close
ప్రతిభ ఎందుకు? మేమున్నాంగా అందుకు

పాలనాధికారుల పోస్టుకు డిగ్రీ, పీజీలో ప్రథమ శ్రేణిని అర్హతగా నిర్దేశించిన పాలక మండలి
కుదరదంటున్న జయశంకర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు
ఐదేళ్లుగా భర్తీ ప్రక్రియకు అవరోధం

ఈనాడు, హైదరాబాద్‌: వారంతా ఉన్నత విద్యను బోధించే ప్రొఫెసర్లు. ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటూ నిత్యం విద్యార్థులకు హితవు పలుకుతారు. వారి విషయానికి వచ్చేసరికి ‘‘ప్రతిభ’’తో పనేముంది? అంటూ అడ్డగోలుగా వాదిస్తున్నారు. తమకే పోస్టులు ఇవ్వాలంటూ పైరవీలు చేస్తున్నారు. ఈ విచిత్ర వ్యవహారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఐదేళ్లుగా సాగుతోంది. ఈ కారణంగా వర్సిటీలో కీలకమైన పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది.

ఇదీ సమస్య
వర్సిటీలో ఉప కులపతి(వీసీ) తరవాత పరిశోధన(డీఆర్‌), విస్తరణ, నియమావళి విభాగాలకు వేర్వేరుగా ముగ్గురు సంచాలకులు, విద్యార్థుల వ్యవహారాల డీన్‌(డీఎస్‌ఏ), పీజీ విద్యా విభాగం డీన్‌(డీపీజీ) ఇలా ఐదుగురు పాలనాధికారులుండాలి. పాలనలో అవి కీలకం కావడంతో ఆయా పోస్టులను నిపుణులు, ప్రతిభ గల వారితో భర్తీ చేయాలని వర్సిటీ పాలకమండలి గతంలో తీర్మానం చేసింది. ప్రొఫెసర్‌గా కనీసం 8 ఏళ్లు పనిచేసి ఉండాలని, తప్పనిసరిగా వ్యవసాయ డిగ్రీ, పీజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధనను నిర్దేశించింది.

ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లే కారణమా?
ఈ నిబంధనను కొందరు సీనియర్‌ ప్రొఫెసర్లు తప్పుపడుతున్నారు. ప్రథమ శ్రేణి అర్హత అవసరం లేదని, 8 ఏళ్ల అనుభవాన్ని పరిగణనలోనికి తీసుకుని నియామకాలు చేపట్టాలని వాదిస్తున్నారు. ఈ మేరకు పాలక మండలిపై ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తెస్తూ ఐదేళ్లుగా నియామకాలు జరగకుండా అడ్డుకుంటున్నట్టు సమాచారం. ‘‘ప్రొఫెసర్లుగా పనిచేసే వారే ప్రతిభ అనే కొలమానాన్ని పట్టించుకోకపోవడం విచిత్ర పరిస్థితి. ప్రతిభ లేకుండానే శాస్త్రవేత్తలుగా నియమితులైన వారి వల్ల వర్సిటీలో వ్యవసాయ పరిశోధనలు సరిగా జరగడం లేదు. అన్ని విభాగాలకు నిపుణులే పాలనాధికారులుగా ఉంటే అలాంటి వారి బండారం బయటపడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా వాళ్లు నియామకాలను అడ్డుకుంటున్నారు’’ అని ఓ సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త ‘ఈనాడు’తో వాపోయారు. కారణమేదైనా దీర్ఘకాలంగా పాలనాధికారులు లేకపోవడం, ఇన్‌ఛార్జులే దిక్కవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఉద్యాన, పశువైద్య వర్సిటీలకు వీసీలే లేరు
కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయానికి గత ఐదేళ్లుగా కనీసం శాశ్వత వీసీలను కూడా నియమించ లేదు. పాలనాధికారులుగానూ ఇన్‌ఛార్జులే కొనసాగుతున్నారు. శాశ్వత అధికారులు లేకపోవడంతో కింది స్థాయిలో శాస్త్రవేత్తలు, బోధన, పరిశోధనలపై పర్యవేక్షణ కరవైందని విద్యార్థులు ఆక్షేపిస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.