close
కలెక్టర్లే కార్యసాధకులు 

చట్టాల అమలు, సంక్షేమ పథకాలపై వారికి దిశానిర్దేశం 
నేడు, రేపు ముఖ్యమంత్రి సమావేశాలు 
32 అంశాల భారీ ఎజెండా

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా కలెక్టర్ల వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంతో పాటు వారికి కీలక బాధ్యతలను అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. ఇప్పటికే పంచాయతీరాజ్‌, పురపాలక కొత్త చట్టాల్లో వారికి ముఖ్య అధికారాలు కట్టబెట్టారు. కీలక నిర్ణయాలను తీసుకునే వీలు కల్పించారు. త్వరలో రానున్న కొత్త రెవెన్యూ చట్టంలోనూ కలెక్టర్లకు ప్రాధాన్యం కల్పించబోతున్నారు. వీటన్నింటిపైనా దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళ, బుధవారాల్లో ప్రగతిభవన్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ల కొత్త పాత్రను వివరించడంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన, పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాల అమలుతో పాటు పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిర్దేశించిన 60 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ, సాగునీటి వినియోగ ప్రణాళిక అంశాలపై ఇందులో చర్చించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల ఎజెండాలో దాదాపు 32కి పైగా అంశాలున్నాయి.

తొలిసారి కలెక్టర్లతో సమావేశం 
రాష్ట్రంలో రెండోసారి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తొలిసారిగా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమవుతున్నారు. ఎన్నికలకు ముందు 31 జిల్లాలు ఉండగా.. అనంతరం వాటి సంఖ్య 33కి పెరిగింది. వీరి పనితీరుకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, కార్యక్రమాలపై కొందరు కలెక్టర్లు బాగా పనిచేస్తుండగా.. మరికొందరు ఆశించిన స్థాయిలో రాణించలేదనే అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో సుపరిపాలన లక్ష్యంతో సీఎం కొత్త పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలను రూపొందించారు. ఇందులో కలెక్టర్లకు కొత్త అధికారాలు కల్పించారు. ఇదే తరహాలో కొత్త రెవెన్యూ చట్టం సిద్ధమవుతోంది. దీన్ని సీఎం అత్యంత కీలకంగా భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు జరిగింది. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే కొత్త చట్టం గురించి వెల్లడించిన ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా  రూపకల్పన చేపట్టారు. అధికారులు, నిపుణులతో చర్చలు జరిపారు. చట్టం కూర్పు తుది దశలో ఉండగా.. జిల్లా కలెక్టర్లు దీనిపై ఎలా పనిచేయాలనే దానిపై... వారి నుంచే అభిప్రాయాలను, సూచనలను, సలహాలను స్వీకరించి.. ఇందులో చేర్చాలని నిర్ణయించారు. రెవెన్యూశాఖలో అవినీతిపై ఇప్పటికే సీఎం ఆగ్రహంగా ఉన్నారు. ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు వీలుగా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నారు.

కొత్త చట్టాల విధులపై స్పష్టత 
కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఇప్పటికే అమల్లో ఉంది. గత నెలలో కొత్త పురపాలక చట్టం వచ్చింది. ఈ రెండింటికీ అనుగుణంగా 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సీఎం ప్రకటించారు. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు అధికారాల వికేంద్రీకరణతో నిధుల కేటాయింపు, ప్రజాప్రతినిధులకు బాధ్యతలు, విధులపై స్పష్టత ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. వీటన్నింటిపై కలెక్టర్ల సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు. త్వరలో పురపాలక ఎన్నికలు రానున్నాయి. వీటిని పురస్కరించుకొని పలు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించే 
అవకాశముంది.

కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రారంభోపన్యాసం కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలతో సాగనుంది. గోదావరి ద్వారా, వర్షాల వల్ల సమకూరిన జలసంపద సద్వినియోగం అయ్యేలా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. దీంతో పాటు హరితహారం, చేపలు, గొర్రెల పెంపకం వంటివి ఎజెండాలో ఉన్నాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.