close
పూచీకత్తే సుమా!

అప్పులు
ఆర్థిక సంఘం చెప్పినదానికంటే అధికంగా వడ్డీలు

రుణాలను తెచ్చేందుకు వీలుగా వివిధ సంస్థలకు ప్రభుత్వం ఇస్తున్న పూచీకత్తులు నూరు శాతం ముప్పు తెచ్చేవిగా ఉన్నట్లు కాగ్‌ అభిప్రాయపడింది. ఇవి చట్ట పరిమితికి దిగువనే ఉన్నప్పటికీ ఆయా సంస్థలకు పూచీకత్తులను ఇస్తున్న సమయంలో నిబంధనలను సరైన రీతిలో పాటించటంలేదని పేర్కొంది. మొత్తం ద్రవ్య బాధ్యతలను లెక్కగట్టి,  వాటిని తీర్చే సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు ప్రభుత్వం ఒక అధ్యయనాన్ని చేపట్టాలని సూచించింది.  వివిధ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయటానికి,  పూచీకత్తుల రూపంలో ఆకస్మిక చెల్లింపులకు కలిపి రానున్న ఏడేళ్ల వ్యవధిలో ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష చెల్లింపుల భారం రూ.2.05 లక్షల కోట్ల మేర ఉంటుందని తెలిపింది.

పరిశీలనలు
* ప్రభుత్వం 2017-18 నాటికి ఇచ్చిన పూచీకత్తుల విలువ రూ.41,892 కోట్లు. ఇవి రెవెన్యూ రాబడుల్లో 51 శాతం మేర ఉన్నందున చట్ట పరిమితిలోనే ఉన్నప్పటికీ.. తాను ఇచ్చిన పూచీకత్తులు నూరు శాతం ముప్పును కలిగించే ఆస్కారం ఉన్నవిగా ప్రభుత్వమే వర్గీకరించింది.
* ప్రభుత్వం హామీ ఉన్న రుణాల్లో 39 శాతం మేర మిషన్‌ భగీరథకు చెందినవి.
* సంస్థల ఆర్థికపరమైన పనితీరు, లాభదాయకత, నిర్వహణ సామర్థ్యం వంటివాటిని పరిశీలించకుండానే ప్రభుత్వం పూచీకత్తులను ఇస్తోంది.
* వడ్డీ చెల్లింపులు రెవెన్యూ రాబడుల్లో 12.19 శాతం మేర ఉన్నాయి. ఇది 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 8.31 శాతం కంటే చాలా ఎక్కువ.
* భారాన్ని తగ్గించుకోవటం కోసం ఏర్పాటైన రుణ, పూచీకత్తుల నిధుల్లో..  ప్రభుత్వం ఏటా ఆయా అప్పులు, పూచీకత్తుల విలువలో 0.5 శాతం చొప్పున జమచేయాల్సి ఉండగా.. 2016-17 నుంచి అలా ఇవ్వటం లేదు.
* ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలోని 10 అంశాలకుగాను నాలుగు అంశాల సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. చెల్లింపులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల సంఖ్య, వారి జీతాలు, పింఛన్ల వ్యయం తదితరాలను సర్కారు బహిర్గతం చేయలేదు.

పథకాలు సూచనలు

* ముప్పు అవకాశాలను సమగ్రంగా మదింపు చేసిన తర్వాతనే ఆయా సంస్థలకు హామీలను ఇవ్వాలి.
* భారీ ఒప్పందాల్లోని పనులకు చెల్లింపులు, భూ సేకరణకు తప్పనిసరి
* బడ్జెట్‌ ద్వారా తెచ్చిన అప్పుల్లో 48 శాతం మేర (రూ.65,740 కోట్లు) ఏడాది నుంచి ఏడేళ్ల వ్యవధిలో తీర్చాల్సి ఉంటుంది. పెరుగుతున్న అప్పుల భారాన్ని తట్టుకోవాలంటే రాష్ట్రం తన వనరులను పెంచుకోవాలి. అలా పెంచుకోకుంటే పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది

పథకాలు
కాసులున్నా ఖర్చు చేయలేదు

సామాజిక, ఆర్థిక ప్రాథమ్యాలను ప్రతిబింబించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాలు, పథకాలకు కేటాయించిన నిధులను ఆశించినంతగా వ్యయం చేయలేదని కాగ్‌ పేర్కొంది. 2017-18 బడ్జెట్‌లో కేటాయింపులు, వ్యయాలపై ప్రభుత్వ ప్రాధాన్య పథకాల తీరును విశ్లేషించింది. రెండు పడక గదుల గృహాల కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించగా రూ.75కోట్లు ఖర్చుచేసినట్లు పేర్కొంది.
* కల్యాణలక్ష్మి: షెడ్యూలు కులాల అభివృద్ధిశాఖకు బడ్జెట్‌లో రూ.210 కోట్లు కేటాయించగా 91శాతం, గిరిజన సంక్షేమశాఖకు రూ.132 కోట్లు కేటాయించగా 93శాతం నిధులు ఖర్చుచేశారు. బీసీ సంక్షేమశాఖకు రూ.400 కోట్లు కేటాయించగా 62శాతం ఖర్చుచేశారు.
* షాదీ ముబారక్‌: రూ.170కోట్లు కేటాయించగా చేసిన ఖర్చు రూ.161.82కోట్లు. 26,625 మంది మైనారిటీ యువతుల వివాహాలు లక్ష్యం కాగా 24,928 మందికి (94శాతం) వర్తింపచేశారు. చెల్లింపులకు ఇంకా 1,688 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా ఆర్థికశాఖ రూ.8.18కోట్లను సవరించిన బడ్జెట్‌లో వెనక్కు తీసుకుంది.
* రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం: ఇల్లు లేని పేదల కోసం 2.80 లక్షల గృహనిర్మాణాలకు బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించగా రూ.75 కోట్లు ఖర్చుచేశారు.
* అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ(ఎంబీసీ): రూ.వెయ్యి కోట్లు కేటాయించగా ఎంబీసీ ఛైర్మన్‌, సిబ్బంది జీతభత్యాలు తదితరాలకు రూ.4.06 కోట్లు ఖర్చుచేశారు. ‘అత్యంత వెనుకబడిన’ అనే పదానికి నిర్వచనం లేని కారణంగా కార్యక్రమాలేవీ చేపట్టలేకపోయామని ప్రభుత్వం అడిట్‌ సమావేశంలో తెలిపింది.
* చేనేత కార్మికులకు సాయం: రూ.1200కోట్లు కేటాయించగా రూ.444.98 కోట్లు వ్యయంచేశారు. 30వేల మంది నేత పనివారికి వర్తింపచేయాలనే లక్ష్యం ఉండగా 20వేల మందికి(67శాతం) వర్తింపచేశారు.
* ఆర్థిక సహాయ పథకాలు-భూమి కొనుగోలు పథకం: రూ.1,337.89 కోట్లు కేటాయించగా రూ.536.17 కోట్లు ఖర్చు చేశారు. ఆర్థికసాయం కింద 29,791 యూనిట్లకు 13,981 పంపిణీ(47శాతం) చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రావడంతో రూ.279.74కోట్ల విలువైన చెక్కులు తిరస్కరణకు గురయ్యాయని తెలంగాణ షెడ్యూలు కులాల సహకార అభివృద్ధి శాఖ తెలిపింది. భూ కొనుగోలు పథకం లక్ష్యం 3,500 ఎకరాలకుగాను 792 ఎకరాలు(23శాతం) సేకరించారు. జిల్లాల్లో వ్యవసాయ భూమి అందుబాటులో లేదని, తగిన ధరలకు భూవిక్రయదారులు ముందుకు రాకపోవడంతో పురోగతి సాధించలేదని ప్రభుత్వం తెలిపింది.
* 2017-18 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలలో కేటాయించిన నిధుల్లో 46శాతం వినియోగించలేదు.
* ఎస్సీ ఉపప్రణాళికకు రూ.12,894కోట్లు కేటాయించి రూ.7,007కోట్లు ఖర్చుచేయగా.. ఎస్టీ ఉపప్రణాళికకు రూ.7,979కోట్లు కేటాయించి రూ.4,295కోట్లు వ్యయంచేశారు.

విద్యుత్‌రంగం
డిస్కంలలోనే అత్యధిక నష్టాలు

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోకెల్లా అధికంగా విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లోనే ప్రభుత్వ పెట్టుబడులు, నష్టాలు ఉన్నట్లు కాగ్‌ వెల్లడించింది. 2017-18లో ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింట్లో రూ.16,365 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వీటిని 7.21 శాతం వడ్డీకి అప్పులు తెచ్చింది. డిస్కంల్లో మొత్తం రూ.2721.27 కోట్లను పెట్టింది. ఆ సంవత్సరం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.6619 కోట్ల నష్టాలు రాగా అందులో రూ.6202 కోట్లు డిస్కంల్లోనే ఉన్నాయి. దీనికి కరెంటు ఛార్జీలే ప్రధాన కారణం అని ప్రభుత్వం తెలిపింది. ఉజ్వల్‌ డిస్కం హామీ యోజన(ఉదయ్‌) కింద 2015 సెప్టెంబరు చివరికి డిస్కంలకు ఉన్న నష్టాల్లో 75 శాతం ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయాలి. దీనివల్ల డిస్కంలకు నష్టాల భారం తగ్గుతుందని భావించారు. డిస్కంల పనితీరుపై ప్రభుత్వ చర్యలు తీవ్ర ప్రభావం చూపినట్లు కాగ్‌ తెలిపింది.

ఎలా అంటే...
* రైతుల పంటలకు తొలుత రోజూ 9 గంటల కరెంటు సరఫరా చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఇది జరగాలంటే విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి రూ.585.91 కోట్లు కావాలని డిస్కంలు ప్రభుత్వాన్ని అడిగాయి. ప్రభుత్వం తిరస్కరించడంతో డిస్కంలు బయటి నుంచి రుణాలు తీసుకున్నాయి.
* ఏటా ప్రతి డిస్కం పరిధిలో ఎంత కరెంటు కొనుగోలు చేయాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) నిర్ణయిస్తుంది. 2016-17లో పంటలకు 9 గంటల సరఫరా వల్ల దక్షిణ తెలంగాణ డిస్కంపై రూ.894.43 కోట్ల భారం పడింది. కరెంటు సరఫరాను 24 గంటల(నిరంతర)కు ప్రభుత్వం పెంచడంతో మరిన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.
* 2016-17లో దక్షిణ డిస్కంకు రాయితీ కోటా కింద ఇవ్వాల్సిన సొమ్ముకన్నా రూ.268.60 కోట్లను ప్రభుత్వం తక్కువగా ఇచ్చింది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు కరెంటు కొనుగోలు బిల్లులు చెల్లించడంలో డిస్కం ఆలస్యం చేసింది. దీనివల్ల జరిమానా రూపంలో రూ.96.07 కోట్లను చెల్లించింది.
* ప్రభుత్వ విధానాలను అమలు చేసినందుకు డిస్కంలకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ.. నష్టాలను పూడ్చితే అవి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని కాగ్‌ సిఫార్సు చేసింది.

సాగునీటి ప్రాజెక్టులు
పనుల్లో జాప్యం.. పైపైకి వ్యయం

రాష్ట్రావిర్భావం నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినప్పటికీ.. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వల్ల.. ఆశించిన ప్రయోజనాలు కలుగలేదని కాగ్‌ పేర్కొంది. ఈ కారణంగా రాష్ట్రానికి ఆర్థికాభివృద్ధి దక్కకుండా పోయిందని అభిప్రాయపడింది.
పరిశీలన: రాష్ట్రంలో 2014-18 సంవత్సరాల మధ్య పెట్టుబడి వ్యయంగా ప్రాజెక్టుల మీద రూ.79,236 కోట్లు ఖర్చు పెట్టింది. 2018 మార్చి నాటికి రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నవి 36 ఉన్నాయి. 19 సాగునీటి ప్రాజెక్టుల తొలి అంచనా రూ.41,204 కోట్లు. మూడేళ్ల నుంచి 11 ఏళ్ల వరకు అయిన జాప్యం వల్ల అంచనా వ్యయం రూ.1,32,928 కోట్లకు పెరిగింది. అంటే భారం రూ.91,727 కోట్లు. ఇప్పటివరకు రూ.70,758 కోట్లు ఖర్చు చేసినా ఇంకా పూర్తికాలేదు. సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద చేపట్టిన నాలుగు ప్రాజెక్టులను 2016-17లో సమీక్షించింది. దశాబ్దం గడిచినా ఇవేమీ పూర్తి కాలేదు. రూ.16,135 కోట్లు వ్యయం చేసినా సాగునీటి వసతి కల్పన, వినియోగం అంతంతమాత్రమే.

ఆరోగ్య రంగం
నిధులు మిగులు

వైద్యఆరోగ్యశాఖకు కేటాయించిన నిధుల్లో అత్యధిక మొత్తం వృథాగా ఉన్నట్లు కాగ్‌ వెల్లడించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద వేర్వేరు పథకాలకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో నిధులు భారీగా వృథా అయ్యాయి. ఎన్‌హెచ్‌ఎం కింద కేటాయించిన నిధుల్లో రూ.317.62 కోట్లు మిగిలిపోయాయి. 2015-16లోనూ రూ.660.72 కోట్లు, 2016-17లో రూ.95.39 కోట్లు వృథాగా మిగులు ఖాతాలో ఉండిపోయాయి. 2015-16లో రూ.408.80 కోట్లు, 2016-17లో రూ.285.09 కోట్లను విడుదల చేసినా.. ఈ నిధుల్లోనూ పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా అమలు చేసే సంస్థల వద్ద మిగిలిపోయాయని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడంతో ఇలా మిగుళ్లు ఏర్పడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లుగా కాగ్‌ చెప్పింది. వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ విభాగాల కింద పదే పదే మిగులు ఏర్పడడం ఈ శాఖల్లోని పథకాలకు ప్రభుత్వం నుంచి ప్రాధాన్యం అందకపోవడాన్ని ఆ శాఖల/అమలు సంస్థల అసమర్థతను సూచిస్తోందని కాగ్‌ తప్పుబట్టింది.

కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్య లక్ష్మిలదీ అదే తంతు

ప్రభుత్వం సామాజిక, ఆర్థిక ప్రాధాన్యతలను ప్రతిబింబించేలా పలు నూతన విధాన నిర్ణయాలను, ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రవేశపెట్టిందని కాగ్‌ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అందులో కేసీఆర్‌ కిట్‌ ఒకటి. మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పథకానికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదని కాగ్‌ పేర్కొంది. ప్రజల నుంచి విశేష స్పందన ఉన్నప్పటికీ ఖర్చు మాత్రం బడ్జెట్‌ కేటాయింపుల కంటే తక్కువే. బిల్లులను ఆర్థికశాఖ ఆమోదించక పోవడంతో రూ.274.23 కోట్లను వినియోగించుకోలేక పోయినట్లుగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ తెలిపారని కాగ్‌ నివేదికలో వెల్లడించింది. గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, ఏడు నెలల నుంచి ఆరేళ్ల పిల్లలకు ఆరోగ్య సేవలను, పౌష్టికాహారాన్ని అందించేందుకు రూపొందించిన ‘ఆరోగ్య లక్ష్మి’ పథకంలోనూ ఖర్చు అంతంతే. నిధులను స్తంభింపజేయడం వల్ల బడ్జెట్‌ను ఉపయోగించుకోలేక పోయామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంచాలకులు పేర్కొన్నట్లుగా కాగ్‌ నివేదికలో పొందుపర్చింది.
కేసీఆర్‌ కిట్‌
బడ్జెట్‌: రూ.605 కోట్లు
ఖర్చు: రూ.271.07 కోట్లు
లక్ష్యం: 6 లక్షలు
నమోదు: 6.57 లక్షలు
ఆరోగ్య లక్ష్మి
బడ్జెట్‌: రూ.429 కోట్లు ఖర్చు: రూ.176.32 కోట్లు
లక్ష్యం: 21,05,792 మంది
సాధించింది: 18,23,339 మంది (87శాతం)
తగ్గుదల: 2,82,453 (13శాతం)

9వ షెడ్యూల్‌ 
ఆస్తులు, అప్పుల విభజనలో జాప్యం

రాష్ట్ర విభజన జరిగినా తొమ్మిదో షెడ్యూల్డు సంస్థల్లో ఆస్తులు, అప్పుల విభజన ఇంకా పూర్తి కాలేదని కాగ్‌ పేర్కొంది. 2017 నాటికి నాలుగేళ్ల మేరకు జాప్యం జరిగిందని వెల్లడించింది. మొత్తం 91 ప్రభుత్వ రంగ సంస్థలకు గాను 62లో రూ. 3189.26 కోట్ల నగదు నిల్వలను గుర్తించారని, మిగిలిన వివరాలు వెల్లడి కాలేదని తెలిపింది.
* 2014 జూన్‌ 2న ఉమ్మడి రాష్ట్ర విభజన జరగ్గా అంతకు నెల ముందే మే నెలలో ప్రభుత్వ రంగ సంస్థల విభజనకు నిపుణుల కమిటీ ఏర్పాటైంది.
* ఈ కమిటీ 86 సంస్థల విభజన కోసం రెండు ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చింది.
* ఇందులో నలభై సంస్థల విభజన సిఫార్సులను ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ కేవలం రెండు సంస్థలు మినహా మిగిలిన వాటి విభజనకు అంగీకరించలేదు.
* ఆస్తులు, అప్పుల విభజన జరగకపోవడం వల్ల తెలంగాణకు ప్రయోజనాలు చేకూరలేదు.
* తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆస్తులు, అప్పుల విభజనను చేపట్టాలని కాగ్‌ సిఫార్సు చేసింది.
- ఈనాడు, హైదరాబాద్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.