close
ఆగని ఆందోళన

రాష్ట్రవ్యాప్తంగా వంటావార్పు, మానవహారాలు
బస్సు సర్వీసులను పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు
సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం మైండ్‌గేమ్‌ ఆడుతోంది: అశ్వత్థామరెడ్డి
ఈనాడు - న్యూస్‌టుడే యత్రాంగం

ర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారానికి 11వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ధర్నాలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చర్చల ద్వారా సమ్మెను పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు హైకోర్టు చెబుతూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఉద్యోగసంఘాల నాయకులతో కార్మిక సంఘాల ఐకాస ప్రతినిధులు సమావేశమయ్యారు. రెండు వర్గాలు బుధవారం సీఎస్‌ను కలవాలని నిర్ణయించారు. ఐకాస కార్యాచరణ మేరకు డిపోల వద్ద కార్మికులు ధర్నాలు నిర్వహించారు. బస్సుల సంఖ్య పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. 4,192 బస్సులను నడిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన సుమారు పదివేల మంది వరకు ఉద్యోగులను సమీకరించినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. 4,192 ఆర్టీసీ బస్సులు, 1,952 అద్దెబస్సులు నడిపినట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారం కూడలి వద్ద తాత్కాలిక డ్రైవర్‌ నడుపుతున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు.

బస్‌భవన్‌ ముట్టడికి యత్నం
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్‌లో వివిధ సంఘాల ప్రతినిధులు ఆందోళనలు, రాస్తారోకోలు, సమావేశాలు నిర్వహించారు. పీవైఎల్‌, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, ఏఐడీవైవో, ఏఐఎఫ్‌డీవై ఆధ్వర్యంలో చేపట్టిన బస్‌భవన్‌ ముట్టడి యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీ బస్‌స్టేషన్‌, హకీంపేట డిపో వద్ద రాస్తారోకోకు యత్నించిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లి డిపో వద్ద ఆర్టీసీ ఐకాస, భాజపా, కూకట్‌పల్లి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. హయత్‌నగర్‌ డిపో వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించగా.. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు అందరూ మద్దతుగా నిలవాలన్నారు.

* విద్యార్థి సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని చెరువులో విద్యార్థులు మానవహారంగా నిల్చున్నారు. మరికొందరు రవాణా మంత్రి అజయ్‌ ఇంటి ముట్టడికి బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. సమ్మెకు మద్దతుగా తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన సంతకాల సేకరణ చేపట్టింది.

ఖమ్మం రీజియన్‌ పరిధిలోని డిపోల ఎదుట కార్మికులు వంటావార్పు, మానవహారం నిర్వహించారు. 19న బంద్‌ను విజయవంతం చేయాలని ఖమ్మంలో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో విపక్ష నేతలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఖమ్మంలో జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ జిట్టా బాలకృష్ణారెడ్డి కార్మికులకు మద్దతు తెలిపారు.

కరీంనగర్‌లో ఎంపీ సంజయ్‌ అరెస్టు
కరీంనగర్‌లో కార్మిక సంఘాలు బస్టాండ్‌ కూడలిలో మానవహారం చేపట్టడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎంపీ బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టగా పోలీసులు ఆయన్ను, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులను అరెస్టుచేశారు. బస్టాండ్‌లో కోదండరాం మాట్లాడుతూ..ఆర్టీసీని ప్రైవేట్పరం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అంతకుముందు ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో సీఎంతోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌యాదవ్‌లకు పిండప్రదానం చేశారు.

* రవాణాశాఖ మంత్రి అజయ్‌ ఇంటిముట్టడికి బయల్దేరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సంగారెడ్డి కొత్త బస్టాండ్‌ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

భాజపా అండగా ఉంటుంది: రాంమాధవ్‌
సమ్మెపై భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్‌ ట్విటర్‌లో స్పందించారు. కార్మికుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తంచేశారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నించాల్సింది పోయి తెరాస ప్రభుత్వం కార్మికుల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిసోందన్నారు.

ఆర్టీసీ ఆస్తులపై సీఎం కన్ను: మంద కృష్ణ
ఆర్టీసీ ఆస్తులపై సీఎం కన్నేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. హన్మకొండలో కార్మికుల దీక్షలో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమ్మె సంస్థ ఆస్తుల పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంగా భావిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ దీక్ష చేపట్టిన సమయంలో ఉద్యోగ సంఘాలకు చెప్పి చేశారా?అని ప్రశ్నించారు. కార్మికులు సమ్మె నిలిపివేసి చర్చలకు రావాలని కేసీఆర్‌ చెప్పించినట్లుగా కేకే  ప్రకటన ఉందన్నారు.
* ఆర్టీసీ సమ్మెకు సామరస్య పూర్వకంగా పరిష్కారం జరగాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యుడు విఠల్‌ ఆకాంక్షించారు.
* సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి తెలిపారు.
* ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ ప్రభుత్వ పింఛనర్ల ఐకాస ఛైర్మన్‌ లక్ష్మయ్య కోరారు.

సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి

సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికుల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. సమ్మెపై మంగళవారం విచారణ అనంతరం హైకోర్టు బయట అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు సూచించిందన్నారు. ఇరుపక్షాలు చర్చలు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలిస్తే సిద్ధంగా ఉన్నామన్నారు. సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం మైండ్‌గేమ్‌ ఆడుతోందని విమర్శించారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.