close
భూమి హక్కు.. బదిలీకో బ్యాంకు!

టీడీఆర్‌పై జీహెచ్‌ఎంసీ ప్రణాళిక
సులువుగా భూ అభివృద్ధి హక్కుల కొనుగోలుకు వీలు
నెల రోజుల్లో అందుబాటులోకి
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

భూ అభివృద్ధి బదలాయింపు హక్కులు పొందిన పౌరులు వాటిని మరింత సులభంగా అమ్ముకోడానికి ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) నిర్ణయించింది. ఇందుకు వీలుగా టీడీఆర్‌ బ్యాంకు ఏర్పాటు చేసేలా ఆన్‌లైన్‌లో ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తోంది.

టీడీఆర్‌ ఎందుకొచ్చిందంటే...
మహానగరంలో రూ.వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను మొదలుపెట్టింది. వివిధ నిర్మాణాలు, పలు అభివృద్ధి పనులకు భూసేకరణ చేయాల్సి వస్తోంది. కొన్ని చోట్ల నిర్మాణ వ్యయంతో సమానంగా ఇది ఉంటోంది. ఈ భారాన్ని తగ్గించడానికి కొన్నేళ్ల కిందటే టీడీఆర్‌ (భూ అభివృద్ధి బదలాయింపు హక్కు, టాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌) పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉదాహరణకు భూసేకరణలో భాగంగా ప్రభుత్వం ఒకవ్యక్తి నుంచి వంద గజాల స్థలాన్ని తీసుకుంటే బదులుగా మరో చోట సొంత స్థలంలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనుమతి ఇచ్చిన దానికన్నా అదనంగా అంతస్తులను నిర్మించుకోవచ్చు. లేని పక్షంలో ఈ హక్కును అమ్ముకోవచ్చు. ఈ విధానాన్ని మరింతగా ప్రోత్సహించడానికి నాలుగింతలు అంటే 100 గజాలకు 3600 చదరపు అడుగుల నిర్మాణ హక్కులను ఇవ్వడానికి రెండేళ్ల కిందటే ప్రభుత్వం అంగీకరించింది.

ఇప్పుడు ఇలా చేయబోతున్నారు...
టీడీఆర్‌ విక్రయిద్దామనుకునే వారి  వివరాలు కొనుగోలు చేసే వారికి  అందుబాటులో ఉండటంలేదు. అనేకమంది బిల్డర్లు తమకు అనుమతి ఇచ్చిన అంతస్తులకంటే అధికంగా నిర్మాణం చేయడానికి ఈ హక్కులను కొనే అవకాశం ఉంటుంది. అందుకే హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియజేయడం కోసం ఒక బ్యాంకును ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. అధికారులు దీనికి అనుగుణమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బల్దియాలో భవనాల అనుమతి కోసం నగర ప్రణాళికా విభాగానికి డీపీఎంఎస్‌ అనే వెబ్‌సైట్‌ ఉంది. అందులోనే ప్రత్యేకంగా ‘టీడీఆర్‌ బ్యాంకు’ అని ఒక సౌకర్యం కల్పించనున్నారు. ఈ బ్యాంకులో టీడీఆర్‌ కలిగి ఉన్న అందరి పేర్లు, ఫోన్‌ నంబర్లతోపాటు అన్ని వివరాలను నమోదు చేస్తారు. ‘నాకు టీడీఆర్‌ కావాలి’ అని ఇక్కడ మెసేజ్‌ పెడితే చాలు.. హక్కులు కలిగి ఉన్న వారు వెంటనే స్పందించే ఏర్పాటు చేస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ టీడీఆర్‌తో కేవలం బల్దియా పరిధిలోనే కాకుండా ఏడు జిల్లాల్లోని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో కూడా నిర్మాణం చేసుకోవచ్చు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.