close
ఆర్టీసీ కార్మికుల భిక్షాటన

 సంఘీభావం తెలుపుతూ పలు సంఘాల ర్యాలీలు
 కేసీఆర్‌ దిష్టిబొమ్మతో అంతిమయాత్ర
 సమ్మెకు మద్దతుగా ఉమ్మడి ఉద్యమం
జాక్టో, యూఎస్పీసీల నిర్ణయం
 6365 బస్సులు నడిపామన్న ఆర్టీసీ

బుధవారం నాటికి 64 శాతానికి పైగా బస్సులు రోడ్లపైకి వచ్చాయని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీకి చెందిన 4424 బస్సులతోపాటు 1941 అద్దె బస్సులు కలిపి 6,365 బస్సులు నడిపినట్లు తెలిపింది. 1956 బస్సుల్లో టికెట్ల జారీ, 229 బస్సుల్లో టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది.
ఈనాడు, హైదరాబాద్‌, ఖమ్మం, న్యూస్‌టుడే యంత్రాంగం:  ఆర్టీసీ సమ్మె విస్తృతమవుతోంది. బుధవారానికి 12వ రోజుకు చేరుకున్న సమ్మెకు కార్మిక సంఘాలతోపాటు విపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. హైదరాబాద్‌లోని 29 డిపోలు నిరసన కార్యక్రమాలతో దద్దరిల్లాయి. ఎంజీబీఎస్‌లో టీఎంయూ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద వందలాది కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. కంటోన్మెంట్‌ డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు.  ర్యాలీగా బయలుదేరి జేబీఎస్‌లో ఆందోళనకు దిగారు. తెజస అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు.

గుండ్లు గీయించుకున్న కార్మికులు
ఆర్టీసీ కార్మికులు వీఎస్‌టీ కూడలిలో గుండ్లు గీయించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరిట పిండ ప్రదానం చేశారు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ.. భిక్షాటన చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో  కార్మికులు ఆత్మాహుతికి పాల్పడతామని హెచ్చరిస్తూ మెడకు ఉరి బిగించుకున్నారు. ఖమ్మంలో అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. జగిత్యాల బస్‌ డిపో ఎదుట కరీంనగర్‌ రహదారిపై ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. ఏడుగురు మహిళా కండక్టర్లు, వివిధ సంఘాలకు చెందిన మరో పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తోపులాటలో పట్టణానికి చెందిన ఉమారాణి అనే ఆర్టీసీ మహిళాకండక్టర్‌ సొమ్మసిల్లి పడిపోయారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల ఐకాస నేతృత్వంలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం,  అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో  ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర బంద్‌కు తెలంగాణ కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఐకాస మద్దతు ప్రకటించింది. సుందరయ్య కళానిలయంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో తెజస అధ్యక్షుడు కోదండరాం,  రావుల చంద్రశేఖర్‌రెడ్డి,  రామచందర్‌రావు,  చాడ వెంకట్‌రెడ్డి, పీఎల్‌.విశ్వేశ్వర్‌రావు, ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడారు.

ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని మహిళ మృతి
ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని నిజామాబాద్‌లో బుధవారం ఓ మహిళ మృతిచెందింది. యల్లమ్మగుట్టకు చెందిన హబీబా బేగం (45)  స్థానిక ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా కంఠేశ్వర్‌ నుంచి బస్టాండు వైపు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. బస్సు డ్రైవర్‌ కార్షి కుమార్‌పై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో తాత్కాలిక డ్రైవర్‌ నరేష్‌ సిద్దిపేట ఆర్టీసీ డిపో బస్‌ను కామారెడ్డి పట్టణంలో వేగంగా నడిపి పలు వాహనాలను ఢీకొట్టాడు.

సంఘీభావం...

* ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) నిర్ణయించాయి.
* ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాసకు అఖిలభారత రోడ్డు రవాణా సమన్వయ కమిటీ మద్దతు పలికింది. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది.

చర్చలెందుకు జరపరు?

* ఆర్టీసీ కార్మికుల బందు పిలుపునకు మద్దతు తెలుపుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడలో ప్రకటించారు.
* కేసీఆర్‌ మొండివైఖరిని వీడి ఆర్టీసీ ఐకాస నాయకులతో చర్చలకు సిద్ధం కావాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ కూడా ఇదే డిమాండ్‌ చేసింది. సమ్మెను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వరంగ ఉద్యోగులసంఘాల సమాఖ్య కోరింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.