close
ఇంటి అనుమతి.. ఇక సులభం 

విధానంలో వేగం.. పారదర్శకం 
భవన నిర్మాణ అనుమతులపై మార్గదర్శకాలు 
పది రోజుల్లో అందుబాటులోకి 
పురపాలకశాఖ ప్రత్యేక కసరత్తు 
స్ఫూర్తిమంతంగా కొత్త పురపాలక చట్టం 
ఈనాడు - హైదరాబాద్‌

ఇప్పటి వరకు: 
సగటు పట్టణ పౌరుడు కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు అనుమతుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనేది. పాత పురపాలక చట్టం ప్రకారం నిర్మాణదారులు భవన నిర్మాణ అనుమతి తెచ్చుకునేందుకు సదరు మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇంటి నిర్మాణం అంటేనే వారు భయపడుతున్నారు. అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ పురపాలకశాఖలో ఎంతో కొంత విదిలిస్తేనే అనుమతి దిశగా అడుగులు పడుతున్నాయి. నిర్మాణదారుడు పూర్తి నిబంధనలు పాటించినప్పటికీ రూ.20 వేల నుంచి 25 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. లేకుంటే పలుచోట్ల భవన నిర్మాణ అనుమతి వచ్చే పరిస్థితి లేదు.

ఇకపై: 
భవన నిర్మాణ అనుమతులను కొత్త పురపాలక చట్టం సులభతరం చేస్తుంది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మించుకునే ఇంటికి అనుమతి అవసరం ఉండదు. కేవలం రూపాయి చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరిపోతుంది. సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్తి పన్నుగా రూ.100 చెల్లిస్తే చాలు. 500 చదరపు మీటర్లు, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణాలకు నిర్దేశిత పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లోనే అనుమతి పొందే విధానం త్వరలో అమలులోకి రానుంది. అన్నీ సక్రమంగా ఉంటే 24 గంటల్లోనే అనుమతి ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పురపాలక చట్టం ప్రజలకు అన్ని విధాలా మేలు చేసేదిగా ఉండనుంది. అందరికీ స్ఫూర్తిమంతం కానుంది. దీనిపై పురపాలకశాఖ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. చట్టాన్ని పటిష్ఠంగా, పారదర్శకంగా అమలు చేసేలా మార్గదర్శకాలను రూపొందిస్తోంది. పది రోజుల్లో ఇవి అమలులోకి రానున్నాయని విశ్వసనీయ సమాచారం. పట్టణాలు, నగరాల్లో స్థలాల విలువ భారీగా పెరగడం వంటి పరిస్థితుల నేపథ్యంలో చిన్నచిన్న స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేందుకు పలువురు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ప్రకారం తక్కువ స్థలం ఉండి నిర్మించుకునే ఇళ్లకు ఇబ్బందులు ఉండవు. కొత్తగా వచ్చే స్వీయ దరఖాస్తు విధానం అనేది దరఖాస్తుదారుడిదే పూర్తి బాధ్యుడిని చేస్తుంది. ఈ ప్రకారం నిబంధనల మేరకు వ్యవహరించడం తప్పనిసరి. లేదంటే జరిమానా, ఇతర చర్యలకు అవకాశం ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు పురపాలకశాఖ గుర్తిస్తే అలాంటి భవనాన్ని నోటీసులు ఇవ్వకుండానే కూల్చేలా చట్టంలో స్పష్టం చేశారు. తప్పుడు వివరాలతో అనుమతి పొందితే వాటిని రద్దు చేసే అధికారం పురపాలకశాఖకు ఉంటుంది.

అవినీతికి అడ్డుకట్ట 
భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసిన నేపథ్యంలో అవినీతికి, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని పురపాలకశాఖ భావిస్తోంది. కొందరు ఆమ్యామ్యాలు ఇచ్చుకోలేక.. మరికొందరు తమకు నిర్మాణ అనుమతులు లభించవనే కారణంతో అక్రమ నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు. నిబంధనల మేరకు అనుమతులు సులభం కావడంతో పాటు 75 చదరపు గజాల వరకూ అనుమతి అవసరం లేకపోవడంతో ప్రతి నిర్మాణం కూడా పురపాలకశాఖ లెక్కల్లోకి వస్తుంది. ఈ కారణంగా అవినీతికి అడ్డుకట్ట పడొచ్చని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలకు నిర్మాణదారులే పూర్తి జవాబుదారీ అవుతారు.

పటిష్ఠంగా ఆన్‌లైన్‌ విధానం 
అన్ని భవన నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌ కావడంతో ఆన్‌లైన్‌ విధానాన్ని పటిష్ఠం చేయనున్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందించడానికి ఇబ్బందులు లేకుండా సర్వర్‌ వేగంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలకశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తామని స్పష్టం చేశారు.

24 గంటల్లోనే... 
భవన నిర్మాణ అనుమతికి అవసరమైన పత్రాలను నిర్మాణదారుడు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్‌ చేయాలి. ఈ దరఖాస్తుల విధానంలో జాప్యం లేకుండా అనుమతులిచ్చేలా ప్రత్యేక చర్యలు ఉంటాయి. పురపాలక కమిషనర్‌ స్వీయ పర్యవేక్షణలో ఏ రోజుకారోజు భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులను సమీక్షిస్తారు. నిర్దేశిత పత్రాలు పక్కాగా ఉంటే 24 గంటల్లోనే అనుమతి మంజూరు చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్తామని పురపాలకశాఖ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ఇళ్లను నిర్మించుకునేవారు లంచాలు ఇచ్చే పనిలేకుండా పురపాలక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు. కొత్త చట్టం అమలును కలెక్టర్లు ప్రత్యేకంగా పరిశీలించడంతో పాటు ప్రతినెలా సమీక్షిస్తారని వివరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.