close
సీమకు గోదారి!

శ్రీశైలానికి తరలించే అంశంపై చర్చించనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ప్రగతిభవన్‌లో నేడు సమావేశం
హాజరుకానున్న మంత్రులు, ఉన్నతాధికారులు
విభజన సమస్యలపైనా విస్తృత చర్చ
జగన్‌కు ఫోన్‌ చేసి ఎజెండా ఖరారుచేసిన కేసీఆర్‌
కేంద్రం వైఖరిపై చర్చించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు వీలుగా గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే అంశంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం చర్చించనున్నారు. ఈ విషయమై సహకరిస్తామని ఇప్పటికే కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్‌ సైతం రాయలసీమ పర్యటనలో దీనిని పదేపదే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నేటి వీరి భేటీకి ప్రాధాన్యమేర్పడింది. ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.సీఎంల నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీలు విస్తృతంగా చర్చించాయి. తమ ప్రతిపాదనలను ఇద్దరు సీఎంలకు అందజేశాయి.  ఆదివారం సీఎం కేసీఆర్‌ జగన్‌కు ఫోన్‌ చేసి ఎజెండా అంశాలను కూడా ఖరారు చేశారు. గోదావరి, కృష్ణా నదీ జలాల సంపూర్ణ వినియోగం, తొమ్మిది, పదో షెడ్యూలులోని సంస్థల విభజన వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. అధికారిక వ్యవహారాలతో పాటు ప్రధానంగా విపక్షాలను తిప్పికొట్టే వ్యూహాలనూ ఖరారు చేయనున్నారు. మాంద్యం నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నట్లు తెలిసింది.ఇద్దరు సీఎంల మధ్య తొలిసారిగా గత జూన్‌ 28న ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు రెండో తేదీన ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో ఒక దఫా మాట్లాడుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో జగన్‌ పాల్గొన్నారు. తర్వాత ఇద్దరు సీఎంలు విజయవాడ, హైదరాబాద్‌లో స్వరూపానందేంద్ర స్వామి నిర్వహించిన కార్యక్రమంలోనూ కలిసిన విషయం విదితమే.

తొమ్మిది, పదో షెడ్యూలుపై స్పష్టత
తొమ్మిది, పదో షెడ్యూలులోని సంస్థల విభజనపై ఇప్పటికే సీఎంల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. కొందరు అధికారులు అత్యుత్సాహంతో సరైన సమాచారం లేక ఉత్తర్వులను జారీ చేయడం, సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టడం వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. దీనిపై ఇద్దరు సీఎంలు స్పష్టత ఇవ్వనున్నారు. ప్రధానంగా అప్మెల్‌ వంటి సంస్థల విషయంలో ఏకాభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీలకు సంబంధించి అధికారుల బదలాయింపు, పథకాలు, కార్యక్రమాల అమలుకు ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్నారు. రెండు ప్రభుత్వాల స్థాయిలో చర్చల వల్ల సచివాలయ, శాసనసభ భవనాల అప్పగింత జరిగింది. ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల బదలాయింపునకు ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కొత్త ఇసుక విధాన రూపకల్పనలో తెలంగాణ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని నాలుగువేల మంది పోలీసు సిబ్బందికి ఏపీలోని పోలీసు కళాశాలల్లో శిక్షణ ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ సీఎం సిఫార్సుల మేరకు ఏడుగురు తెలంగాణ వారికి తితిదే సభ్యత్వ పదవులు దక్కాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.