close
ఔషధ నగరికి కేంద్రం రూ. 3,418 కోట్లివ్వాలి

చౌకధరకు సహజవాయువును సరఫరా చేయాలి
నిమ్జ్‌ హోదాకు అనుగుణంగా వసతులు
అంశాల వారీగా సాయం కోసం కేంద్ర మంత్రులకు లేఖలు
సమీక్షలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్‌ ఔషధ నగరి (ఫార్మాసిటీ)కి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు కోరారు. ఔషధనగరికి నిమ్జ్‌ హోదా ఇచ్చినందున మౌలిక వసతుల కల్పన కోసం రూ. 1318 కోట్ల గ్రాంటును, అంతర్గత సదుపాయాలు, ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రం వంటి సాంకేతిక సదుపాయాలకు 50 శాతం ఖర్చు కింద రూ. 2100 కోట్లు విడుదల చేయాలన్నారు. ప్రాజెక్టు ఇంధన అవసరాలకోసం తక్కువ ధరకు సహజవాయువును కేటాయించాలన్నారు. అంశాల వారీగా సాయం కోసం కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌లకు లేఖలు రాశామని వెల్లడించారు. ఔషధనగరిపై ఆదివారం ఆయన తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు వ్యయం, కేంద్ర సాయం ఇతర అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్‌ ఔషధనగరి ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత పార్క్‌. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా దీనిని గుర్తించింది. నిమ్జ్‌ హోదాను ఇచ్చింది. ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ, అంతర్జాతీయ ఔషధ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఔషధనగరిని కాలుష్య రహితంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నాం. అంతర్జాతీయ ఔషధ విశ్వవిద్యాలయం, లాజిస్టిక్స్‌ పార్క్‌, శిక్షణ, పరీక్షల పరిశోధనశాలలు, ఉమ్మడి అభివృద్ధి కేంద్రంతో పాటు అంకురాలకు ప్రత్యేక హబ్‌ ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే మొత్తం 19,333 ఎకరాలకు ప్రణాళిక పూర్తయింది. మొదటి దశలో భాగంగా 8,400 ఎకరాలకు ఆకృతులు పూర్తయ్యాయి. కేంద్రం పర్యావరణ అనుమతులు సైతం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వాహక సంస్థ (స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌)ను ఏర్పాటుచేసింది. మొదటి దశ పనులను ప్రారంభించాం. దీని ద్వారా రూ. 64,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం  ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5.60 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇది హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌కు అనుసంధానంగా ఉంటుంది. ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా కేంద్రం ఇతోధిక సాయం అందించాలని కేంద్రమంత్రులను లేఖల ద్వారా కోరాం. వారి నుంచి స్పందన వస్తుందని భావిస్తున్నాం’’ అని తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.