close
క్రయోజెనిక్‌ కష్టం 

మొరాయించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 
సర్క్యూట్‌లో వేగంగా పడిపోయిన పీడనం 
అందుకే నిలిచిపోయిన  చంద్రయాన్‌-2 
లోపం చిన్నదైతే  2-3 రోజుల్లోనే ప్రయోగం 
సమస్య పెద్దదైతే  2 నెలలు పట్టే అవకాశం 
శ్రీహరికోట నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

నరాలు తెగే ఉత్కంఠకు ఈ ఆదివారం చిరునామాగా నిలిచింది. సూపర్‌ ఓవర్‌ వరకూ వెళ్లిన క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌, చివరి సెట్‌ టైబ్రేకర్‌లో ఫలితం తేలిన వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ క్రీడాభిమానులను ఉత్కంఠతో ఊపేశాయి. ఉర్రూతలూగించాయి. ఆ వెంటనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న భారత జాబిల్లి యాత్ర ‘చంద్రయాన్‌-2’ మాత్రం నిరాశపర్చింది! కాస్త దారిలోకి వచ్చిందనుకున్న ‘నాటీ బాయ్‌’ వాహకనౌక జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 క్రయోజెనిక్‌ దశలో కొంచెం మొరాయించింది. దీంతో జాబిల్లిపై మువ్వన్నెల పతాకాన్ని ఎగరేస్తుందని, దేశ సాంకేతిక సత్తాను అంతర్జాతీయ యవనికపై సగర్వంగా ఆవిష్కరిస్తుందని యావత్‌ భారతావని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రయోగం తాత్కాలికంగా నిలిచిపోయింది. 
క్షిణ భారతదేశంలోని శ్రీహరికోట నుంచి జాబిల్లి దక్షిణ ధ్రువానికి రివ్వున ఎగిరిపోతుందనుకున్న ‘చంద్రయాన్‌-2’ చివర్లో అనూహ్యరీతిలో ఆగిపోయింది. జాబిల్లి-సౌర కుటుంబం పుట్టుక రహస్యాలతోపాటు చంద్రుడిపై నీరు, ఖనిజాల విస్తృతిని శోధించేందుకు ఉద్దేశించిన ఈ సంక్లిష్ట ప్రయోగం మరోసారి వాయిదా పడక తప్పలేదు. 
ఒక్కసారిగా గందరగోళం 
ఆదివారం అర్ధరాత్రి శ్రీహరికోటలో ‘చంద్రయాన్‌-2’ ప్రయోగానికి కసరత్తు మొత్తం సాఫీగా సాగుతోంది. అర్ధరాత్రి దాటాక సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లేలా కౌంట్‌డౌన్‌ నిర్దేశిత రీతిలోనే నడుస్తోంది. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా శ్రీహరికోటకు విచ్చేశారు. ఉన్నట్టుండి కౌంట్‌డౌన్‌కు సంబంధించిన డిజిటల్‌ గడియారం 56 నిమిషాల వద్ద స్తంభించింది. దీంతో సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌)లో మీడియాలోనూ, సందర్శకుల్లోనూ ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ప్రయోగం జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ చెలరేగింది. చంద్రయాన్‌-2 వ్యోమనౌకను రోదసిలోకి మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్‌కు సంబంధించిన దృశ్యాలు అప్పటివరకూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారీ తెరలపై కనిపించాయి. ఒక్కసారిగా ఆ ప్రసారాలు కూడా నిలిచిపోయాయి. దీంతో అందరిలోనూ శంక మొదలైంది. 
క్లుప్తంగా ప్రకటన 
కౌంట్‌డౌన్‌ గడియారం స్తంభించిన 25 నిమిషాల తర్వాత గందరగోళానికి తెరదించుతూ ఇస్రో పౌర సంబంధాల అధికారి గురుప్రసాద్‌ క్లుప్తంగా ఒక ప్రకటన చేశారు. ప్రయోగ సమయానికి గంట ముందు వాహకనౌక అయిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ముందుజాగ్రత్త చర్యగా ప్రయోగాన్ని నిలిపివేస్తున్నామని చెప్పారు. తదుపరి ప్రయోగ సమయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు. 
అన్నీ సరిచేశాకే తిరిగి ప్రయోగం 
‘చంద్రయాన్‌-2’ నిలిచిపోవడం దేశవ్యాప్తంగా కోట్ల మందిని నిరాశపరిచింది. అయినా ప్రయోగానికి ముందే సమస్యను గుర్తించడంతో పెద్ద ఇబ్బంది తప్పినట్లే. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ ఇప్పటికే దాదాపు రూ.వెయ్యి కోట్లు వెచ్చించింది. ఏళ్ల తరబడి శాస్త్రవేత్తల శ్రమ, దేశ ప్రతిష్ఠ ఇందులో ఇమిడి ఉన్నాయి. చరిత్రాత్మకమైన ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి ఇబ్బందికి ఆస్కారం ఉండకూడదన్న ఉద్దేశంతో ఇస్రో అనేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రయోగానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ నిశితంగా గమనించింది. సెకను సెకనుకూ పరిస్థితిని పర్యవేక్షించింది. జాబిల్లి మీద రోవర్‌ను దింపే ఇలాంటి సంక్లిష్ట ప్రయోగం విషయంలో లోటుపాట్లకు తావివ్వకూడదని భావించింది. అన్నీ సవ్యంగా ఉన్నాకే ప్రయోగం చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రయోగం వాయిదాపై ఇస్రో నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. 
వ్యోమనౌక సురక్షితం 
వాయిదా నిర్ణయంతో 15 అంతస్తుల భవనమంత ఎత్తు ఉన్న వాహకనౌకను, చంద్రయాన్‌-2 వ్యోమనౌకను కాపాడుకున్నట్లయింది. కాబట్టి సమస్యను సరిదిద్దుకొని, మరో రోజున ప్రయోగాన్ని చేపట్టడానికి ఆస్కారం ఉంది. ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌ సంస్థ ప్రయోగించిన జాబిల్లి ల్యాండర్‌ బెరెషీట్‌ చివరి దశలో విఫలం కావడం గమనార్హం. 
చేజిక్కని అరుదైన ఘనత 
చంద్రుడిపై మానవుడు మొట్టమొదటిసారిగా కాలుమోపి ఈ నెల 20కి 50 ఏళ్లు పూర్తవుతాయి. 1969 జులై 20న అమెరికా వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బజ్‌ ఆల్డ్రిన్‌లు జాబిల్లిపై దిగారు. వీరు తమ అపోలో-11 వ్యోమనౌకలో జులై 16న భూమి నుంచి బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున చంద్రయాన్‌-2 ప్రయోగం జరిగి ఉంటే.. ఆ చారిత్రక వారంలో జాబిల్లిపై తన తొలి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ప్రయోగాన్ని నిర్వహించిన ఘనత మనదేశానికి దక్కి ఉండేది. 
మానవసహిత యాత్రకూ ఇదే రాకెట్‌! 
ఇస్రో వద్ద ఉన్న వాహకనౌకలన్నింటిలోకి అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రాకెట్‌ను ‘నాటీ బాయ్‌’గా, ‘ప్యాటీ బాయ్‌’గా పిలుస్తారు. 4 టన్నుల బరువును భూ కక్ష్యలోకి ఇది మోసుకెళ్లగలదు. 
‘జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3’ మూడు అంచెల రాకెట్‌. మొదటి దశలో రెండు స్ట్రాపాన్‌ మోటార్లు ఉంటాయి. అవి ఘన ఇంధనంతో పనిచేస్తాయి. రెండో దశలో ఒక కోర్‌ బూస్టర్‌ ఉంటుంది. అందులో ద్రవ ఇంధనం ఉంటుంది. మూడోది క్రయోజెనిక్‌ ఇంజిన్‌ దశ. ఇందులో ఇంధనంగా ద్రవ హైడ్రోజన్‌, దాన్ని మండించే ఆక్సిడైజర్‌గా ద్రవ ఆక్సిజన్‌ ఉంటాయి. చంద్రయాన్‌-2 ప్రయోగం సాఫీగా సాగి ఉంటే అది.. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3కి నాలుగో యాత్ర అయ్యిండేది. 2022లో ప్రయోగించాల్సిన భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్రకు కూడా ఈ వాహకనౌకనే ఉపయోగించాల్సి ఉంది. అందువల్ల ఈ వాహకనౌకను ఎలాంటి లోపాలకు ఆస్కారం లేని సాధనంగా తీర్చిదిద్దడం చాలా ముఖ్యం.

క్రయో సర్క్యూట్‌లో లోపమా?

శ్రీహరికోట, న్యూస్‌టుడే: జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3లో తలెత్తిన సాంకేతిక లోపంపై ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ కోణాల్లో పరిశీలన జరుపుతున్నారు. క్రయోజెనిక్‌ దశలో లోపం తలెత్తినట్లు వారు నిర్ధారణకు వచ్చారు! క్రయో ఇంజిన్‌లో సర్క్యూట్‌ ఉంటుంది. రాకెట్‌ ప్రయోగానికి గంట ముందు ఆ సర్క్యూట్‌లో పీడనం(బార్‌) ‘30 నుంచి 320’ వరకు ఉన్నట్లు సమాచారం. ఇది ఒక్కసారిగా పది నిమిషాల వ్యవధిలో ‘30 నుంచి 290’ వరకు తగ్గిపోయింది. అంటే నిమిషానికి మూడు బార్లు చొప్పున పది నిమిషాల వ్యవధిలో 30 బార్లు ఒక్కసారిగా తగ్గిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రయోగంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గుర్తించి వాయిదా వేశారు.  
త్వరలో నివేదిక: వాహకనౌకలో ఏర్పడిన లోపాలను గుర్తించేందుకు కమిటీలను నియమించారు. ఈ కమిటీల్లో విశ్రాంత సంచాలకులు, సీనియర్‌ శాస్త్రవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. లోపాలను గుర్తించి త్వరలోనే ఇస్రో అధిపతికి వారు నివేదిక సమర్పిస్తారు. 

ఇప్పుడేం జరుగుతుంది? 

ప్రస్తుతం షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహక నౌక ఉంది. అందులో ఇంధనాన్ని సోమవారం మధ్యాహ్నానికి ఖాళీ చేశారు. రాకెట్‌ను ప్రయోగ వేదికపైనే ఉంచి వివిధ భాగాలను విడగొట్టి లోపాన్ని గుర్తించే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. చిన్న లోపం అయితే 2-3 రోజుల్లోనే సరిచేసి, మళ్లీ ప్రయోగం చేపట్టాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ లోపం పెద్దదైతే వాహకనౌకను విడగొట్టి ‘వెహికిల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌(వ్యాబ్‌)’కు తీసుకెళ్తారు. అది అనివార్యమైతే ఈ నెల 29, 30 తేదీల్లో లాంచ్‌ విండో అందుబాటులో ఉండడంతో ఆ సమయంలో ప్రయోగం చేపట్టాలని వారు భావిస్తున్నారు. అయితే క్రయోజెనిక్‌ ఇంధన పీడనంలో లోపాలుంటే వాటికి కారణాలను గుర్తించి సరిచేయడం, తిరిగి ఈ నెలలోనే ప్రయోగానికి సిద్ధం చేయడం అనుమానమే. కనీసం రెండు నెలల తర్వాతే అంటే సెప్టెంబరులో ప్రయోగం జరగొచ్చని పలువురు భావిస్తున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.