close
తెలుగును ఇక్కడ కాక విదేశాల్లో బోధిస్తారా?

అమ్మభాష అభివృద్ధి తెలుగు రాష్ట్రాల బాధ్యత
మాతృభాషతోనే మనోవికాసం
తెలుగు స్థానంలో ఆంగ్లం తగని పని
ఇది స్వాగతించే నిర్ణయం కాదు
ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య గణేష్‌ ఎన్‌.డెవీ

మాతృభాషలో విద్యాబోధన ద్వారానే పిల్లల్లో మానసిక వికాసం సాధ్యం.. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రాథమిక విద్య అంతా మాతృభాషలోనే సాగుతోంది. అలాంటప్పుడు భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కాక, తెలుగును మరెక్కడ బోధిస్తారు?..అంటూ ప్రశ్నించారు ప్రముఖ భాషాశాస్త్రవేత్త ప్రొ।।గణేష్‌ ఎన్‌.డెవీ. దేశంలో పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పేరుతో వివిధ భాషలపై జరిగిన అధ్యయనానికి ఆయన సారథ్యం వహించారు. మరాఠీ, గుజరాతీ, ఇంగ్లిషులో 90కి పైగా పుస్తకాలు రాసి, సంపాదకత్వం నెరపిన డెవీ.. బరోడాలో భాషా పరిశోధన, ప్రచురణ కేంద్రం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం కర్ణాటకలోని ధార్వాడ కేంద్రంగా భాషలపై అధ్యయనం చేస్తున్నారు.. తెలుగు మృతభాషగా మారుతోందని గతంలోనే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక విద్యలో తెలుగుకు బదులు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో..ఆ ధోరణి తగదంటూ ప్రొ।।డెవీ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన ఈనాడు ప్రతినిధి ఎంఎల్‌ నరసింహారెడ్డితో మాట్లాడారు.

ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తెలుగులో బోధనకు బదులు ఆంగ్లం ప్రవేశపెట్టడం సరైన నిర్ణయమేనా..?
జ: ఈ నిర్ణయం తెలుగు భాషకు మంచిది కాదు. మాతృభాషలో విద్యాబోధన ద్వారా పిల్లల్లో మానసిక వృద్ధి ఉంటుందన్నది శాస్త్రీయంగా రుజువైంది. పిల్లలకు అమ్మభాషలోనే విద్య అందించాలి. ఒకవేళ ఇంగ్లిషు మాతృభాష అయితే అప్పుడు అందులోనే చదువుకొనే అవకాశం ఇవ్వాలి. ఇలాకాక పిల్లలపై చిన్న వయస్సులోనే ఆంగ్లాన్ని రుద్దితే వారి మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది. అసలు తెలుగును ఆంధ్రప్రదేశ్‌లో కాక ఇంగ్లండులోనో, అమెరికాలోనో బోధిస్తారా? దేశానికి స్వేచ్ఛ లభించాక భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశే. కాబట్టి తెలుగు భాషను సక్రమంగా అభివృద్ధి చేయడమనేది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల ప్రత్యేక బాధ్యత. ఎలా చూసినా తెలుగు స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం స్వాగతించదగిన అంశం కాదు.

ఈ మార్పుతో విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందంటారా?
ఉద్యోగాల వరకు వచ్చినపుడు ఇంగ్లిషు తెలిసి ఉండటం అవకాశాలను పెంచుతుంది. ఇది ఉన్నత విద్యలో అంటే.. సీనియర్‌ హైస్కూలు/డిగ్రీస్థాయిలో ఇంగ్లిషును ప్రవేశపెట్టడం ద్వారానే సాధ్యమవుతుంది. విదేశీభాషను ప్రవేశపెట్టడం వెనక శాస్త్రీయ ఆలోచన ఇదే. ప్రభుత్వం మాధ్యమం మార్పు చేయడం వెనక ఉద్దేశం పిల్లల ప్రయోజనాలు కాదు, ఇంగ్లిషు మీడియం పాఠశాలలు నడిపేవారి ప్రయోజనాలుండొచ్చు.

ఒకవైపు కాన్వెంటు విద్య పిల్లల్లో నైపుణ్యాన్ని హరిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఇంకోవైపు పోటీతత్వం పేరుతో ప్రభుత్వం తెలుగు మాధ్యమం స్థానంలో ఇంగ్లిషును ప్రవేశపెడుతోంది. దీన్నెలా అర్థం చేసుకోవాలి?
ఈ ధోరణి మున్ముందు తెలుగును నామమాత్రంగా అర్థం చేసుకునే దుస్థితిని సృష్టిస్తుంది. చక్కని తెలుగును రాయగలిగే తరాన్ని లేకుండా చేస్తుంది. ఇది తెలుగు సాహిత్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాలి.

మీ దృష్టిలో తెలుగుభాష ఇప్పటికే ప్రమాదంలో ఉంది. ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందంటారా..?
తెలుగు చాలా వేగంగా దైన్య స్థితిలోకి జారుకుంటోంది. హైదరాబాద్‌ వీధుల్లోని బోర్డులు చూడండి. కార్యాలయాల్లో వ్యక్తుల మధ్య సంభాషణలు వినండి. న్యాయస్థానాలు, విశ్వవిద్యాలయాల్లో మాట్లాడే భాషను చూడండి. వీటిని పరిశీలిస్తున్న ఎవరికైనా సులభంగా అర్థమయ్యేది ఏమిటంటే.. రెండు మూడు దశాబ్దాల కంటే ముందు నుంచే తెలుగును చాలా తక్కువగా వాడుతున్నారని. ఇది దేనికి చిహ్నం? ఇలాంటి అనుచిత పరిస్థితి వల్ల ఏ భాష అయినా భద్రంగా ఉంటుందని భావించగలమా?

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులకు కొంత శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంగ్లిషు మీడియంలో బోధన సాధ్యమవుతుందా?
భారతదేశంలోని పాఠశాలలు ఇంగ్లిషు బోధనకు చాలా దూరంగా ఉన్నాయి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వచ్చే మార్పు స్వల్పంగానే ఉంటుంది. విద్యార్థుల ఇళ్లలో ఇంగ్లిషులో మాట్లాడే వాతావరణం ఉంటే మార్పు వస్తుంది. కానీ మనందరికీ తెలుసు సమీప భవిష్యత్తులో ఇది అసాధ్యమని.

ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో మాతృ భాష పరిస్థితి..?

ప్రపంచంలో ఇంగ్లాండు, ఫ్రాన్స్‌, రష్యా, ఇటలీ, స్పెయిన్‌ సహా అనేక దేశాలు మాతృభాషలోనే పిల్లలకు విద్యాబోధన చేస్తున్నాయి. ఉన్నత విద్య దాదాపు విదేశీ భాషలో ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. ఉన్నత పాఠశాల విద్య సైతం అదే బాటలో పయనిస్తోంది. అనేక ప్రాచీన, విలక్షణ భాషలకు నెలవైన దేశంలో ఇది దురదృష్టకర పరిస్థితి. ఎక్కువ మంది మాట్లాడే భాషలను తీసుకొంటే ప్రపంచంలోని సుమారు ఆరువేల భాషల్లో తెలుగు తొలి 20 స్థానాల్లో ఉంది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో తెలుగును సంరక్షించాల్సిన అవసరం ఉంది.

- ఈనాడు హైదరాబాద్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.