
తాజా వార్తలు
తమిళ సంస్కృతిని కాపాడుకుంటాం
తమిళనాడు ప్రచారంలో రాహుల్ గాంధీ
చెన్నై: దేశంలో ఒకే సంస్కృతి, ఒకే భాష ఉండాలని భావిస్తున్న వారి నుంచి తమిళ సంస్కృతిని కాపాడుకుంటామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడులో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్‌గాంధీ ప్రస్తుతం కోయంబత్తూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ శనివారం ఒక ర్యాలీలో పాల్గొన్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న తరుణంలో శనివారం నుంచి ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించారు. తమిళ సంస్కృతిని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా ఒకే సంస్కృతి, ఒకే భాష ఉండాలని భావిస్తున్నారు. ఆయనకు ఇతర సంస్కృతులు, భాషలపై ఎటువంటి గౌరవం లేదు. అందరూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా జీవించాలని ప్రధాని భావిస్తున్నారు.’’ అని రాహుల్ అన్నారు. తమిళనాడులో ఉన్న ప్రత్యేక సంస్కృతిని భాజపా బారి నుంచి కాంగ్రెస్ కాపాడుతుందన్నారు. తమిళ భాషపై తనకెంతో గౌరవముందని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో తాను తమిళ్‌ను నేర్చుకుంటానన్నారు.
శనివారం ఉదయం కోయంబత్తూరుకు చేరిన రాహుల్ ట్విటర్లో ఒక పోస్టు పెట్టారు. ‘‘ ఈ రోజు తమిళ సోదరులను, సోదరీమణులతో సమయం గడిపేందుకు మళ్లీ ఇక్కడకు వచ్చాను. మనందరం కలిసి కట్టుగా తమిళ సంస్కృతిని కాపాడుకుందాం.’’ అని ఆ పోస్టులో పెట్టారు. కాగా ఈ నెలలో రాహుల్ గాంధీ రెండోసారి తమిళనాడుకు రావడం. గతంలో జల్లికట్టు ఉత్సవాలను వీక్షించేందుకు జనవరి 14న రాహుల్ తమిళనాడుకు వెళ్లారు.
ఇవీ చదవండి..
విషమంగానే లాలూ.. ఎయిమ్స్‌కు తరలింపు
మీ పేరు కమలా? అయితే మీకో ఆఫర్