close
జస్టిస్‌ బోబ్డే ప్రమాణ స్వీకారం

రాష్ట్రపతిభవన్‌లో నిరాడంబరంగా కార్యక్రమం
మాతృమూర్తికి పాదాభివందనం
ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి కేసుల విచారణ

దిల్లీ: భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే(63) సోమవారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్‌ బోబ్డే ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఆయన 17 నెలలపాటు చీఫ్‌జస్టిస్‌ పదవిలో కొనసాగుతారు. 2021 ఏప్రిల్‌ 23న పదవీ విరమణ పొందుతారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే అక్కడే ఉన్న తన మాతృమూర్తికి పాదాభివందనం చేసి ఆశీస్సులందుకున్నారు. వయోవృద్ధురాలైన ఆమెను నిలువుగా కుర్చీలాగా కూడా మార్చగలిగిన స్ట్రెచర్‌పై దర్బార్‌ హాలుకు తీసుకుని వచ్చారు. జస్టిస్‌ బోబ్డే బంధువులు, స్నేహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

హాజరైన ప్రముఖులు
ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తదితరులతో పాటు పలువురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. చీఫ్‌జస్టిస్‌(విశ్రాంత) రంజన్‌ గొగొయి అక్కడే ఉన్న కేంద్రమంత్రులు, సీనియర్‌ రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి కరచాలనం చేయడం కనిపించింది. నూతన సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ బోబ్డేను సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాకేశ్‌ ఖన్నా తదితరులు పలువురు కలిసి అభినందించారు.

ఇదో విశేషం....
ప్రమాణస్వీకారం అనంతరం ఉదయం 11.30 గంటలకు సుప్రీంకోర్టులో కేసుల విచారణను చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే చేపట్టారు. కిక్కిరిసి ఉన్న కోర్టురూంలో వేదికపై జస్టిస్‌ బోబ్డే చెంతనే జమైకా చీఫ్‌జస్టిస్‌ బ్రియాన్‌ స్కైస్‌, భూటాన్‌ సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జి జస్టిస్‌ క్యున్‌లే షెరింగ్‌లతో కలిసి ఆసీనులవడం విశేషం.

నాన్న న్యాయవాది...
చీఫ్‌జస్టిస్‌ బోబ్డే 1956 ఏప్రిల్‌ 24న నాగ్‌ పుర్‌లో జన్మించారు. ఆయన తండ్రి అరవింద్‌ శ్రీనివాస్‌ బోబ్డే పేరొందిన న్యాయవాది. జస్టిస్‌ బోబ్డే నాగ్‌పుర్‌ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. 1978లో మహారాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1998లో ఆయన సీనియర్‌ న్యాయవాదిగా నియుక్తులయ్యారు. 2000 సంవత్సరం మార్చి 29న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2012 అక్టోబరు 16న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా,  2013 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


కీలక కేసులు... తీర్పులు...

*  సుదీర్ఘకాలం పాటు అపరిష్కృతంగా ఉన్న ‘అయోధ్య’ కేసులో చరిత్రాత్మక తీర్పు చెప్పిన అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్‌ బోబ్డే సభ్యుడు.
*  గోప్యత హక్కు భారత్‌లో రాజ్యాంగపరమైన రక్షణ ఉన్న ప్రాథమిక హక్కంటూ 2017లో ఏకగ్రీవ తీర్పునిచ్చిన నాటి సీజేఐ జస్టిస్‌ జేఎస్‌ కేహర్‌ సారథ్యంలోని తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనంలో కూడా జస్టిస్‌ బోబ్డే సభ్యుడిగా ఉన్నారు.
*  సీజేఐ(విశ్రాంత) జస్టిస్‌ రంజన్‌గొగొయిపై వచ్చిన ఆరోపణలను కొట్టేస్తూ...ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన త్రిసభ్య అంతర్గత సంఘానికి జస్టిస్‌ బోబ్డే సారథ్యం వహించిన విషయం గమనార్హం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.