close
30న సకల జనుల సమరభేరి

ప్రతిరోజూ వివిధ రూపాల్లో నిరసనలు
ఆర్టీసీ ఐకాస, అఖిలపక్షం సమావేశంలో నిర్ణయం

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస, రాజకీయ పార్టీల అఖిలపక్షం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 30న సకల జనుల సమరభేరిని నిర్వహించనుంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను సమీకరించాలని నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళా నిలయంలో ఐకాస, అఖిలపక్షం సమావేశం జరిగింది. కార్యాచరణను అనుసరించి ఆందోళనలు చేపట్టాలని.. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఏం చేయాలన్న దానిపై మరోదఫా సమావేశమవ్వాలని ఐకాస, అఖిలపక్షం నిర్ణయించింది. హైకోర్టు సూచనలను ప్రభుత్వం పట్టించుకోకపోవటం పరాకాష్ఠ అని పేర్కొంది. సమావేశంలో ఐకాస ప్రతినిధులు ఇ.అశ్వత్థామరెడ్డి, కె.రాజిరెడ్డి, వీఎస్‌రావు, ఎస్‌.బాబు, శ్రీహరి, సుధ, అఖిలపక్షం నుంచి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెదేపా రాష్ట్రాధ్యక్షుడు ఎల్‌.రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, భాజపా నేత జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు.

ప్రభుత్వం దమనకాండను ఆపాలి: అశ్వత్థామరెడ్డి
అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం దమనకాండను ఆపాలి. సమ్మెను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. నాయకులను, కార్మికులను భయపెట్టాలని చూస్తోంది. అది సాధ్యం కాదు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి ధైర్యంగా పోరాడతాం.’ అని అన్నారు.
‘తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల పేరుతో ప్రభుత్వం తమ పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాత్కాలిక సిబ్బంది కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. మానవతా దృక్పథంతో ఆలోచించాలి. వారు విధులకు దూరంగా ఉండాలి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది. మహిళా కార్మికులను కూడా అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. తమకు మద్దతుగా విద్యార్థి సంఘాలు పోరాట పటిమను చూపుతున్నాయి. సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపునకు మేము పూర్తి మద్దతు ఇస్తాం. సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు భారీ కార్యాచరణను ఐకాస, అఖిలపక్షం సంయుక్తంగా ఖరారు చేశాô.’ అని పేర్కొనారు. ఆర్టీసీలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని, వాటి భర్తీ చేయాలని కో-కన్వీనర్‌ కె.రాజిరెడ్డి అన్నారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు తెలంగాణ సమాజం ఒక్కటైంది, ఇది శుభపరిణామమని కో-కన్వీనర్‌ వీఎస్‌రావు పేర్కొన్నారు.

ఏపీఎస్‌ఆర్టీసీ ఐకాస మద్దతు
తెలంగాణ ఆర్టీసీకి కార్మికులకు మద్దతుగా ఈ నెల 24న విజయవాడలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నేత సుందరయ్య చెప్పారు. ఐకాసకు మద్దతు తెలిపేందుకు ఆయన హైదరాబాద్‌ వచ్చారు. అక్కడ చేపట్టబోయే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు.


కార్యాచరణ ఇదీ..

21న: ఆర్టీసీ కార్మిక కుటుంబాలతో అన్ని డిపోల వద్ద బైఠాయింపు
22: కార్మికుల పొట్ట కొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు విన్నపాలు
23: ప్రజాప్రతినిధుల మద్దతు కోరుతూ వినతులు
24: ఆర్టీసీ మహిళా కండక్టర్లతో దీక్షలు
25: జాతీయ రహదారుల రాస్తారోకో, దిగ్బంధం
26: ప్రభుత్వ మనసు మారాలని ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్షలు
27: దీపావళి పండుగ సందర్భంగా కార్మికులకు జీతా లు లేవంటూ నిరసన
30: రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమందితో సకల జనుల సమరభేరి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.