close
ఈసారి వానలు తక్కువే!

సాధారణం కంటే తగ్గనున్న వర్షపాతం
4న కేరళను తాకనున్న రుతుపవనాలు

దిల్లీ: నైరుతి రుతుపవనాలు జూన్‌ 4న కేరళలో ప్రవేశించనున్నాయని ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్‌ తెలిపింది. సాధారణంగా మనదేశంలో ప్రతిఏటా జూన్‌ 1న రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జులై రెండోవారానికి దేశమంతటా వ్యాపిస్తాయి. ఈసారి మూడు రోజులు ఆలస్యం కానున్నాయి. అలాగే వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువ నమోదు కానుందని స్కైమెట్‌ తెలిపింది. దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) 93 శాతంగా నమోదు కానుందని, ఐదుశాతం అటుఇటుగా ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘రెండు రోజులు అటుఇటుగా మే 22న అండమాన్‌, నికోబార్‌ దీవుల మీదుగా రుతుపవనాల రాక మొదలవుతుంది. కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు కూడా రెండురోజులు అటుఇటుగా ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి. భారత ఉపఖండంపై రుతుపవనాల ప్రారంభ వ్యాప్తి కూడా నెమ్మదిగానే ఉండే అవకాశం
ఉంది’’ అని స్కైమెట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి జతిన్‌సింగ్‌ పేర్కొన్నారు. దేశంలోని నాలుగుప్రాంతాల్లోనూ ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని చెప్పారు. వాయువ్య, దక్షిణ భారతదేశ ప్రాంతాలతో పోలిస్తే తూర్పు, ఈశాన్య, మధ్యభారతాల్లో తక్కువ వర్షాలు కురుస్తాయన్నారు. పసిఫిక్‌ సముద్రంపై వేడిగాలుల కారణంగా ఈసారి ‘‘ఎల్‌నినో’’ వచ్చే అవకాశం 55శాతం ఉందన్నారు. స్కైమెట్‌ అంచనా ప్రకారం...
* తూర్పు, ఈశాన్య భారతదేశాల్లో 92 శాతం ఎల్‌పీఏతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురుస్తుంది.
* బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌లలో తక్కువ వర్షాలు కురవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
* ఉత్తరభారత రాష్ట్రాలున్న వాయువ్యప్రాంతంలో 96 శాతం ఎల్‌పీఏతో సాధారణ వర్షాలు పడనున్నాయి.
* పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీ-ఎన్‌సీఆర్‌ మైదానప్రాంతాలతో పోలిస్తే కొండప్రాంతాలైన జమ్మూకశ్మీరు, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో మెరుగైన వర్షాలు కురుస్తాయి.
* విదర్భ, మరాఠ్వాడా, పశ్చిమ మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయి.
* దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో కాస్త అటుఇటుగా ఒకేస్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తర కర్ణాటక, రాయలసీమలో తక్కువ వర్షాలు పడతాయి. వీటితో పోలిస్తే కేరళ, కోస్తా కర్ణాటకలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది.

ఏమిటీ ఎల్‌పీఏ?
నైరుతి రుతుపవనాల కారణంగా మనదేశంలో గత 50 ఏళ్లలో నమోదైన వర్షపాతాల సగటును దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ)గా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా 2412 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 3500 వర్షమానిని స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా భారత వాతావరణశాఖ వర్షపాతాన్ని లెక్కిస్తుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.