస్తున్నారు.

తేమశాతం తగ్గినా..
సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలోని కొనుగోలు కేంద్రానికి అనూజ, ఎల్లవ్వ అనే రైతులు ధాన్యం తెచ్చి ఆరురోజులుగా ఆరబోస్తున్నారు. తేమ ఎక్కువ ఉందని కొనడంలేదు. ‘ఈనాడు’ ప్రతినిధి ముందే వారు ధాన్యాన్ని తేమ కొలిచే యంత్రంలో పోసి చూపారు. తేమశాతం అనూజ ధాన్యంలో 12.6, ఎల్లవ్వ పంటలో 12.5శాతం ఉంది. అంతకుముందు రోజుల క్రితమూ ఇంతే ఉన్నట్లు వారు తెలిపారు. తేమ 17శాతంలోపు ఉంటే కొనాలి కదా? ఎందుకు కొనలేదని కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న వెన్నెల మహిళా సంఘం ప్రతినిధిని అడిగితే సమాధానం చెప్పలేదు. తేమ ఇంకా తగ్గాలని ముక్తసరిగా చెప్పారు. వాస్తవానికి లారీలు దొరకడం లేదని, తేమ పేరుతో కొనుగోలులో రోజుల తరబడి జాప్యం చేస్తున్నారని ‘ఈనాడు’ పరిశీలనలో తేలింది.

ఇదీ ధాన్యం కొనుగోలు తీరు
* ఖరీఫ్‌లో దిగుబడి అంచనా-79,84,400 టన్నులు
* మొత్తం కొనుగోలు కేంద్రాలు-3,436
* ఈనెల 5నాటికి మద్దతు ధరకు కొన్నది-17,88,845 టన్నులు
* ఇప్పటికి కొనుగోలు చేసిన ధాన్యం 22శాతం.
* క్వింటాకు మద్దతు ధర-ఏ గ్రేడ్‌ రూ.1835, సాధారణ-రూ.1810
* ఎందరు రైతుల నుంచి కొన్నారు-3.50లక్షల మంది

అనేక అవాంతరాలు..
* కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడానికి లారీలకొరత తీవ్రంగా ఉంది.
* ఉదాహరణకు నిర్మల్‌ జిల్లా మామడ మండలంలో మహిళాసంఘాల ఆధ్వర్యంలో పొన్కల్‌, కొత్తసాంగ్వి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు.
* 213మందికి చెందిన 22,524 బస్తాల ధాన్యం కొని 16,499 బస్తాలను రైస్‌మిల్లులకు తరలించారు.
* రైస్‌మిల్లులకు వెళ్లిన లారీలు తొందరగా ఖాళీ కాక మిగిలిన 6,025 బస్తాలు కొనుగోలు కేంద్రాల్లో నిల్వఉన్నాయి.
* 99మంది రైతులు ధాన్యం విక్రయిస్తే 46మందికే డబ్బులు జమయ్యాయి.

మూడు కేంద్రాలు పెట్టి ముప్పుతిప్పలు
ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఊరి చుట్టూ మూడు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. తూకం వేసే, తేమ కొలిచే యంత్రాలు ఒక్కోటి మాత్రమే ఉంచారు. వాటినే రోజుకొక కేంద్రానికి పంపి అక్కడ తేమ కొలిచి, తూకం వేస్తున్నారు. దీంతోపాటు, కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల వారం రోజులుగా ధాన్యం అమ్మలేక ఎదురుచూస్తున్నాం. పేదమహిళా రైతులు ఈ కేంద్రాల్లో ధాన్యం ఆరబోసి అక్కడే కాపలా కూర్చుని బీడీలు చుట్టుకుంటున్నారు.

- వరి రైతులు, ముస్తాబాద్‌, సిరిసిల్ల జిల్లా

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.