
విద్యార్థినిని పాము కాటేసినా.. పాఠం ఆపని ఉపాధ్యాయుడు
కేరళలో ప్రాణాలు కోల్పోయిన బాలిక
వయనాడ్: తరగతి గదిలోనే ఓ చిన్న బొరియ. అందులో దాగుందో విష సర్పం. ఓ విద్యార్థినిని అది కాటు వేసింది. అలాంటి సందర్భాల్లో క్షణాల్లో స్పందించాల్సిన ఉపాధ్యాయుడు ఏమాత్రం పట్టించుకోలేదు. అదేదో చిన్న గాయంలా ఉందని, ఆమె తండ్రి వచ్చి చికిత్స చేయిస్తారని పాఠం కొనసాగిస్తూపోయారు. పలువురు ఉపాధ్యాయుల వద్ద కార్లున్నా పాపను ఆస్పత్రికి తీసుకెళ్ల లేదు. చివరకు ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకొంది.
సుల్తాన్ బతేరీలో ప్రభుత్వ వృత్తివిద్య పాఠశాలలో షెహల షెరిన్ (10) ఐదో తరగతి చదువుతోంది. ఆ పాఠశాల భవనం చాలా పాతది. బుధవారం మధ్యాహ్నం ఆ పాప కాలు తరగతి గదిలో ఉన్న చిన్నపాటి బొరియలో ఇరుక్కుపోయింది. అందులో ఉన్న పాము ఆమెను కాటు వేసింది. బాధతో ఆమె విలవిల్లాడిపోయింది. సహచర విద్యార్థులు ఎంత ప్రాధేయపడినా ఉపాధ్యాయుడు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించలేదు. కాలుకు మేకులాంటిది గీరుకుపోవడం వల్ల చిన్న దెబ్బ తగిలి ఉంటుందని వారిని నోరు మూయించారు. బాలిక తల్లిదండ్రులు వచ్చేసరికే ఆమె కాలు నీలం రంగులోకి మారిపోయింది. నాలుగు ఆస్పత్రులకు తిప్పినా ఎక్కడా పాముకాటుకు మందు ఇవ్వలేదు. 90 కి.మీ. దూరంలోని కోజికోడ్ వైద్య కళాశాలకు తీసుకుపోవాలని చెప్పి పంపించేశారు. గంట సేపటి తర్వాత వైద్య కళాశాలకు తీసుకువెళ్తుండగానే ఆమె చనిపోయింది. దీనిపై ఆగ్రహోదగ్రులైన స్థానికులు గురువారం ఆ పాఠశాలను ముట్టడించి, ఉపాధ్యాయులపై దాడికి ప్రయత్నించారు. బాధ్యులపై గట్టి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ మంత్రి సి.రవీంద్రనాథ్ ప్రకటించారు. మానవ హక్కుల కమిషన్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. పాముకాటు ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ కేరళ సీఎంకు లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి దుర్భర పరిస్థితులపై తక్షణం దృష్టి సారించాలన్నారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ