close
తెలిసే.. కావాలనే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేశాం

పిల్లలు ఎందరున్నా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేయవచ్చు
మండలిలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అభ్యర్థులకు ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే నిబంధనను తెలిసే, కావాలనే పెట్టామని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పురపాలక విధులు సక్రమంగా నిర్వహించని కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తొలగించాల్సి వస్తే తొలుత తెరాస నుంచే ప్రారంభిస్తామన్నారు. ఆస్తిపన్ను మదింపు కోసం ఇంటిఅద్దె విలువ కాకుండా రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువ ప్రామాణికగా తీసుకోనున్నట్లు వివరించారు. కొత్తగా తీసుకువస్తున్న చట్టం చాలా కఠినమైనదని పేర్కొన్నారు. ఆదివారం శాసనమండలిలో పురపాలక బిల్లు ఆమోదం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. మండలి ప్రారంభమైన వెంటనే నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఆమోదించింది. పురపాలక బిల్లుపై సభ్యులు జాఫ్రీ, భానూప్రసాద్‌, రామచంద్రారావు, పల్లా రాజేశ్వర్‌, జీవన్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌, నర్సిరెడ్డి మాట్లాడారు. భవన నిర్మాణ అనుమతులు 21రోజుల్లో ఆమోదించాలంటూ నిబంధన ఉన్నప్పటికీ ఆరునెలలు, ఏడాది అవుతున్నా రావడం లేదని తెరాస ఎమ్మెల్సీలు తెలిపారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువమంది ఉంటే పోటీ చేసేందుకు అనర్హులన్న నిబంధన ఇందులో పెట్టలేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. పురపాలక చట్టంలో ఐదు సవరణలు చేశామని, కొత్తగా ఒక సెక్షన్‌ పెట్టామని కేటీఆర్‌ తెలిపారు. ‘‘జీహెచ్‌ఎంసీలో కోటిమందికి పైగా జనాభాకు 18 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో పరిశుభ్రంగా పెట్టడం సాధ్యం కాదు. ఇప్పుడున్న డెంగీ, వైరల్‌ జ్వరాలకు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీని నిందించడం కాదు.. తమ ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు సామాజిక బాధ్యత ఉండాలి.కొత్త చట్టంతో అధికారులు, ప్రజా ప్రతినిధులను నియంత్రించనున్నాం. ప్రజలు తప్పుచేసినా అదేస్థాయిలో చర్యలు ఉంటాయి. తప్పుచేస్తే శిక్ష పడుతుందన్న భావనను చట్టాల ద్వారా ప్రజల్లో తీసుకువస్తున్నాం.’’ అన్నారు.

ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునేవారు ముందుగా ఈ చట్టాన్ని ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి. తప్పుచేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసుకుని పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తరువాత ప్రభుత్వాన్ని నిందించకూడదు. ప్రతివార్డులో యువజన, మహిళా, వయోవృద్ధులు, కాలనీసంఘాలు/స్వయం సహాయక కమిటీలు ఏర్పాటు చేయనున్నాం. ఈ కమిటీలు మూడునెలలకోసారి సమావేశమై పచ్చదనం, పారిశుద్ధ్యం తదితర పనుల్లో ఏమేం చేయాలో సూచిస్తాయి. నగరాలు, పట్టణాలు, కొత్త మున్సిపాలిటీలు, విలీన గ్రామపంచాయతీల్లో కొత్త ఇంటినెంబర్లు ఇస్తాం. భవన నిర్మాణ దరఖాస్తు అందిన వారం రోజుల్లో ఏమైనా లోపాలుంటే ఆ వివరాలను యజమానికి తెలియజేయాలని నిబంధనపెట్టాం. అన్ని మున్సిపాలిటీల్లో ఈ-కార్యాలయ విధానం తీసుకువచ్చి, దరఖాస్తు ఎన్నిరోజులు ఎక్కడ, ఎవరిదగ్గర పెండింగ్‌ఉందో తెలుసుకుంటాం. పాలక మండళ్ల గడువు ఉన్నవాటిని ముందుగానే రద్దుచేసే ఆలోచనలేదు. గడువు వరకు పాలకమండళ్లు కొనసాగుతాయి. కొత్తగా వచ్చిన 68 మున్సిపాలిటీల్లో లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)అమలు విషయాన్ని పరిశీలిస్తాం.

ఏ జాతీయ నేతా అలా కోరుకోరు...
రోడ్లకు అడ్డంగాప్రార్థనా మందిరాలు, నడిరోడ్డుపై జాతీయ నేతల విగ్రహాలతో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే. రణగొణ ధ్వనుల మధ్య, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ఏ దేవుడూ పూజలు అందుకోవాలని అనుకోరు. ఎండకు ఎండుతూ, దుమ్ములో.. ధూళిలో, కాకిరెట్టలు పడేలా విగ్రహాలు ఉండాలని జాతీయ నేతలు భావించరు. ఈ పరిస్థితి తొలగించేందుకు తొలుత ప్రయత్నించాను. అప్పట్లో భాజపా దత్తాత్రేయ, ఎంఐఎం అసదుద్దీన్‌ ఒవైసీతో చర్చించగా రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రార్థనామందిరాలను తొలగించేందుకుఅంగీకరించారు. తొలుత ఒకవర్గం వారివి తొలగించి, తరువాత మిగతా వారివి తీసివేయాలని చెప్పడంతో మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. అన్నిరాజకీయ పక్షాలు ముందుకువస్తే ఒక పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. మున్సిపాలిటీల ప్రణాళిక, పరిపాలన సంస్కరణల కోసం అర్బన్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం.’’ అని వివరించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించే కార్యాచరణ శాసనమండలి నుంచి మొదలు పెట్టాలని ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.