close
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు 

స్పీకర్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌కు, మండలి ఛైర్మన్‌కు తాఖీదులు 
కాంగ్రెస్‌ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన ధర్మాసనం 
మరో పిటిషన్‌పై నేడు విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: తెరాసలో చేరిన 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ, శాసనమండలిలలో విలీన వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్‌ నేతలు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్‌లపై మంగళవారం కోర్టు విచారణ చేపట్టింది. శాసనసభలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ విలీనం జరిగితే తమకు నోటీసులు జారీ చేసి తమ వాదనలు విన్నాక నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌ను ఆదేశించాలంటూ భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పిటిషన్‌ దాఖలు చేశారు. 
శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని తెరాసలో విలీనం చేస్తూ మండలి ఛైర్మన్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో స్పీకర్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌కు, శాసనమండలి ఛైర్మన్‌లకు, శాసనసభ, మండలి సచివాలయ కార్యదర్శులకు, కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులిచ్చింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 
శాసనసభలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని విలీనం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని, దాన్ని సవాల్జేస్తూ మరో పిటిషన్‌ కూడా దాఖలు చేసినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆ పిటిషన్‌తో కలిపి వీటిని విచారించాలని కోరారు. మండలి తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు అభ్యంతరం తెలుపుతూ ఈ పిటిషన్‌లపై ఇప్పటికిప్పుడు విచారించాల్సిన అవసరం లేదన్నారు. మండలి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరేన్‌రావల్‌ వాదనలు వినిపించనున్నారని, ఆయన అందుబాటులో లేరని, జులై 7వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం చెబుతూ హరేన్‌రావల్‌ ఇక్కడే మరో కేసులో వాదనలు వినిపిస్తున్నారన్నారు. అయితే రికార్డును పరిశీలించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. ఈ వ్యవహారాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. 
నోటీసులు అందుకున్న వారు వీరే 
మండలి ఛైర్మన్‌, కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్‌ నుంచి తెరాసలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్సీలు ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు, కె.దామోదర్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌, ఆకుల లలితలకు నోటీసులు జారీ చేసింది. మరో పిటిషన్‌లోనూ స్పీకర్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌కు, శాసనసభ కార్యదర్శికి, పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఆర్‌.కాంతారావు, ఆత్రం సక్కు, వి.వెంకటేశ్వరరావు, సురేందర్‌, సీహెచ్‌.లింగయ్య, డి.సుధీర్‌రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డిలకు నోటీసులిచ్చింది.  ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ శాసనసభాపక్షం తెరాసలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టిలు దాఖలు చేసిన మరో పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరపనుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.