close

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ

హైదరాబాద్‌: షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు రాసిన లేఖ ఈరోజు సాయంత్రం  6గంటలకు హైకోర్టుకు అందింది. దిశ హత్యకేసుకు సంబంధించి ప్రజల్లో తలెత్తిన భావోద్వేగాలను పోలీసులు అవకాశంగా తీసుకుని నలుగురు యువకులను హతమార్చారని లేఖలో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా బూటకపు ఎన్‌కౌంటర్‌ పై హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. నలుగురు యువకులను కాల్చిచంపిన పోలీసులపై హత్యకేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం పౌరహక్కుల సంఘాల ప్రతినిధులు రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది.

అత్యవసరంగా స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. న్యాయమూర్తి నివాసంలో విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆరిఫ్, నవీన్‌, శివ, చెన్నకేశవుల మృతదేహాలను ఈనెల 9వ తేదీ రాత్రి 8 గంటల వరకు భద్రపరచాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టులో విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హాజరయ్యారు. శవపరీక్ష ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసినట్లు కోర్టుకు తెలిపారు. గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్‌ నిపుణుల బృందంతో శవపరీక్ష జరిగిందని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌పై ఈనెల 9వ తేదీ ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. శవపరీక్ష వీడియోను మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జికి అప్పగించాలని, వీడియో సీడీని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జి తమకు అప్పగించాలని ధర్మాసనం ఆదేశించింది. మరో వైపు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రిలో నిందితుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తయింది. ఆసుపత్రి శవాగారంలో నిందితుల మృతదేహాలను భద్రపరిచారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.