close
నడ్డా.. అబద్ధాల అడ్డా 

ఇది తెలంగాణ బిడ్డల గడ్డ.. మీ కర్నాటకాలు ఇక్కడ చెల్లవు 
నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు.. నీతిఆయోగ్‌ చెప్పిందేమిటో తెలుసుకోండి 
50 లక్షల పైచిలుకు సభ్యత్వంతో తెరాస తిరుగులేని రాజకీయశక్తిగా ఆవిర్భవించింది 
ఆయుష్మాన్‌భవ కంటే ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైన పథకం 
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ‘నడ్డా...ఇది తెలంగాణ బిడ్డల గడ్డ..అమాయకులెవరూ లేరిక్కడ. అందరం ఆరితేరినవారమే. మీ కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ చెల్లవు’. అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆయన జేపీ నడ్డా కాదు. అబద్దాల అడ్డా అని తీవ్రంగా విమర్శించారు. సోమవారం జరిగిన కూకట్‌పల్లి నియోజకవర్గం బూత్‌స్థాయి, డివిజన్‌, అనుబంధ కమిటీల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు సభ్యత్వాన్ని పూర్తిచేసుకొని తెరాస తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. ఆదివారం భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెరాసపై, కేసీఆర్‌పై చేసిన ఆరోపణలపై కేటీఆర్‌ ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు.

‘‘కేసీఆర్‌ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని, కమీషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ అంటూ నోటికొచ్చినట్లు నడ్డా మాట్లాడటం సరికాదు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి.  ఎవరో రాసిచ్చింది చదివి వెళ్తే సరిపోతుందా? తెలియకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన  నీతి ఆయోగ్‌ను అడిగి తెలుసుకోండి. దేశంలోనే ఎక్కడా ఇటువంటి మంచి పథకాలు లేవని   ఆ సంస్థ చెప్పిన విషయాన్ని తెలుసుకోండి. ఈ పథకాలను అధ్యయనం చేసేందుకు దేశంలోని 11 రాష్ట్రాల నుంచి అధికారులు, మంత్రులు తెలంగాణకు క్యూకట్టిన విషయం తెలియదా?జేపీ నడ్డా మాటల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదు. ఆయుష్మాన్‌ భారత్‌కంటే ఆరోగ్యశ్రీ చాలా మెరుగైన పథకమని మా సీఎం కేంద్రం ముఖం మీదే చెప్పారు. ఇందులో చిన్నచిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటాం తప్ప మీ సహకారం, సాయం మాకు అవసరం లేదు. ఇక్కడి పథకాలను కేంద్రం కాపీ కొట్టి, పేరు మార్చి ప్రవేశపెడుతున్న మాట నిజం కాదా? పింఛను మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుందని భాజపా నేత ఒకాయన అంటున్నారు. కానీ మేం ఖర్చు చేసే మొత్తం రూ.12 వేల కోట్లలో కేంద్రం నుంచి వచ్చేది కేవలం రూ.200 కోట్లే. భాజపా అధికారంలో ఉన్న అత్యధిక రాష్ట్రాల్లో ఏ ఒక్కచోటైనా వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్నారా? తెలంగాణలో మేమిస్తున్నాం.న్యాయపరంగా రావాల్సిన నిధులు తప్ప భాజపా ఇప్పటివరకు తెలంగాణకు కానీ, హైదరాబాద్‌కి కానీ పైసా కూడా అదనంగా ఇవ్వలేదు. 50 లక్షల మందికి రూ.2 వేలు పింఛను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.  ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని మూడేళ్లలో పూర్తిచేసుకుంటే హర్షించాల్సిందిపోయి గగ్గోలు పెడుతున్నారు.’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

రాష్ట్రం బాగుపడుతుంటే వారికి నచ్చదు 
‘‘రాష్ట్రం బాగుపడుతున్నా.. పచ్చగా పంటలు పండుతున్నా.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వంటి ప్రాజెక్టులు నిండుతున్నా భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు నచ్చదు. హైదరాబాద్‌ నగరం ప్రశాంతంగా ఉంటే వారికి నిద్రపట్టదు. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగా. ఇక్కడే చదువుకున్నా. అప్పట్లో తరచూ కర్ఫ్యూ విధించేవారు. వినాయకచవితి లేదా ఇంకో పండుగ సందర్భంగా కర్ఫ్యూతో బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితిలో ప్రజలు ఉండేవారు. మతాలు, కులాల పేరుతో చిచ్చుపెట్టి ఆ మంటలతో చలి కాచుకోవడం వారికి అలవాటు. సీఎం కేసీఆర్‌ హయాంలో అటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రా, తెలంగాణ గొడవలుగానీ, మత ఘర్షణలుగానీ ఒక్కసారి కూడా చోటుచేసుకోలేదు.’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.  అంతకుముందు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి మాట్లాడారు. తెలంగాణ కరడుగట్టిన ఉద్యమకారుల అడ్డా అని, ఇక్కడ ఏ పార్టీని అడుగుపెట్టనివ్వబోమన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే వివేకానంద్‌ పాల్గొన్నారు.

తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీ నేతలు కొత్త బిచ్చగాళ్ల తరహాలో వ్యవహరిస్తున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని తెరాస ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాది రెండు నాల్కల ధోరణి అని, గతంలో ఆరోగ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న ఆయన ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని ఆరోపించారు.    ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, భాస్కర్‌రావు, గొంగిడి సునీత, భూపాల్‌రెడ్డిలు సోమవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ, నడ్డా కేంద్ర వైద్య శాఖ మంత్రిగా ఆరోగ్యశ్రీని మెచ్చుకున్నారని, ఆయనతోపాటు  కేంద్ర మంత్రులు, అధికారులు తెరాస ప్రభుత్వాన్ని పొగిడారన్నారు.ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చి అబద్దపు ఆరోపణలు చేశారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే వాటిని ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ నేతలకు చేతనైతే తెలంగాణకు విభజన చట్టం హామీలు అమలు పరచాలని అన్నారు.


 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.