close
మెట్టు దిగండి

ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాలకు హైకోర్టు సూచన
పంతాలకు ఇది సమయం కాదు
ప్రజల ఇబ్బందుల్ని పట్టించుకోండి
వెంటనే చర్చల్ని ప్రారంభించండి
మానవీయ కోణంలో ఆలోచించండి
ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉండాలి
కార్మికులు బాధ్యతతో మెలగాలి: హైకోర్టు
తక్షణం ఎండీని నియమించాలంటూ ఆదేశం
విచారణ 18కి వాయిదా
ఈనాడు - హైదరాబాద్‌

ర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామంటున్నారు. ఇంకోవైపు సమ్మె పేరు చెప్పి విద్యాసంస్థల సెలవుల్ని పొడిగించారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇవి. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉండాలి. ఉద్యోగుల సమస్యల్ని సానుకూలంగా చూడాలి. పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. మహిళలు ఉద్యోగాలకు వెళ్లాలంటే కష్టంగా ఉంది. వృద్ధులు బయటికి రాలేకపోతున్నారు. కేవలం చట్టపరమైన పద్ధతులకే పరిమితం కాకుండా మానవీయ కోణంలో కూడా సమస్యల్ని చూడాలి. కార్మికుల పట్ల ప్రభుత్వం ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టండి. ఆర్టీసీకి తక్షణం రెగ్యులర్‌ ఎండీని నియమించడానికి చర్యలు తీసుకోండి. కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాం.

ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు

త్యవసర సర్వీసుల కింద ఉద్యోగాల్లో ఉన్నవారు సమ్మెల్లోకి దిగకూడదు. మీపై ఎస్మాను ఎందుకు ప్రయోగించరాదు. ప్రజలకు ఇబ్బందుల్ని సృష్టించే హక్కు మీకు లేదు. ప్రతి వివాదానికీ పరిష్కార మార్గం ఉంది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటిస్తే పరిస్థితి ఏమిటి? దీనివల్ల ఉద్యోగులకు నష్టం. సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయాలున్నాయి. పండుగలు...పాఠశాలల తెరిచే వేళ బస్సులను నిలిపివేస్తే ఎలా? ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలి. పరిష్కారానికి మార్గాలు చూడకుండా.. మొదటే తుదిగా వాడాల్సిన సమ్మె అనే బ్రహ్మాస్త్రాన్ని  వినియోగించేశారు. ఇక మిగిలిందేమిటి? వెంటనే చర్చలకు వెళ్లండి

ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఉన్నత న్యాయస్థానం హితవు

ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికసంఘాలు పంతాలు, పట్టింపులతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మొండి పట్టుదలలకు వెళ్లడానికి ఇది సమయం కాదని... గతాన్ని తవ్వుకుంటూ సమస్యను జటిలం చేయడం సరికాదని హితవు పలికింది. వివాదం చట్టపరంగానే పరిష్కారం కావాలంటే అన్ని వేళలా కుదరదంది. చట్టంవైపే చూడకుండా మానవీయతను దృష్టిలో ఉంచుకుని సమస్యలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలంది. ఇరువర్గాలూ మెట్టు దిగి చర్చలు ప్రారంభించాలంది. ఈ సమస్యపై ఈ నెల 18 నాటికి సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామంది. ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభిస్తుందని భావిస్తున్నామంది. ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించి చర్చలతో సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుని వివాదాన్ని చల్లార్చాలని సూచించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్చలు ప్రారంభించాలని సూచించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. సమ్మెను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంతోపాటు మరికొన్ని పిటిషన్‌లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. అక్టోబరు 5న సమ్మె ప్రారంభమయ్యాక ఇప్పటివరకూ చర్చలకు కార్మిక సంఘాలను ఎందుకు పిలవలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సమ్మె కారణంగా ప్రజల ఇబ్బందుల్ని తొలగించడానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించింది. ‘‘10 వేల ఆర్టీసీ బస్సులకు 6 వేల బస్సులను తిప్పుతున్నామని ప్రభుత్వం చెబుతున్నపుడు మరో 4 వేలు.. అంటే మూడోవంతు బస్సులు తిరగడం లేదనే కదా? ఇక్కడ కార్మికుల డిమాండ్లతో సంబంధంలేదు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడటమే మా ముందున్న అంశం’’ అని కోర్టు స్పష్టంచేసింది.

ఆదర్శ యజమానిగా ఉండాలి
ప్రభుత్వ కార్పొరేషన్‌ అయిన ఆర్టీసీ ఆదర్శ యజమానిగా ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. పారిశ్రామిక వివాదాల చట్టం కింద ఈ సమస్య పరిష్కారం కావాలన్న ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. లేబర్‌ కోర్టుల్లో వివాదం పరిష్కారం కావాలంటే 3 నెలల సమయం పడుతుందని, అప్పటివరకు ప్రజలు ఇబ్బందులు పడాలంటే ఎలా అంది. కార్మికుల పట్ల ప్రభుత్వం ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. వాళ్లంతా మీ ఉద్యోగులేనని, మీ పిల్లల వంటివారని, వారి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంది. వారంతా కోరుకుంటేనే రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చారని, ఇప్పుడు కోర్టులకీడ్చటం సరికాదంది. 2015లో కార్మికులపట్ల సానుకూలంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడెందుకింత కఠినంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. అదే ఔదార్యాన్ని ఇప్పుడెందుకు చూపడంలేదని ప్రశ్నించింది. తిరిగి ఉద్యోగాల్లో చేరని వారిని తొలగిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు చూశామని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరికాదంది.

ఎండీ నియామకానికి ఇబ్బందేంటి?
రోడ్డు రవాణా సంస్థకు రెగ్యులర్‌ ఎండీని నియమించడంలో ఉన్న ఇబ్బందులేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇదొకటేకాదని లోకాయుక్త, బాలల సంక్షేమ కమిటీ నియమాకాలు కూడా జరగలేదన్న పిటిషన్‌లు తమ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఏం పరిపాలన సాగుతోందని ప్రశ్నించింది. వెంటనే రెగ్యులర్‌ ఎండీ నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కొత్త బస్సుల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పెట్టుబడులు వస్తాయన్న విషయాన్ని పరిగణన
లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలి
కార్మికులు కూడా పట్టుదలకు పోకుండా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని హైకోర్టు సూచించింది. ఇంట్లో పిల్లలను బెదిరిస్తామని...కాని చేయి చేసుకోమని, అలాగే ప్రభుత్వం చేసే ప్రకటనలపై కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదంది. ఇరుపక్షాలు బలాబలాలు తేల్చుకోవడానికి సిద్ధపడటం సరికాదంది.

సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటిస్తే ఉద్యోగులకూ కొన్ని ఇబ్బందులుంటాయన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు, యూనియన్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, పిటిషనర్‌ తరఫున పి.వి.కృష్ణయ్యలు వాదనలు వినిపించారు.

జీవో సస్పెన్షన్‌కు నిరాకరణ
విద్యాసంస్థల సెలవుల్ని పొడిగిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 202ను సస్పెండ్‌ చేయాలంటూ తల్లిదండ్రుల అసోసియేషన్‌ దాఖలుచేసిన మరో పిటిషన్‌పై జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ విచారణ చేపట్టారు. జీవో సస్పెన్షన్‌కు నిరాకరిస్తూ .. సమ్మె కేసుపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారిస్తున్నందున ఈ విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. అలాగే 49,199 మంది ఆర్టీసీ సిబ్బందికి వేతనాలు చెల్లించేలా ఆదేశించాలంటూ తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలి విచారణ చేపట్టి.. బుధవారానికి వాయిదా వేశారు.

యూనియన్‌ వాదనలు..
‘‘2015 నుంచి ప్రభుత్వం ముందు మా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. పాతవాటి స్థానంలో కొత్త బస్సుల్ని కొనాలని, పే రివిజన్‌ చేయాలని కోరుతున్నాం. అప్పట్లో 7 మంది మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసినా ఇప్పటివరకు మా డిమాండ్లను తేల్చలేదు. విధిలేని పరిస్థితుల్లోనే అంతిమంగా సమ్మెకు దిగాం. హడావుడిగా పండగ సందర్భంగా సమ్మెకు దిగలేదు. సెప్టెంబరు 11న నోటీసు ఇచ్చి పరిష్కారానికి ఎదురుచూశాం. ప్రభుత్వ మొండివైఖరి వల్ల సమ్మె అనివార్యమైంది. విధుల్లో చేరిన 1200 మందే తమ ఉద్యోగులని, మిగిలిన 48 వేల మంది ఉద్యోగాలు పోయాయని ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇలాంటి ప్రకటనల నేపథ్యంలో.. ప్రభుత్వం కింద పనిచేసే కార్మికశాఖ అధికారి మాకు అనుకూలంగా ఉత్తర్వులు ఎలా ఇవ్వగలరు? సహకార సంఘానికి చెందిన రూ.720 కోట్లను ప్రభుత్వం వినియోగించుకుంది. మంత్రులు, ప్రభుత్వం, ఇష్టానుసారం ప్రకటనలు చేస్తున్నారు. కూర్చునే కొమ్మనే నరికేస్తున్నారంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. సమస్యలు చెప్పుకోవాలంటే రెగ్యులర్‌ ఎండీ కూడా లేరు. చర్చలకు మేం సిద్ధమే’’.
ప్రభుత్వ వాదనలు
‘‘ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేశాం. 3600 మంది చొప్పున కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలు చేపట్టాం. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బస్సులను నడుపుతాం. స్థానికంగా ఉన్న డిపో మేనేజర్లు, ఎంవీఐ, రవాణా శాఖాధికారులు నియామక ప్రక్రియ చేపట్టారు. ఓ వైపు సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తూనే.. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కృషి చేస్తున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరిస్తే మరికొన్ని కార్పొరేషన్‌లూ ఇదే డిమాండ్‌ను లేవనెత్తే అవకాశం ఉంది. అందువల్ల విలీనం ప్రసక్తే లేదు. సమస్య పరిష్కారానికి అన్ని చర్యలూ చేపట్టాం. అక్టోబరు 2, 3, 4 తేదీల్లో చర్చలు జరిపాం. 48 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువరించలేదు. కార్మికశాఖ సంయుక్త కమిషనర్‌ దీనిపై విచారణ చేపట్టారు. చట్ట ప్రకారం ఈ సమస్య తేలాల్సి ఉంది. కార్మికులు 22 శాతం ఫిట్‌మెంట్‌ అడిగితే 44 శాతం ఇచ్చాం. పెన్సిల్‌...పెన్ను అడిగితే ఇస్తాం...చందమామ కావాలంటే ఇవ్వలేం. ఆర్టీసీకి ఏటా రూ.1100 కోట్లు కేటాయిస్తున్నాం. ఎండీ నియామకానికి చర్యలు తీసుకోవాలని చెబుతాం.
పిటిషనర్‌ వాదనలు
ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించండి. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నైపుణ్యంలేని వారికి బస్సులు అప్పగిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సమ్మె వల్ల పిల్లలు ఇబ్బందులుపడుతున్నారు. సెలవుల్ని పొడిగించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.