close
అభివృద్ధి వ్యయంలో ముందంజ

జీఎస్డీపీలో నిర్దేశించిన మేరకే రుణాలు
సమర్థంగా పన్నుల వసూళ్లు
అంచనాలు... వాస్తవం మధ్య అంతరం తగ్గాలి
పీడీ ఖాతాల్లో వ్యయం కాకుండా నిధులు
ఏజీకీ సమాచారం లేకుండానే ఖాతాలు
ఉప పద్దులు ఇష్టారాజ్యం
ఆ ఎనిమిది శాఖల్లో భారీ మిగులు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అభివృద్ధి వ్యయం, ఆస్తులను సృష్టించేందుకు చేస్తున్న వ్యయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకంటే ముందంజలో ఉందని కాగ్‌ విశ్లేషించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో నిర్దేశించిన మేరకంటే తక్కువ శాతం అప్పులు తీసుకుంటోందని పేర్కొంది. పన్నుల వసూళ్లలో సమర్థత పెరిగిందని తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్ర బడ్జెట్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై 2017-18 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ నివేదికను ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. భారీ మొత్తంలో నిధులు వ్యయం చేయకుండా మిగులు చూపడం, శాసనసభ అనుమతించిన మొత్తానికంటే ఎక్కువ వ్యయం చేయడం, పీడీ ఖాతాలను తెరవడం, ఉపపద్దులను నిర్వహించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు  కాగ్‌ అభిప్రాయపడింది. బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవాలకు మధ్య అంతరం తగ్గేవిధంగా బడ్జెట్‌ తయారీ ప్రక్రియను చేపట్టాలని సూచించింది. పీడీ ఖాతాల నిర్వహణపై ప్రభుత్వం సమీక్షించాలని తెలిపింది. పీడీ ఖాతాలను తెరవడాన్ని బలహీనమైన నియంత్రణగా పేర్కొంది. వైద్య,ఆరోగ్య, సాంఘిక సంక్షేమ విభాగాల కింద పదేపదే మిగులు ఏర్పడటం పథకాల అమలులో శాఖల అసమర్థతను సూచిస్తోంది. శాసనసభ అనుమతించిన దానికంటే రూ.28171 కోట్లు వ్యయం అయింది. రూ.11572 కోట్ల మొత్తానికి సంబంధించి లోటుపాట్లు జరిగినట్లు ఆడిట్‌లో వెల్లడైంది.

పీడీ ఖాతాలు... వ్యయం కాకుండా నిధులు
వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాల్లో నిధులు జమచేయడం ఆర్థిక సంవత్సరం చివర్లో ఆ ఖాతాల్లోకి నిధులను మారుస్తున్నట్లు పేర్కొంది. 2017-18లో పీడీ ఖాతాలకు రూ.22,875 బదిలీ కాగా ఇందులో రూ.3655 కోట్లను మార్చిలోనే జమచేశారు. పీడీ ఖాతాల్లో నిధులు వ్యయం కాకుండా ఉంటున్నాయి. మార్చి నెలలో రూ.14899 కోట్లు వ్యయంకాగా రూ.3655 కోట్లను పీడీ ఖాతాలకు బదిలీ చేసిన మొత్తం ఉండటం గమనార్హం. ఎనిమిది మంది అధికారుల పీడీ ఖాతాల్లో చివర్లో ఒక్కో ఖాతాలో రూ.100 కోట్లు ఉంది. వినియోగంలోలేని 1170 పీడీ ఖాతాల్లో నిధులు రూ.315 కోట్లు ఉన్నాయి. మూడేళ్లకు పైగా ఈ ఖాతాల్లో నిధులు వినియోగంలోలేవు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 28674 పీడీ ఖాతాలు ఉన్నాయి. ఏజీతో సంప్రదించి పీడీ ఖాతాలు తెరవడంలేదు. ఖాతాలు తెరిచిన తర్వాత తెలియజేస్తున్నారు. ఉదాహరణకు మహబూబ్‌నగర్‌ సీపీఓ ఖాతాకు రూ.85.33 కోట్లు బదలాయించగా చివరకు రూ.36.6 కోట్లు వ్యయం కాకుండా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం చివర్లో తెలంగాణ షెడ్యులు కులాల సహకారాభివృద్ధి సంస్థకు రూ.1500 కోట్లు, తెలంగాణ ఎస్టీ సహకారాభివృద్ధి సంస్థకు రూ.800 కోట్లు పీడీ ఖాతాల్లో జమ చేశారు.

ఏడు రోజులు రూ.రూ.764 కోట్లు ఓడీ
2017-18 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఏడాదికంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్‌బ్యాంకు చేబదుళ్లపై ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడింది. ఈ సంవత్సరంలో ప్రత్యేక డ్రాయింగ్‌ సౌకర్యం/చేబదుళ్లు, ఓవర్‌డ్రాఫ్టు రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.10,834 కోట్లు తీసుకుంది. వేస్‌ అండ్‌ మీన్స్‌ (రిజర్వ్‌ బ్యాంకు వద్ద చేబదుళ్లు) ఆర్‌బీఐ దగ్గర నిర్వహించాల్సిన రోజువారీ కనీస నగదు నిల్వను కేవలం 161 రోజులు మాత్రమే నిర్వహించింది. 204 రోజులపాటు ప్రత్యేక డ్రాయింగ్‌ సౌకర్యం రూ.11,278 కోట్లపై  ఓవర్‌ డ్రాఫ్టుపై ఏడు రోజులు రూ.764 కోట్లు, చేబదుళ్లు (127 రోజులు రూ.10,878 కోట్లు) ప్రభుత్వం ఆధారపడింది. వడ్డీలపై రూ.13.8 కోట్లు చెల్లించగా ఇది అంతకముందు కంటే రూ.6.4 కోట్లు ఎక్కువ.

రెవెన్యూ మిగులు ఎక్కువగా చూపారు
2017-18లో రెవెన్యూ మిగులు రూ.3459 కోట్లు, ద్రవ్యలోటును రూ.26,700 కోట్లుగా చూపారు. తప్పు వర్గీకరణ, రాయితీలను రుణాలుగా వర్గీకరించడం కారణంగా రెవెన్యూ మిగులను రూ.3743 కోట్లు మేర ఎక్కువగా చూపారు. ఇదే సమయంలో ద్రవ్యలోటును రూ.954 కోట్లు తక్కువగా చూపారు. ప్రాథమికలోటు తగ్గినా ప్రాథమిక ఖర్చులను తీర్చగలిగే స్థాయిలో అప్పులు కానీ రాబడులు కానీ లేవు.

కాగ్‌ నివేదికలో మరికొన్ని అంశాలు
* వైద్య ఆరోగ్య, పురపాలన, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, వ్యవసాయం, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్‌లో 2014-18 మధ్య కాలంలో ప్రతి ఏడాది రూ.500 కోట్లు మించి మిగులు ఉన్నాయి.
* ప్రభుత్వం ప్రకటించిన మధ్యకాలిక ద్రవ్యవిధానంలో అప్పుల బాధ్యత జీఎస్‌డీపీలో 25 శాతంగా ఉండగా వాస్తవంగా ఇది 22.05 శాతంగా ఉంది.
* 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు జీఎస్డీపీలో 22.82 శాతంకంటే తక్కువగా అప్పులు ఉండాలి. తెలంగాణలో ఇది 19 శాతమే ఉన్నాయి.
* 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు జీఎస్డీపీలో 22.82 శాతంకంటే తక్కువగా అప్పులు ఉండాలి. తెలంగాణలో 19 శాతం మాత్రమే ఉన్నాయి.
* జీఎస్డీపీలో ద్రవ్యలోటు  3.55 శాతంగా ఉంది. ఇది నిర్దేశించిన 3.5 శాతం కంటే స్వల్పంగా ఎక్కువ ఉంది.శాసనసభ ఆమోదం లేకుండా రూ.2217 కోట్లను వ్యయం చేశారు.
* 2014-15 నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకూ రూ.27,346 కోట్లు అధికవ్యయం చేయగా దీన్ని 2018 నవంబరులో క్రమబద్ధం చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.