
పొగతో ఊపిరాడక మరో నలుగురు అపస్మారక స్థితికి
షార్ట్ సర్క్యూట్‌తో వసతి గృహంలో మంటలు చెలరేగడంతో ఘటన
ఎక్కువ మంది సెలవుల్లో ఇళ్లకు వెళ్లడంతో తప్పిన పెనుముప్పు
ఈనాడు - ఖమ్మం
సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేమికి ఓ విద్యార్థిని నిండు జీవితం కాలి బూడిదైంది. ఖమ్మం నగరంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆదివారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఆ చిన్నారి సజీవ దహనమైంది.
ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఎస్సీ బాలికల వసతి గృహం-బి ఉంది. అందులో 105 మంది విద్యార్థినులున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో 80 మంది ఇళ్లకు వెళ్లారు. ఆదివారం రాత్రి భోజనానంతరం మిగిలిన 25 మందిలో 20 మంది ఓ గదిలో, ఐదుగురు మరో గదిలో నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ గదిలోని పంకా దగ్గర పేలుడు శబ్దం వినిపించింది. వెనువెంటనే నిప్పురవ్వలు పరుపులపై పడి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగ గదిని కమ్మేయడంతో కంగారు పడిన విద్యార్థినులు హాహాకారాలు చేశారు. బయట ఉన్న రాత్రి కాపలాదారు ప్రమాదాన్ని పసిగట్టి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న యువకులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విద్యార్థినులను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే నాలుగో తరగతి విద్యార్థిని బరపటి స్పందన(9) సజీవ దహనమైనట్టు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. పొగతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు విద్యార్థినులను ఖమ్మం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, జేసీ అనురాగ్ జయంతి తదితరులు సోమవారం పరిశీలించారు. వసతి గృహ సంక్షేమాధికారి వినోదను సస్పెండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం, తక్షణ సాయంగా మరో రూ.20 వేలు అందించారు.
నిర్వహణ లేమి..
ఖమ్మం ఘటనకు వసతి గృహాలను సరిగా నిర్వహించకపోవడమే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమిక నివేదికలో తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే గదిలో 20 మందికి బస కల్పించినట్టు, ప్రమాద సమయంలో పొగ వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టు నిర్ధారించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వల్ల వసతి గృహం చీకటిగా మారడంతో మంచాల మధ్య పడిపోయిన స్పందనను(మృతురాలు) గుర్తించలేకపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. ఘటనపై సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వెంటనే మరమ్మతులకు ఆదేశించాం ఘటనకు బాధ్యురాలిగా సంక్షేమ వసతి గృహ అధికారిని సస్పెండ్ చేశాం. నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ను కోరాం. జిల్లా సహాయ సంక్షేమ అధికారికి షోకాజ్ నోటీసు జారీచేశాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు భవనాల్లో విద్యుత్తు తనిఖీలు చేయించాలని ఆదేశించాం. ఈ మేరకు అవసరమైన సొమ్మును అత్యవసర నిధి నుంచి వాడుకోవాలని సూచించాం. - కరుణాకర్, సంచాలకులు, ఎస్సీ సంక్షేమశాఖ |
నివురుగప్పిన నిర్లక్ష్యం ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కరవైంది. తలుపుల్లేని కిటికీలు, ముట్టుకుంటే షాక్ కొట్టే స్విచ్‌బోర్డులు, రక్షణ లేని బాల్కనీలతో పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఒకే గదిలో కుక్కినట్లు 40 మందికి పైగా విద్యార్థులకు వసతి కల్పించడం, కనీసం నడిచేందుకూ వీల్లేకుండా రెండు పడకల మంచాలు ఇవ్వడం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోంది. ఖమ్మంలో ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదానికీ ఇలాంటి నిర్లక్ష్యమే కారణమైంది.పరిమితికి మంచి వసతి సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలలు, వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. విద్యార్థులకు సరిపడా గదులు లేవు. నిబంధనల ప్రకారం వసతి గృహాల్లో 10/10 విస్తీర్ణంలోని గదిలో నలుగురు, గరిష్ఠంగా ఆరుగురికి బస కల్పించాలి. ఆ నిబంధనను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉన్న ఒకట్రెండు గదుల్లో ఎక్కువ మందికి బస కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు, మూడు పడకలు ఉన్న మంచాలను కొనుగోలు చేసి ఎక్కువ మందిని గదుల్లో కుక్కుతున్నారు. ఖమ్మంలో జరిగిన తాజా ఘటనలో ఒక గదిలో 20 మందికి బస కల్పించడం దీనికి నిదర్శనమే. ఇష్టానుసారం సామగ్రిని కొని, వాటినీ గదుల్లో నిల్వ చేస్తున్నారు. ఇవన్నీ విద్యార్థుల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఇవిగో ఉదాహరణలు * నల్గొండ జిల్లాలోని ఎస్సీ గురుకులంలో ఇటీవల ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురయ్యాడు. 60 శాతం వరకు గాయాలయ్యాయి. హుటాహుటిన ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించి భారీగా ఖర్చుచేసి చికిత్స అందించారు. * రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో మియాపూర్ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి మొదటి అంతస్తు నుంచి పడటంతో తలకు తీవ్ర గాయమైంది. * మంచిర్యాల ఎస్సీ గురుకులంలో రెక్కల్లేని కిటికీ పక్కన నిద్రించిన ఓ విద్యార్థి అక్కణ్నుంచి జారిపడి మృతిచెందాడు. |
ముఖ్యాంశాలు
దేవతార్చన

- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- విచారణ ‘దిశ’గా...
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత