close
రూ.2 వేల కోట్లకుపైగా పన్ను ఎగవేత 

10 వేల మంది వ్యాపారులకు నోటీసులు 
జీఎస్టీకి ముందు అక్రమాలపై వాణిజ్య పన్నుల శాఖ నజర్‌ 
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో జీఎస్టీ చట్టం రాక మునుపు జరిగిన పన్ను అక్రమాలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. అంతర్రాష్ట్ర సరకు రవాణా పేరుతో కోట్ల రూపాయల పన్ను ఎగవేతపై వాస్తవాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించింది. సుమారు రూ.2 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి రావాల్సిన రాబడికి గండికొట్టినట్లు అంచనా వేసిన ఆ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పది వేల మందికిపైగా వ్యాపారులకు నోటీసులు జారీ చేసింది. 
ఇతర రాష్ట్రాలకు పంపిన సరకుపై నిబంధనల ప్రకారం 5 శాతం పన్ను చెల్లించాలి. చాలామంది వ్యాపారులు కేవలం రెండు శాతమే చెల్లించినట్టు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ప్రధానంగా బియ్యం, పప్పుల మిల్లర్లు ఎక్కువగా అక్రమాలకు పాల్పడినట్టు తేల్చింది. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రాక మునుపు 2014-15, 2015-16లో జరిగిన పన్ను ఎగవేత వ్యవహారంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలకు సరకు పంపినప్పుడు ఉపయోగించిన వే బిల్లుల ఆధారంగా ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా కేంద్రం వద్ద ఉన్న వే బిల్లుల ఆధారంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో వ్యాపారులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై డీలర్లు అందజేసే వివరాలు, వే బిల్లులను విశ్లేషించి పన్ను చెల్లింపు అక్రమాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. నోటీసులపై స్పందించేందుకు 21 రోజుల గడువు ఇచ్చారు. ఉప వాణిజ్య పన్నుల అధికారి నుంచి సహాయ కమిషనర్‌ వరకు వ్యాపారులు ఇచ్చే సమాధానాల పత్రాలను పర్యవేక్షిస్తారని అధికారులు వెల్లడించారు. 
నకిలీ ఇన్‌వాయిస్‌లతో అక్రమాలు 
ఇతర రాష్ట్రాల్లో శాఖలు ఉండి, ఎలాంటి పన్ను చెల్లించని డీలర్లు విధిగా ఎఫ్‌-ఫాంను వాణిజ్య పన్నుల శాఖకు అందజేయాలి. చాలా మంది వీటిని అందజేయలేదు. అలాగే ఇతర రాష్ట్రాలకు సరకు రవాణా చేసినందుకు సీ-ఫాంలు ఇవ్వాలి. వీటిని కూడా చాలామంది అందజేయలేదు. ‘‘నకిలీ ఇన్‌వాయిస్‌లతో ఈ వ్యవహారం అంతా నడిపినట్లు గుర్తించాం. పన్ను ఎగవేతకు పాల్పడిన డీలర్లను రెండు రకాలు విభజించి చర్యలకు శ్రీకారం చుట్టాం’’ అని అధికారులు వెల్లడించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.