close
నేడు కేసీఆర్‌ ప్రచారం

  హుజూర్‌నగర్‌ సభలో పాల్గొననున్న తెరాస అధినేత
  భారీగా జన సమీకరణకు సన్నాహాలు
  ఆరున్నర నెలల తర్వాత మళ్లీ ప్రచార బరిలోకి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు హుజూర్‌నగర్‌లో గురువారం ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హుజూర్‌నగర్‌ గుట్ట సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. కేసీఆర్‌ చివరిసారిగా గత లోక్‌సభ ఎన్నికల్లో ఏప్రిల్‌ 8న వికారాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ఆపై మళ్లీ ప్రచారబరిలోకి దిగుతుండటం ఇదే ప్రథమం. ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌.. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున స్వయంగా ప్రచారం చేసేందుకు నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం ఆయన 12.30కి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరుతారు. నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ ప్రసంగం అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. నియోజకవర్గ పరిస్థితిని సమీక్షిస్తారు. గురువారం రాత్రి అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.

గత ఎన్నికప్పుడూ ఇదే వేదిక నుంచి..
రామస్వామి గుట్ట వద్ద 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా సీఎం సభ నిర్వహించారు. తాజాగా అక్కడి నుంచే మరోసారి ఆయన ప్రసంగించనున్నారు. ఈ నెల 21న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు జరగనుండగా తెరాస పార్టీ బలగాలను పూర్తిస్థాయిలో మోహరించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో కార్యాచరణ సాగుతోంది. నియోజకవర్గంలో కీలకమైన గిరిజనుల, మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు మంత్రి సత్యవతిరాఠోడ్‌ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుజూర్‌నగర్‌, గరిడేపల్లి పట్టణం, ఏడు మండలాల బాధ్యతలను తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ పర్యటనతో ప్రచారానికి ఊపు వస్తుందని తెరాస అంచనా వేస్తోంది. సీఎం సభ కోసం 20 ఎకరాలను చదును చేశారు. భారీ వేదికను సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు రెండు పురపాలక సంఘాల నుంచి భారీగా జనసమీకరణకు యత్నాలు చేస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.