close
సమ్మె.. సమస్యలు అలాగే

విధులకు హాజరుకాని కార్మికులు
తాత్కాలిక ఉద్యోగులతో నడుస్తున్న బస్సులు
సమ్మెకు అఖిలపక్షం మద్దతు
రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ప్రదర్శనలు
ప్రజలకు తప్పని తిప్పలు
అధిక ఛార్జీలతో ప్రయాణికుల దోపిడీ
ఈనాడు - హైదరాబాద్‌

మరో రోజు గడిచింది. ఆర్టీసీ సమ్మె అయిదో రోజుకు చేరింది.  కార్మికులు విధులకు హాజరు కాలేదు. తాత్కాలిక ఉద్యోగులతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్నా అవి ప్రజల అవసరాలను తీర్చడం లేదు. కొన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు సహజంగా తిరగాల్సిన సంఖ్యలో బస్సులు నడపకపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు క్యాబ్‌లలో ఛార్జీలు పెరగకుండా చూస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వారు ఇష్టారాజ్యంగా వసూలు చేశారు. బస్సుల్లోనూ అదే ధోరణి కొనసాగింది.

హైదరాబాద్‌లో అఖిల పక్షం- డిపోల వద్ద ప్రదర్శనలు
ఆర్టీసీ కార్మికులు బుధవారం రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. సమ్మెను ఉద్ధృతం చేసే క్రమంలో ధర్నాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. సమ్మెకు మద్దతుగా రాష్ట్ర బంద్‌ నిర్వహించేందుకు అఖిలపక్ష నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. వరంగల్‌లో కార్మికులు పబ్లిక్‌ గార్డెన్‌ దాటి రాకుండా చర్యలు తీసుకున్నారు. దాంతో వారు అక్కడే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

క్యాబ్‌ ఎక్కితే... బిల్లు మోతే...
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయివేటు టాక్సీలు ఛార్జీల మోత మోగిస్తున్నాయి. సాధారణ ఛార్జీకి రెండింతలు వసూలు చేస్తున్నాయి. సర్‌ఛార్జి అని ప్రత్యేకంగా చూపించకుండా కిలోమీటరుకు రూ.40కి పైగా వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్‌ పరిధిలోని ఉబర్‌, ఓలా క్యాబ్‌లు ఈ స్థాయిలో తీసుకుంటున్నాయి. ఎల్‌బీ నగర్‌ రింగురోడ్డు నుంచి మలక్‌పేటకు క్యాబ్‌ తీసుకుంటే గతంలో రూ.200 వరకు వసూలు చేసేవారు. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే సర్‌ఛార్జి పేరిట కొంత అదనమయ్యేది. కానీ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రూ.450 నుంచి రూ.500 వరకు అవుతోంది. కరీంనగర్‌-హైదరాబాద్‌కు కార్లలో గతంలో రూ.250-300 తీసుకునే వారు ఇప్పుడు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలుచేస్తున్నారు.ఇదే పరిస్థితి అనేక మార్గాల్లో ఉంది.

బస్సుల్లో అన్ని రూట్లలో అదనమే
బస్సుల్లో ప్రయాణికులకు ఛార్జీల మోత తప్పలేదు. తాత్కాలిక కండక్టర్లపై నియంత్రణ లేకపోవటంతో వారు అడిగినంత చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్‌ బస్‌ ఛార్జి రూ.190. కానీ ఆర్టీసీ, అద్దెబస్సుల్లోని తాత్కాలిక కండక్టర్లు మాత్రం రూ.300 వసూలు చేస్తున్నారు. సత్తుపల్లి నుంచి ఖమ్మానికి రూ.75 అయితే రూ.100-110 వసూలు చేస్తున్నారు.తాత్కాలిక కండక్టర్లకు టికెట్ల జారీ యంత్రాలు (టిమ్స్‌) ఇవ్వకపోవడంతో ప్రయాణికులపై భారం పడుతోంది. ఆర్టీసీ ఆదాయానికీ గండి పడుతోంది. డ్యూటీకి ఎక్కేటప్పుడూ, దిగేటప్పుడూ కొన్ని డిపోల్లో తాత్కాలిక కండక్టర్ల జేబులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన తాత్కాలిక కండక్టర్లు బస్సుల్లో తమ సొంత మనుషులను ఎక్కించుకుని డిపో వచ్చే ముందే వారికి డబ్బును అందజేస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఈ అంశంపై డ్రైవర్లు, కండక్టర్లకు మధ్య వివాదం జరుగుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

మీటర్‌ పట్టించుకోని ఆటో డ్రైవర్లు
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్లు మీటర్‌పై రావడం లేదు. అడిగినంత ఇస్తేనే వస్తామని తెగేసి చెబుతున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు ఆటోల్లో కనీసం రూ.200 వసూలు చేస్తున్నారు.

నేడు భారీగా రద్దీ
దసరా పండగ అయిపోవడంతో బుధవారం నుంచి తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతోపాటు తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. గురువారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. బస్సుల్లో ఎంజీబీఎస్‌, జేబీఎస్‌కు.. రైళ్లలో సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లకు చేరుకున్నాక అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఇళ్లకు చేరుకోవడానికి సరైన రవాణా ఏర్పాట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాగులో పక్కకు ఒరిగిన బస్సు
కల్వకుర్తి సమీపంలో రఘుపతిపేట వద్ద దుందుభి వాగులో బుధవారం ఆర్టీసీ బస్సు పక్కకు ఒరగటంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఎలాంటి రెయిలింగు లేకపోవటంతో తాత్కాలిక డ్రైవర్‌  వాగు హద్దును అంచనా వేయలేకపోయారు. అక్కడ ఇసుక మేట వేసి ఉండటంతో బస్సు బొల్తాపడకుండా ఒక పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.