close
విద్యలో నాణ్యత పెంపునకు పరిశోధన

జేపాల్‌, సీఎస్‌ఎఫ్‌ సహకారం తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయం
పరిశోధనలో కీలకం కానున్న అభిజిత్‌ బెనర్జీ శిష్యుడు మురళీధరన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాల విద్యలో నాణ్యత పెంచడానికి శాస్త్రీయ పరిశోధన చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు జమీల్‌ అబ్దుల్‌ లతీఫ్‌ పావర్టీ ఆక్షన్‌ ల్యాబ్‌(జేపాల్‌), సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌(సీఎస్‌ఎఫ్‌) సహకారం తీసుకోనుంది. జేపాల్‌ సంస్థను స్థాపించింది తాజాగా నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన ఆచార్య అభిజిత్‌ బెనర్జీ కావడం విశేషం. ఈ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పాఠశాల విద్య నాణ్యత నిరాశాజనకంగా ఉందని అధ్యయనాల్లో వెల్లడైన విషయం తెలిసిందే. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి విద్యార్థుల విద్యా సామర్థ్యం పరిస్థితి బాగాలేదని నిర్ధరణకు వచ్చారు. ఈక్రమంలోనే రెండు మూడు నెలలుగా జేపాల్‌ సహ అధ్యక్షుడు, ప్రవాస భారతీయుడైన ఆచార్య కార్తీక్‌ మురళీధరన్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. తాజాగా పరిశోధన చేయించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ధరణకు వచ్చింది. త్వరలోనే కుదరనున్న అయిదేళ్ల ఒప్పందంలో భాగంగా వివిధ జిల్లాల్లో అభ్యసన ఫలితాల గురించి స్వతంత్రంగా నాణ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. వాటి ఆధారంగా లక్ష్యాత్మకంగా ఫలితాలు సాధించడంపై దృష్టి పెడతారు. కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో నాణ్యత కోసం కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉండగా పాఠశాల విద్యలో నాణ్యత పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తూ జీఓ జారీ చేసింది. విద్యాశాఖ ఉన్నతాధికారి, ప్రభుత్వం నియమించిన నోడల్‌ అధికారి(కన్వీనర్‌), సీఎస్‌ఎఫ్‌ ఛైర్మన్‌, ఎండీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఆచార్యుడు కార్తీక్‌ మురళీధరన్‌ కమిటీలో ఉంటారు.

కీలకం.. కార్తీక్‌ మురళీధరన్‌
పరిశోధనలో ప్రవాస భారతీయుడైన ఆచార్య కార్తీక్‌ మురళీధరన్‌ కీలకంగా వ్యవహరించనున్నారు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. తాజాగా నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన ఆచార్య అభిజిత్‌ బెనర్జీ, ఆయన భార్య ఈస్తర్‌ డఫ్లోతో కలిసి ఆయన పనిచేశారు. ఈ ఇద్దరితో కలిసి నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన మైకెల్‌ క్రీమర్‌ వద్ద మురళీధరన్‌ పీహెచ్‌డీ పూర్తి చేశారు. జేపాల్‌ తరఫున వివిధ విద్యా కార్యక్రమాల గురించి ఆయన పరిశోధనలు చేశారు. మురళీధరన్‌ పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చి పాఠశాల విద్యాశాఖ అధికారులతో భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పాఠశాలలను విలీనం చేయాలని మురళీధరన్‌ అధికారులతో ఇప్పటికే తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. అందుకు రాజస్థాన్‌ రాష్ట్రాన్ని ఉదాహరణగా చెబుతున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.