close
జీవశాస్త్రాల రాజధానిగా హైదరాబాద్‌

  ఈ స్థానాన్ని సుస్థిరం చేస్తాం
  ఫిబ్రవరిలో 17వ బయోఏషియా 2020 అంతర్జాతీయ సదస్సు
  మంత్రి కేటీఆర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: జీవశాస్త్రాల రంగంలో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ స్థానాన్ని సుస్థిరం చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీనోమ్‌వ్యాలీ, ఔషధనగరిల ద్వారా ఈ రంగాన్ని పెద్దఎత్తున విస్తరిస్తామని చెప్పారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన 17వ బయోఏషియా-2020 అంతర్జాతీయ సదస్సు వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, కమిషనర్‌ అహ్మద్‌ నదీం, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఎండీ వెంకట నరసింహారెడ్డి, జీవశాస్త్రాల విభాగం సంచాలకుడు, బయోఏషియా సదస్సు ముఖ్యకార్యనిర్వహణాధికారి శక్తినాగప్పన్‌ పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు జరిగే సదస్సుకు 55 దేశాలనుంచి 1800 మంది ఔషధ, జీవశాస్త్రాలు, బయోటెక్‌ తదితర రంగాల నిపుణులు, నోబెల్‌ పురస్కార గ్రహీతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘‘తెలంగాణకు బయోఏషియా బ్రాండ్‌గా ఉంది. హైదరాబాద్‌ జీవశాస్త్రాల రాజధానిగా ఎదగడంలో బయోఏషియా సదస్సు కీలక పాత్ర పోషించింది. 16 సంవత్సరాల నుంచి సదస్సు జరుగుతుండగా వాటిల్లో 93 దేశాల నుంచి 20 వేల మంది ప్రతినిధులు  పాల్గొన్నారు. దాదాపు రూ. 18000 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ కేంద్రంగా ఔషధ, జీవశాస్త్రాల రంగాలు భారీఎత్తున పురోగమిస్తాయి. ఔషధనగరికి త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. జీనోమ్‌వ్యాలీ 2 సిద్ధమవుతోంది. బయోఏషియా సదస్సు కేంద్రంగా మరోసారి అంతర్జాతీయంగా పెట్టుబడుల సమీకరణకు, కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రయత్నిస్తాం. రేపటి కోసం నేడు (టుడే ఫర్‌ టుమారో) అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుంది. సదస్సుకు స్విట్జర్లాండ్‌ భాగస్వామి కాగా, జర్మనీ సంయుక్త భాగస్వామిగా ఉంటుంది. అసోం, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర భాగస్వాములుగా ఉంటాయి. సదస్సులో అంకురాల ప్రోత్సాహంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 100కుపైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి’’ అని వివరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.