close
కశ్మీర్‌ సమస్యకు నెహ్రూయే కారణం

 కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

ముంబయి, న్యూస్‌టుడే: కశ్మీర్‌ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. జమ్మూ- కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించిన 370, 35(ఎ) అధికరణాల రద్దుపై ప్రజలకు అవగాహన కలిగించడానికి భాజపా ఆదివారం ముంబయిలో నిర్వహించిన జన జాగరణ్‌ సభలో ఆయన ప్రసంగించారు. కశ్మీర్‌ ఆక్రమణకు వచ్చిన పాక్‌ గిరిజనులపై నెహ్రూ అర్ధాంతరంగా కాల్పులు ఆపించారని, అందువల్లనే కొంత భూ భాగం వారి ఆధీనంలో ఉండిపోయిందని తెలిపారు. అదే ఇప్పుడు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌గా ఏర్పడిందని అన్నారు. అప్పటి హోం మంత్రి సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. 370, 35(ఎ)అధికరణాల రద్దు అంశంతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని అన్నారు.

మళ్లీ మా దేవేంద్రుడే
మహారాష్ట్రలో భాజపా-శివసేనల మధ్య సంబంధాలు అంత సవ్యంగా లేదన్న విషయం ఆదివారం మరోసారి బహిర్గతమయింది. జనసంకల్ప్‌ యాత్ర పేరుతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్‌ షా తన ప్రసంగంలో మిత్రపక్షమైన శివసేన పేరెత్తకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ దేవేంద్ర ఫడణవీస్‌ ఉంటారని స్పష్టంగా ప్రకటించారు. ఎన్‌డీఏకు నాలుగింట మూడొంతుల మెజార్టీ వస్తుందని తెలిపారు. ఎన్‌డీఏ అని ప్రస్తావించినా ఎక్కడా శివసేన అని పేర్కొనకపోవడం గమనార్హం. తరువాత జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలోనూ ఎన్నికల వ్యూహంపై మాట్లాడారే తప్ప, పొత్తులను ప్రస్తావించలేదు. ఫడణవీసే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అమిత్‌ షా ప్రకటించడం వెనుక కూడా ఓ వ్యూహం ఉంది. ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిని చేయాలని శివసేన కోరుతోంది. అయితే గతంలో మాదిరిగా ఆ పార్టీ ఎత్తులు, ఒత్తిళ్లకు లొంగకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేసినట్టు కనిపిస్తోంది.

హక్కుల ఉల్లంఘనతో పాక్‌ ముక్కలు: రాజ్‌నాథ్‌
పట్నా: 370 రద్దు అంశంపై అవగాహన కల్పించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బిహార్‌లోని పట్నాలో సమావేశం నిర్వహించారు. కశ్మీర్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాదులను స్వాతంత్య్ర సమరయోధులంటూ తన చర్యలను సమర్థించుకుంటోందని విమర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘన, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కారణంగా పాక్‌ దానంతట అదే ముక్కలవుతుందంటూ వ్యాఖ్యానించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.