
పాలసీ సొమ్మును వడ్డీతో సహా చెల్లించండి
బజాజ్ బీమా కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: పాలసీ తీసుకున్నప్పుడు అప్పటికే ఉన్న వ్యాధిని వెల్లడించలేదని.. మరో వ్యాధితో మృతిచెందిన మహిళకు సంబంధించిన పాలసీ సొమ్మును తిరస్కరించడానికి వీల్లేదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన పుష్పనీల 2007 డిసెంబరులో బజాజ్ అలియాంజ్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.5 లక్షలకు పాలసీ తీసుకుని రూ.50 వేల చొప్పున రెండు వాయిదాలు చెల్లించారు. 2008 ఏప్రిల్‌లో ఆమెకు గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడైంది. దీనికి చికిత్స పొందుతూ 2009 మేలో మృతి చెందారు. అనంతరం ఆమె భర్త బుర్రా చెరాలు పాలసీ మొత్తం కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటికే ఉన్న పక్షవాతం విషయాన్ని వెల్లడించనందున తిరస్కరించినట్లు బీమా సంస్థ తెలిపింది. దీనిపై బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అనంతరం చెరాలు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. చికిత్స చేసిన డాక్టర్ వాంగ్మూలం ఇస్తూ ‘‘పాలసీ తీసుకోకముందు నుంచే ఆమెకు అధిక రక్తపోటు ఉంది. ఈ కారణంగా పక్షవాతం వచ్చింది. దీనిపై ఆమె ఆస్పత్రిలో చేరలేదు. మందులు వాడుతూ, ఇంట్లో రోజువారీ పనులు చేసుకునేవారు. 2008లో ఆస్పత్రిలో చేరగా గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది’’ అని వివరించారు. వాదనలను విన్న కమిషన్ తీర్పు వెలువరిస్తూ.. క్యాన్సర్‌తో మృతి చెందినప్పుడు పక్షవాతం ఉందని వెల్లడించలేదన్న కారణంగా పాలసీని తిరస్కరించడం సరికాదంది. ప్రతిపాదనలో వెల్లడించని వ్యాధి నయమై రోజువారీ పనులు చేసుకుంటూ ఉండేవారని, పాలసీ తీసుకున్న రెండేళ్లకు చనిపోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. పాలసీ తీసుకునేనాటికి క్యాన్సర్ లేదని, ఈ కారణంగా వాస్తవాన్ని దాచిపెట్టారంటూ బీమా మొత్తం నిరాకరించరాదంటూ జిల్లా ఫోరం తీర్పును రద్దు చేసింది. 9 శాతం వడ్డీతో బీమా మొత్తంతో పాటు ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలంటూ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎంఎస్కే జైశ్వాల్ తీర్పు వెలువరించారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ