
జలవిద్యుత్తు ప్రాజెక్ట్ కాంట్రాక్టు రద్దు ఉత్తర్వులను కొట్టేయండి
హైకోర్టును ఆశ్రయించిన ‘నవయుగ’
ఇతరులకు పనులు అప్పగించకుండా నిలువరించాలని అభ్యర్థన
నేడు విచారించనున్న న్యాయస్థానం
ఈనాడు, అమరావతి: పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు (పీహెచ్ఈపీ) పనుల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేశారంటూ నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆగస్టు 14న ఏపీ జెన్కో (హైడల్ ప్రాజెక్ట్స్) చీఫ్ ఇంజినీర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు నవయుగ డైరెక్టర్ వై.రమేశ్ హైకోర్టులో సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు. ‘80 మెగావాట్ల సామర్థ్యంతో 12 హైడ్రో పవర్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఏపీ జెన్కోతో 2017 డిసెంబర్ 20న ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందంలో భాగంగా పలు పనులు నిర్వహించాల్సి ఉంది. కాంట్రాక్ట్ విలువ రూ.3220.28 కోట్లు. ఒప్పందం ప్రకారం స్థలం అప్పగించినప్పటి నుంచి 40 నెలల్లో మొదటి మూడు యూనిట్లను పూర్తి చేయాలి. మిగిలిన 9 యూనిట్లను రెండు నెలలకొకటి చొప్పున 18 నెలల్లో పూర్తి చేయాలి. ఒప్పంద తేదీ నుంచి ఎలాంటి లోపం జరగకుండా మా బాధ్యతలు నెరవేరుస్తున్నాం. ఫ్రాన్స్‌లో టర్బైన్ నమూనా పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాం. ఇందుకు చీఫ్ ఇంజినీర్ 2018 జూన్‌లో అంగీకారం (అప్రూవల్) కూడా తెలిపారు. తర్వాత పవర్‌హౌస్ నిర్మాణాన్ని 30 మీటర్ల దిగువకు తరలించాలని అధికారులు ప్రతిపాదిస్తే మేం 2019 ఫిబ్రవరిలో ఆమోదించాం. ఆ డిజైన్‌ను ఏప్రిల్‌లో అధికారులు ఆమోదించినా పని నిర్వహించాల్సిన ప్రాంతాన్ని మాకు అప్పగించలేదు’అని నవయుగయాజమాన్యం వ్యాజ్యంలో పేర్కొంది.
కాంట్రాక్టు రద్దుకు కారణాలేవి?
ఏపీలో ప్రభుత్వం మారాక సీఎం జులై 1న అకస్మాత్తుగా పునఃసమీక్ష సమావేశం నిర్వహించారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. కాంట్రాక్టును రద్దు చేయాలని ఏకపక్షంగా నిర్ణయించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారని వెల్లడించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ జులై 19న లేఖ పంపుతూ తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు.. పోలవరం ప్రాజెక్ట్ పనుల్ని తక్షణం నిలిపేయాలని కోరారన్నారు. ఒప్పందంలో తాము ఏం ఉల్లంఘించామో చెప్పలేదని, రద్దుకు కారణాలేమిటో వివరించలేదని నవయుగ డైరెక్టర్ వ్యాజ్యంలో ఆక్షేపించారు. ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు నిబద్ధతతో ఉన్నామని, ఇప్పటి వరకు రూ.398 కోట్లు ఖర్చు చేశామంటూ చీఫ్ ఇంజినీర్ లేఖకు సమాధానం కూడా పంపామన్నారు. ఒప్పందాన్ని రద్దు చేస్తే భారీ నష్టం వాటిల్లుతుందని చెప్పినా తమ వాదనను పట్టించుకోలేదని చెప్పారు.
ప్రభుత్వ ఆదేశాలకు జెన్కో కట్టుబడక్కర్లేదు
‘ఏపీ జెన్కోకు మాకు మధ్య ఒప్పందం జరిగింది. కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర సర్కారు మూడో పార్టీ మాత్రమే. ఒప్పందాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏపీ జెన్కో కట్టుబడాల్సిన అవసరం లేదు. మేం పనులు చేయాల్సిన చోట స్థలాన్ని అప్పగించాల్సిన బాధ్యత జెన్కోపై ఉన్నా వారు పట్టించుకోలేదు. ఒప్పంద రద్దు ఉత్తర్వుల జారీ వెనుక దురుద్దేశం ఉంది. ఆ ఉత్తర్వులు చట్టవిరుద్ధం. యంత్రాలు సమకూర్చుకొనేందుకు, సబ్ వెండర్లకు, ఇతరులకు ఇప్పటికే భారీగా చెల్లించాం. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఒప్పందం రద్దు చేస్తూ ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ ఆగస్టు 14న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయండి. ఆ కాంట్రాక్టు పనులు కొనసాగించేందుకు అనుమతించండి’ అని వ్యాజ్యంలో నవయుగ డైరెక్టర్ కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరపనున్నారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
- వైద్యానికి డబ్బుల్లేక భార్య సజీవ ఖననం