close
పల్లె మారాలి.. జిల్లా మెరవాలి 

‘స్థానిక’ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
అగ్రగామిగా నిలిచే జిల్లాకు రూ. 10 కోట్లు ఇస్తాం 
ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర ఛైర్‌పర్సన్లదే 
తెలంగాణ ఎక్కడో లేదు.. గ్రామాల్లోనే ఉంది 
ప్రతీ గ్రామం ఒక గంగదేవిపల్లి కావాలి 
 ఈనాడు డిజిటల్‌-హైదరాబాద్‌

ప్రజాసమస్యల పట్ల ప్రజాప్రతినిధులు ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. దీనివల్ల మనకు ఇంకా ఉన్నతావకాశాలు వస్తాయి. జయాపజయాలు సర్వసాధారణం, కానీ రాజకీయాల్లో ఉన్నన్నిరోజులు ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండాలి.

స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్ర వాతావరణం కనబడుతోంది. పల్లెలు పెంటకుప్పల్లా మారాయి. ఎందుకీ క్షీణత? ఎందుకీ మంచినీళ్ల గోస? గ్రామాల్లో నెలకొన్న ప్రస్తుత భయంకరమైన పరిస్థితుల్లో గుణాత్మకమార్పు తీసుకువస్తామని మీరంతా ప్రతిజ్ఞ చేయాలి. గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్‌ ఉద్యమానికి పూర్వ వైభవం తీసుకురావాలి.’ 

-జడ్పీ ఛైర్‌పర్సన్లతో సీఎం కేసీఆర్‌

‘తెలంగాణ ఎక్కడో లేదు.. గ్రామాల్లోనే ఉంది.. పల్లెలను అద్భుతంగా చేసుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్‌లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతి నిధి నుంచి రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లి, ముల్కనూర్‌, అంకాపూర్‌లా ఆదర్శ గ్రామాలుగా మారాలని సీఎం ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను వివరించారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్లగా విజయం సాధించిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు.

అన్ని పంచాయతీలకు కార్యదర్శులను నియమించాం. నూతన పంచాయతీరాజ్‌ చట్టం చాలా కఠినంగా ఉంది. కార్యదర్శి చక్కగా పనిచేసి అనుకున్న ఫలితాలు సాధిస్తేనే మూడేళ్లల్లో వారి సేవలను క్రమబద్ధీకరిస్తాం. పంచాయతీ కార్యదర్శుల మీద పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవోలతో బాగా పనిచేయించాలి. దీనికి సంబంధించి ఆర్థిక, పరిపాలన, ఆజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆరు నెలల్లో పూర్తి మార్పు కనబడాలి.’ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తారు. నాయకులకు ఉండాల్సిన మంచి లక్షణం ఏమిటంటే.. ఒకరు చెప్పింది వినడం. అదే మీరు చేయండి. ఓపికగా వారి సమస్యలను విని, వారిని కూర్చోబెట్టి మర్యాద చేయండి. అప్పుడే ప్రజలకు ఊరట లభిస్తుంది. ఆ తరువాత సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రయత్నించండి. అప్పుడు మనకు రావాల్సిన పేరు, దక్కాల్సిన గౌరవం వాటంతట అవే వస్తాయి.

సహజత్వాన్ని కోల్పోకండి.. 
‘‘పదవి రాగానే మీరు మారిపోకూడదు. లేనిపోని దర్పం తెచ్చుకోకూడదు. పెట్టుడు గుణాల కంటే, పుట్టుడు గుణం మంచిదంటారు పెద్దలు. పదవి వచ్చిందని సహజత్వాన్ని కోల్పోకండి. మీరు పనిచేయబోయే ఐదేళ్లకాలంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. ఎవరూ పుట్టుకతోనే అన్నీ నేర్చుకోలేదు. పరిస్థితులను బట్టి నేర్చుకుంటూపోతారు. చివరి శ్వాస విడిచేవరకు జ్ఞాన సముపార్జన చేసుకుంటూ పోవాలి. మన జీవితం చాలా చిన్నది. ఆ కాస్త సమయంలోనే అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే ఎంచుకున్న రంగంలో ముందడుగు వేయగలం. అన్ని విషయాల్లాగానే పంచాయతీరాజ్‌ విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయండి. 
ఛైర్‌పర్సన్లకు మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ర్యాంకు 
గతంలో జడ్పీ ఛైర్మన్లకు పెద్దగా పనిలేదు. ఇటీవల కేంద్ర ఆర్థిక సంఘాన్ని కలిసినప్పుడు మన వ్యవస్థ గురించి వివరించా. ఇక్కడ ఛైర్‌పర్సన్లకు మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ర్యాంక్‌ ఇచ్చామని చెప్పా. మీరంతా ఇక ముందు క్రియాశీలకంగా పని చేస్తారని కూడా చెప్పాను. ఇందుకు అవసరమైన సాయం చేస్తామని ఆర్థిక సంఘం అధ్యక్షుడు మాట ఇచ్చారు. ఎలాగైనా జడ్పీ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఆలోచన చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా మీకివ్వాల్సిన అన్ని అధికారాలు సంక్రమింపజేస్తాం. ఏకపక్షంగా 32 జిల్లా పరిషత్‌లు గెలవడంతో పాటే మీపై బరువు, బాధ్యత మరింత పెరిగాయి. మీ పాత్ర ఉన్నతంగా ఉండేలా జిల్లాపరిషత్‌ల విధులు, బాధ్యతలు పటిష్ఠం కావాల్సిన అవసరం ఉంది. 

అభివృద్ధి కోసమే పంచాయతీరాజ్‌ ఉద్యమం 
ఎక్కడికక్కడే అభివృద్ధి జరగాలని స్వాతంత్య్రం వచ్చిన ఆరంభ రోజుల్లో పంచాయతీరాజ్‌ ఉద్యమానికి ప్రాణం పోశారు. రాష్ట్రాలకు పాలనలో స్వతంత్రత ఉండాలని, పాలన వికేంద్రీకరణ జరగాలనే స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధాని అయిన తొలిరోజుల్లో అమెరికాకు వెళ్తే ఆ దేశ అధ్యక్షుడు ఐసన్‌ హూవర్‌ నెహ్రూకు ఎస్‌.కె.డేను పరిచయం చేశారు. ఆయన భారతీయుడని, గ్రామీణ అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని తెలుసుకున్న నెహ్రూ భారత్‌కు రావాలని ఆహ్వానించారు. ప్రథమ పంచవర్ష ప్రణాళికలో దేశ అవసరాలకు భిన్నంగా సత్వర పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎస్‌.కె.డే మొదట సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ నెహ్రూ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అందువల్లే రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత క్రమం మారి, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆ మార్పువల్లే ఈరోజు ఆహార రంగంలో స్వావలంబన వచ్చింది. నెహ్రూ తీసుకువచ్చిన మార్పులకు సంతోషించి భారత దేశానికి వచ్చిన ఎస్‌.కె.డేను కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రిని చేసి, గ్రామీణ భారతాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. మంత్రిగా హైదరాబాద్‌ వచ్చిన ఎస్‌.కె.డే ఇక్కడి నుంచి యావత్‌ భారత దేశానికి పంచాయతీరాజ్‌ ఉద్యమాన్ని విస్తరించారు. మొట్టమొదటి సమితి (పటాన్‌చెరు) ఏర్పాటు చేసి దానికి పి.రామచంద్రారెడ్డిని అధ్యక్షుడిని చేశారు. అలా పంచాయతీరాజ్‌ ఉద్యమం మొదలైంది. చాలాకాలం ఆ ఉద్యమ స్ఫూర్తితో స్థానిక సంస్థలు పనిచేశాయి. అప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమం బ్రహ్మాండంగా ఉండేది. దురదృష్టవశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడింది. మీరు ఆ పరిస్థితిని మార్చాలి. 
ఆరు నెలల్లో మార్పు కనపడాలే.. 
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్‌ విషయంలో అవగాహన కోసం ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణకు పోయా. అక్కడే హాస్టల్‌లో ఉండి ఏడు రోజులు శిక్షణకు హాజరయ్యా. అలా పోవడంతోనే నాకు పూర్తి అవగాహన వచ్చింది. మీరు కూడా ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ అందరూ జులైలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆలోపే మీరంతా గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణకు పోవాలి. దాని కోసం మన అధికారులు ఒక మంచి కోర్సు డిజైన్‌ చేస్తారు. 
32 జిల్లాలు 320 కోట్లు పొందాలి 
ఏ జిల్లా పరిషత్‌ అగ్రభాగాన పోతే, ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి రూ. 10 కోట్లు మంజూరు చేస్తాం. 32 జిల్లాలూ అగ్రభాగాన నిలవాలి. దీనికి కొన్ని ప్రమాణాలు ఏర్పాటు చేస్తాం. నా కోరిక ఏమిటంటే మొత్తం అందరూ కలిసి రూ. 320 కోట్లు పొందాలి. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లందరికి కొత్త కార్లు కొనిస్తాం. మీరు మంచి మార్పు తీసుకురాగలరనే భావన ప్రజల్లో తేగలిగితే అంతకన్నా గొప్పలేదు. ప్రజల్లో తిరుగుతూ పంచాయతీరాజ్‌ సంస్థను బలోపేతం చేయాలి. క్రియాశీలకంగా ఏ గ్రామానికి ఆ గ్రామమే అభివృద్ధి చెందేలా బాధ్యత తీసకోవాలి. 
రుణం తీర్చుకుందాం.. 
పింఛను పథకం, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఎన్నికల్లో మన విజయానికి కారణమయ్యాయి. అందుకే మనం ప్రజల రుణం తీర్చుకోవాలి. ఇందులో మీరే ఎక్కువ పాత్రధారులు కావాలి. మండలాధ్యక్షులను మీలాగే తయారు చేయండి. ఎస్‌.కె.డే పంచాయతీరాజ్‌ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకువెళ్లాలి. 60 శాతం జనాభా ఉన్న గ్రామాలను పట్టుకొమ్మల్లా చేయడంలో నిమగ్నం కావాలి. అందులో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదు. గ్రామీణ తెలంగాణను అన్ని రకాలుగా బాగుచేయడానికి మీ శక్తి-యుక్తులను ఉపయోగించాలి’’ అని ముఖ్యమంత్రి వారికి ఉద్బోధించారు. 
పేరుపేరునా అభినందనలు 
సమావేశం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందించారు. అందరితో కలిసి భోజనం చేశారు. మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు  పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎ.జీవన్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, షకీల్‌ తదితరులు పాల్గొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.