close

తాజా వార్తలు

Published : 01/03/2021 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ రెండు పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలి: ఉత్తమ్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి తెరాస, భాజపా తీరని ద్రోహం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. భాజపా మతం పేరుతో లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. గాంధీభవన్‌లో పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల మండలి నియోజకవర్గ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడారు. భాజపా, తెరాస నేతలు రూ.వందలకోట్లు దోచుకుని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. అటు ఉద్యోగులు, ఇటు నిరుద్యోగులను తెరాస, భాజపాలు తీవ్రంగా మోసం చేశాయన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు.

వంట గ్యాస్‌ వాడే పరిస్థితి లేకుండా చేశారు

సామాన్య ప్రజానీకం వంట గ్యాస్‌ వాడే పరిస్థితి లేకుండా ధరలు పెంచేశారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.వందకు చేరతాయని ఎవరూ ఊహించలేదని చెప్పారు. వంటగ్యాస్‌ పెరుగుదలకు నిరసనగా మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ స్థాయిలో పెంచడం దుర్మార్గమైన చర్య అని ఆక్షేపించారు. పక్క రాష్ట్రాల్లో ఎల్పీజీపై సబ్సిడీ ఇస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం లేదని.. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సామాన్యుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ నిలబడి ధరల పెరుగుదలపై పోరాడుతుందని ఉత్తమ్‌ చెప్పారు.


ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని