
తాజా వార్తలు
అన్నీ ఓకే..ఇక మీ మద్దతు అవసరం:కోహ్లీ
ఇంటర్నెట్‌డెస్క్: జట్టు సమతుల్యతను పెంచే ఆటగాళ్లను వేలంలో తీసుకున్నామని, ఇక అభిమానుల నుంచి మరోసారి మద్దుతు కావాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. గురువారం జరిగిన వేలంలో బెంగళూరు ముగ్గరు విదేశీ, అయిదుగురు స్వదేశీ ఆటగాళ్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జేమీసన్ (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్ (రూ.14.25 కోట్లు), క్రిస్టియన్ (రూ.4.8 కోట్లు)ను భారీ మొత్తానికి తీసుకోగా సచిన్ బేబి, రజత్, మహమ్మద్ అజహరుద్దీన్, ప్రభుదేశాయ్, కేఎస్ భరత్‌ను రూ.20 లక్షల చొప్పున దక్కించుకున్నారు.
‘‘ఐపీఎల్ వేలంలో మాకు దక్కిన ఆటగాళ్ల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. సమతుల్యతను పెంచుతూ జట్టును బలోపేతం చేసే ఆటగాళ్లను సొంతం చేసుకున్నాం. గతేడాది మంచి ప్రదర్శన చేశాం. కొత్త ఆటగాళ్ల చేరికతో వచ్చే సీజన్లోనూ మరింత మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మరోసారి మీకో విషయం చెప్పాలనకుంటున్నా.. ఆర్సీబీ అభిమానులు.. గొప్ప అభిమానులు. మీ మద్దతుతో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాం’’ అని కోహ్లీ తెలిపాడు. 2020 సీజన్లో బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే.