
ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతల దీక్ష విరమణ
సడక్ బంద్‌ను విరమించుకున్న నాయకులు
కార్మికులను చేర్చుకోవడంపై వేచి చూసే ధోరణిలో ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్, ఉస్మానియా ఆసుపత్రి - న్యూస్‌టుడే
తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ముందుకు వెళ్లాలా? వెనక్కు తగ్గాలా? అన్న అంశంపై కార్మిక సంఘాలు మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నాయి. సమ్మె విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు కార్మిక శాఖను సోమవారం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాల ఐకాస నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు నిరాహార దీక్షను విరమించారు. మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె అంశం చర్చనీయాంశంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు 45 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని కార్మిక సంఘాల నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించాలని ఐకాస, అఖిలపక్షం నేతలు నిర్ణయించారు. ఆ సమావేశంలో సంఘాల నుంచి అభిప్రాయాన్ని తీసుకున్న మీదట సమ్మె కొనసాగించాలా? విరమించాలా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ సమ్మె చట్టబద్ధమా, వ్యతిరేకమా నిర్ణయించే అధికారం కార్మిక శాఖ (లేబర్) కోర్టుకు ఉందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన దరిమిలా.. తీర్పు పూర్తి ప్రతిని పరిశీలించి మంగళవారం భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తామని ఐకాస కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైకోర్డు తీర్పు అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలోనే అందుబాటులో ఉన్న ఐకాస, అఖిలపక్ష ప్రతినిధులు సమావేశమై మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేయాలని నిర్ణయించారు. పోలీసుల అరెస్టుల తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ఐకాస నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తెజస అధ్యక్షుడు కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగేందుకు వీలుగా సడక్ బంద్‌ను విరమించుకున్నామన్నారు. సమ్మెతోపాటు ఆందోళనలు యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు కోదండరాం మాట్లాడుతూ.. ఆర్టీసీ ఐకాస నేతల ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ఐకాస నాయకులను తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు పరామర్శించారు.
తీర్పు ప్రతి అందాకే నిర్ణయం: కార్మికశాఖ
ఆర్టీసీ సమ్మెపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు సూచించడంతో కార్మికశాఖ పలు అంశాలపై అధ్యయనం చేస్తోంది. హైకోర్టు తీర్పు ప్రతి అందిన తరువాత అందులోని అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను కార్మిక న్యాయస్థానానికి అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. న్యాయవివాదంతో పాటు సమ్మె చట్టబద్ధతపై చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో కార్మికశాఖ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.
ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
విధుల్లో చేరేందుకు వచ్చే ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించవద్దని న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరింది. ఈ సూచనపై ప్రభుత్వం ఏ తీరుగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభిస్తుందని కార్మికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విధుల్లో చేరాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు దఫాలు కార్మికులను ఆహ్వానించినా వారి నుంచి అంతగా స్పందన రాలేదు. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పు ప్రతి అందిన తరవాత పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. విధుల్లో చేరడానికి కార్మికులు ముందుకు వస్తే ఎలా వ్యవహరించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించాల్సి ఉంది. సమ్మెపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని కార్మిక సంఘాలు ప్రకటించిన నేపథ్యంతో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకునేది ఏమీ లేదన్న అభిప్రాయం తెరాస వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ఆర్టీసీ బస్సులు తగినన్ని లేకపోవటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 6,487 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
‘కార్మికులను దగా చేసిన ఆర్టీసీ ఐకాస’
విలీనం పేరుతో అధికార కార్మిక సంఘమైన టీఎంయూతో కూడిన ఐకాస.. కార్మికులను దగా చేసిందని ఎన్ఎంయూ ఛైర్మన్, ఆర్టీసీ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విలీనమే ప్రధాన డిమాండ్‌గా కార్మికులను రెచ్చగొట్టి సమ్మె చేపట్టారన్నారు. ఫలితం రాకముందే విలీనం డిమాండును ఉపసంహరించుకున్నారని విమర్శించారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!