close
మా అమ్ములపొదిలో మరిన్ని పథకాలు

అవి అమలుచేస్తే కాంగ్రెస్‌ పని ఖతమే
ప్రాజెక్టులను ఆపం.. సంక్షేమం వీడం
కాంగ్రెస్‌, భాజపాలు దొందూ దొందే..
కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది?
భాజపా తెలంగాణను అవమానిస్తోంది
త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు

విలీనం తప్పెలా అవుతుంది?

మ్మెల్యేల విలీనం తప్పెలా అవుతుంది? ఉపరాష్ట్రపతి సమక్షంలో నలుగురు తెదేపా రాజ్యసభ సభ్యులు భాజపాలో విలీనం కావడంతో పాటు అదేరోజు ప్రధానితో భేటీ కూడా అయ్యారు. గోవాలో పదిమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భాజపాలో విలీనం కాగా ఇటీవల రాజస్థాన్‌లో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ విలీనం చేసుకోలేదా? అలాగే ఇక్కడ కూడా 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో విలీనమయ్యారు.’

అప్పు తప్పు కాదు

తెరాస ప్రభుత్వమే ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ అడ్డగోలుగా విమర్శిస్తోంది. రాష్ట్రంలో అప్పులేకుండా ఏ సాగునీటి ప్రాజెక్టు కట్టారో ఆ పార్టీ నేతలు చూపించాలి. అప్పులు తీసుకురావడం తప్పుకాదు. అవసరమైతే ఇంకా అప్పుల్ని తెస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చిన సాగునీటి ప్రాజెక్టులను ఆపేదిలేదు. సంక్షేమానికి ప్రాధాన్యం తగ్గించబోం.’

ఉద్యోగులు పనిచేయకపోతే ఊరుకోం

ద్యోగులు ప్రభుత్వాన్ని ఆదేశించలేరు (డిక్టేట్‌ చేయలేరు). కుక్క తోకను ఊపుతుంది కానీ తోక కుక్కను ఊపదు. చట్టాలను రూపొందించేది ఉద్యోగులు కాదు.. శాసనసభ. అవినీతిరహితంగా, పారదర్శకంగా ఉద్యోగులు పనిచేయకపోతే కఠిన చర్యలుంటాయి. నలుగురైదుగురు ఉద్యోగులకు, వాళ్లకు, వీళ్లకు ప్రభుత్వం భయపడదు.’

పాత బాకీ చెల్లించి కొత్త రుణం తీసుకోండి

రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పాం. గత డిసెంబరు నాటికి ఉన్న అప్పును మేము రైతులకు విడతల వారీగా నేరుగా అందజేస్తాం. ఈ మేరకు వారికి లేఖలు కూడా రాస్తాం. ముందు మీరు పాత బాకీలు చెల్లించేసి కొత్త రుణం తీసుకోండి. అలా కొత్త రుణం తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా గత డిసెంబరునాటికి ఉన్న పాత బాకీ మొత్తాన్ని రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుంది.’

మరిన్ని పథకాలు తెస్తాం
ప్రజల ఆత్మగౌరవం కాపాడేది ప్రాంతీయపార్టీలే
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు
ఈనాడు - హైదరాబాద్‌

మోదీ, అమిత్‌షా వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి

‘‘కేంద్రంలో భాజపా ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా తెలంగాణను అవమానిస్తోంది. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని ప్రధాని నరేంద్రమోదీ అంటున్నారు. తెలంగాణ ఏర్పాటును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ‘డార్క్‌ డే’గా అభివర్ణించారు. మీ వ్యాఖ్యల్ని వెనక్కితీసుకోవాలి. 60 ఏళ్లు పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఎవరూ దానంగా ఇవ్వలేదు.’’

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని తగ్గించేదిలేదని  తెలంగాణ ప్రగతి కోసం అవసరమైతే మరిన్ని అప్పులు తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు కాకుండా.. తమ వద్ద మరో రెండు, మూడు కొత్త పథకాల ఆలోచనలు ఉన్నాయని.. అవి అమలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ భవిష్యత్తు ఖతం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోస్యం చెప్పారు. మరో రెండు, మూడు దఫాలు రాష్ట్రంలో తెరాస ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆదివారం శాసనసభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్‌, భాజపాల పాలన తీరును ఎత్తిచూపుతూ ఆ రెండు పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. త్వరలో రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని.. యాజమాన్య హక్కులకు సంబంధించి ఎలాంటి సమస్య లేకుండా చేస్తామని వెల్లడించారు. కౌలుదారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించదని మరోసారి స్పష్టంచేశారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలివి..
‘‘పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కొత్త చట్టాలను కఠినంగా అమలుచేస్తాం. ప్రతినెలా పంచాయతీలకు నిధులిస్తాం. ప్రధాని, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలెవవరికీ లేనివిధంగా సర్పంచులకు చెక్‌ పవర్‌ ఉంది. అందరూ కలిసి అభివృద్ధికి కృషి చేయాలని ఉపసర్పంచికి కూడా సంయుక్త చెక్‌పవర్‌ ఇచ్చారు. దీనిపై దుష్ఫలితాలు వస్తే మళ్లీ సమీక్షిస్తాం. నిజాయతీగా ప్రభుత్వం వద్ద ఉన్నదెంత అనేది ప్రజలకు బడ్జెట్‌తో చెప్పాం. భూములు అమ్మితే వచ్చే నిధులతో ‘ప్రత్యేక అభివృద్ధి నిధి’ (ఎస్‌డీఎఫ్‌) ఏర్పాటుచేశాం. అవి వస్తే ఒక్కో శాఖకు తలా కొంత ఇస్తాం. రాకపోతే రాలేదని చెబుతాం. మీరెందుకు (కాంగ్రెస్‌) బెంబేలెత్తుతున్నారు? కేంద్ర కార్పొరేట్‌ పన్ను రాయితీల ఫలితంగా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో రూ. 1400 కోట్లు తగ్గుతోంది. ఇటీవల రూపొందించిన బడ్జెట్‌ అంచనాలు కూడా మారుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించే ప్రభుత్వం కాదు మాది. ఆంధ్రప్రదేశ్‌లో పసుపు-కుంకుమ వంటివి ప్రకటిస్తే ప్రజలు ఎలా స్పందించారో అందరికీ తెలిసిందే. తెలంగాణపై కాంగ్రెస్‌కు ప్రేమ ఎక్కడుంది? రాష్ట్ర సాధనకు మేం గుప్పెడుమంది కలిసి పోరాటం మొదలుపెట్టాం. ఇవ్వకతప్పని పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడి తెలంగాణ వచ్చింది. ఎవరు ఇవ్వలే! రాష్ట్రం అద్భుతంగా ప్రవర్థమానమై ముందుకెళుతోంది.

సకల దుర్మార్గాలకు కాంగ్రెసే పుట్టిల్లు
దేశంలోని సకల రుగ్మతలకూ కాంగ్రెస్‌ అసంబధ్ధ, అవివేక పాలనే కారణం. దుర్మార్గాలకు కాంగ్రెసే పుట్టిల్లు. మహిళల అక్రమ రవాణా, డ్రగ్స్‌ దందా, రైతులు, చేనేతల ఆత్మహత్యలకు ఆ పార్టీ పాలనే కారణం. అడవి తరిగిపోయింది.. కలప స్మగ్లర్లున్నది వారి హయాంలోనే. మా ప్రభుత్వం వ్యవస్థల్ని గాడిన పెడుతుంటే కాంగ్రెస్‌ అడ్డుపడుతోంది. నక్సలిజం పుట్టుకొచ్చింది.. మతకల్లోలాలు, హత్యలు, ఫ్యాక్షన్‌ రాజకీయాలు.. అన్నింటికీ సృష్టికర్త కాంగ్రెస్‌ పార్టీయే. ఉద్యోగాల కోసం ధర్నాలు చేయిస్తారు.. నోటిఫికేషన్లు వచ్చాక 900 కేసులు వేయించారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటున్న కాంగ్రెస్‌ 51 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకివ్వలేదు? యువతను రెచ్చగొట్టడం మానుకోవాలి. ఉద్యోగాలు అడగొద్దనడం లేదు. ఇంటికో ఉద్యోగం అడగొద్దు అంటున్నా.

రైతులు, పేదల దుస్థితికి ఆ పార్టీలే కారణం
కేంద్రంలో కాంగ్రెస్‌ తర్వాత భాజపా పదకొండేళ్లు అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ ‘గరీభీ హఠావో’ అంటే.. నరేంద్రమోదీ ‘భేటీ బచావో భేటీ పడావో’ అన్నారు. ప్రభుత్వాలు, పథకాలు పేర్లు మారాయి. ప్రజల తలరాత మారలేదు. మధ్యలో వీపీ సింగ్‌, దేవెగౌడ వంటి కాంగ్రెస్‌, భాజపాయేతర ప్రభుత్వాలను ఈ రెండు పార్టీలు బతకనివ్వలేదు. రైతుల, పేదలు, దళిత, గిరిజన వర్గాల దుస్థితికి ఈ పార్టీలే కారణం. రాష్ట్రంలో 51 ఏళ్లు కాంగ్రెస్‌, 16 ఏళ్లు తెదేపా అధికారంలో ఉన్నా చేసిందేమీ లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనంటే.. తెరాస నిలదీసింది. అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క, మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు పదవులు పట్టుకుని వేలాడారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోదీలను అడిగినా పట్టించుకోలేదు. రాష్ట్రాల జాబితాలో ఉండే అధికారాలు, హక్కులు కేంద్ర జాబితాలోకి వెళ్లాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌, భాజపా దొందూదొందే. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ఎందుకు స్పందించట్లేదు? రాష్ట్రాల్లో అక్కడి జనాభాను బట్టి రిజర్వేషన్లు ఇచ్చుకునే విధానం ఉండాలి. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయపార్టీలే.

తెరాస పాలన ఎన్నోరెట్లు బాగుంది
రాష్ట్రంలో ఎవర్ని అడిగినా కాంగ్రెస్‌ కంటే తెరాస పాలన ఎన్నోరెట్లు బాగుందని అంటున్నారు. వాస్తవాలను కాంగ్రెస్‌ నేతలు గమనించడంలేదు. గత ఎన్నికల ఫలితాలే తెరాస పాలనకు నిదర్శనం. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 21 నుంచి 19కి, భాజపా స్థానాలు 5 నుంచి ఒకటికి తగ్గాయి. తెరాస బలం 63 నుంచి 88కి పెరిగింది. ప్రజాతీర్పు కంటే నిదర్శనం ఇంకేమి ఉంటుంది?

తెరాస చరిత్ర సాహసాలు, త్యాగాలు
హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రక్రియ మొదలేకాలేదు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తోందంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించడం ఎంతవరకు సబబు? సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు నేను డీజీపీ, ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లతో కూడా మాట్లాడలేదు. తెరాస ప్రజల్నే నమ్ముకుంది. తెరాస చరిత్ర అంతా సాహసాలు, త్యాగాలే. అనేక పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లిన ఘనత మా పార్టీది. 2014లో తెలంగాణ రాగానే తెరాస దుకాణం బంద్‌ అవుతుందన్నారు.. ఇప్పుడు ఎవరి దుకాణం బంద్‌ అవుతుందో తెలుస్తోంది. ఆరేడు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన ధైర్యం తెరాసదే.

అవసరమైతే వీఆర్వోలను తీసేస్తాం
ఎవరికీ భయపడం. మార్చాల్సిన చట్టాలు మారుస్తాం. త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. దాన్నిచూసి దేశం ఆశ్చర్యపోతుంది. మేం రూపొందిస్తున్న ధరణి వెబ్‌సైట్‌ వచ్చాక రిజిస్ట్రేషన్‌ అయిన గంటల్లోనే పట్టా వస్తుంది.. మ్యుటేషన్‌ అయిపోతుంది. రూపాయి లంచం ఇచ్చే అవసరం లేని చట్టం తెస్తాం. వీఆర్వోలను తీసేస్తామని ప్రభుత్వం చెప్పలేదు. గతంలో పటేల్‌, పట్వారీ వ్యవస్థ ఉండేది. ప్రజల్ని పీడిస్తున్నందున వారిని తీసేశారు. వారికంటే రెండు, మూడింతలు ఇప్పుడు ఎక్కువగా నడుస్తోంది ఇప్పుడు. ప్రభుత్వానికి రైతులే ముఖ్యం. వీఆర్వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తాం. కౌలుదారులను తెరాస ప్రభుత్వం గుర్తించదలుచుకోలేదు.

మావి అడ్డగోలు డిజైన్లా?
తెరాస ప్రభుత్వం కట్టే ప్రాజెక్టులు అడ్డగోలు డిజైన్లు అంటున్నారు. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన నాగార్జునసాగర్‌, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టుల డిజైన్లూ అడ్డగోలేనా? మద్రాస్‌కు 80, తెలంగాణకు 180 టీఎంసీల నీటిని అందించే లక్ష్యంతో.. నిజాం హయాంలో నందికొండ దగ్గర నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును రూపొందించారు. ఆ తర్వాత దిల్లీ నాయకత్వానికి తలొంచి నందికొండను నాశనం చేసింది కాంగ్రెస్‌ పార్టీయే.

ఎన్‌ఆర్‌సీపై సమాచారంలేదు
ఎన్‌ఆర్‌సీపై కేంద్ర నుంచి రాష్ట్రానికి ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం ఆదేశాలు వస్తే అన్ని పార్టీలతో చర్చిస్తాం. మైనార్టీల 12 శాతం రిజర్వేషన్‌పై అసెంబ్లీ తీర్మానం కేంద్ర వద్ద ఉంది. అవసరమైతే మరోమారు తీర్మానం చేస్తాం’’

కేంద్రం ఏమిచ్చింది?
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ఇవ్వలేదు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు రూపాయి రాలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల, వెనుకబడిన జిల్లాలకు నిధులు సరిగా ఇవ్వలేదు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ. 24,000 కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్‌ సిఫార్సు చేసినా 24 పైసలైనా ఇవ్వలేదు. తెలంగాణ భాజపా నేతలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తామంటూ కలలు కంటున్నారు. వాళ్లు వస్తే- ఆరోగ్యశ్రీ పథకం పోయి ఆయుష్మాన్‌ భారత్‌ వస్తుంది. రైతుబంధులో మేం ఎకరాకు రూ. 10,000 చొప్పున.. ఐదెకరాలున్నవారికి ఏటా రూ. 50,000 ఇస్తున్నాం. భాజపా వస్తే కిసాన్‌ సమ్మాన్‌ పథకం తెస్తుంది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా రూ. 6 వేలే ఇస్తుంది. సన్నబియ్యం బదులు దొడ్డుబియ్యం వస్తాయి. రైతుబీమా ఉండదు. భాజపా రాష్ట్రాల్లో కేసీఆర్‌ కిట్‌, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాలున్నాయా?

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.