close
పక్కా వ్యూహంతో పాగా వేద్దాం!

పుర ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే తెరాస లక్ష్యం
కేటీఆర్‌ వ్యూహరచన.. నేతలతో సమాలోచనలు
నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే అభ్యర్థుల ఎంపిక!
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని తెరాస లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఈ మేరకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఎన్నికల సన్నాహాలపై కేటీఆర్‌ బుధవారం ముఖ్యనేతలతో విస్తృతంగా చర్చించారు. పుర పోరును పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. గత ఎనిమిది నెలల్లో తెరాస వరుస ఎన్నికల్లో పాల్గొంది. శాసనసభ, పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కినా.. ఆశించిన ఫలితాలు రాలేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పట్టణాలు, నగరాల్లో తెరాసకు కొంత మెజారిటీ తగ్గింది. వీటన్నింటినీ విశ్లేషిస్తూ.. స్థానిక ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని పురపాలక ఎన్నికలకు పక్కా వ్యూహాన్ని కేటీఆర్‌ రూపొందించినట్లు తెలిసింది.

విస్తృత ప్రచారం...
పుర, నగర పాలక ఎన్నికలపై ఈ నెల 15 నుంచి తెరాస ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. కేటీఆర్‌ ఎన్నికలు జరిగే అన్ని నగరపాలక సంస్థలతోపాటు ప్రధాన పురపాలక సంఘాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. పురపాలక సంఘాలవారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రచారం నిర్వహిస్తారు. వార్డులవారీగా బాధ్యతలను ముఖ్యనేతలకు అప్పగిస్తారు. ప్రచారంలో సామాజిక మాధ్యమాలను పెద్దఎత్తున వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రచార బృందాన్ని నియమిస్తారు.


 

అధిష్ఠానం ఆధ్వర్యంలోనే ఎంపిక..

పురపాలక ఎన్నికలకు ఈ నెల 15న నోటిఫికేషన్‌ వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. 15 నుంచి 20వ తేదీ మధ్యలో తెరాస రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేస్తారు. పార్టీ వ్యూహాన్ని వెల్లడిస్తారు. ఆ వెంటనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నడుస్తుంది. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల అభ్యర్థులను అధిష్ఠానమే ఖరారు చేయనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ బాధ్యుల ఆధ్వర్యంలో ఉమ్మడి కమిటీని వేస్తారు. ఆశావహుల పేర్లను తీసుకుంటారు. ఈ జాబితా అధిష్ఠానం వద్దకు చేరుతుంది. ఆయా అభ్యర్థుల గురించి అధిష్ఠానం ఆరా తీస్తుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సర్వేలను నిర్వహిస్తారు. వీటిని ప్రామాణికంగా తీసుకొని అన్నివిధాలా అర్హులైన వారిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.