close

తాజా వార్తలు

Updated : 28/07/2020 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా కేసులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి హైకోర్టులో విచారణ ముగిసింది. కరోనా నిర్ధారణ పరీక్షలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజల వసూలు తదితర అంశాలకు సంబంధించి దాఖలైన 15 పిటిషన్లపై హైకోర్టులో నేడు సుదీర్ఘ విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. తాము ఇచ్చిన ఆదేశాలు అమలు కావడంలేదని ఇటీవల హైకోర్టు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖలో ఇవాళ్టి బులిటెన్‌లో మార్పులు చేసింది. కంటైన్‌ మెంట్‌ ప్రాంతాలతో పాటు వయసుల వారీగా పాజిటివ్‌ కేసుల వివరాలను బెలిటెన్‌లో చేర్చింది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం.. పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, అలా పరీక్షలు నిర్వహించిన వారి వివరాలు బులిటెన్‌లో ఎందుకు పొందుపర్చలేదని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరీక్షల సంఖ్య తక్కువగా ఎందుకు ఉంది? ప్రైమరీ కాంటాక్టులకు చేసిన పరీక్షలు ఎన్ని? గాంధీలో కరోనా పరీక్షలు చేస్తున్నారా?లేదా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ... రాష్ట్రంలో తగినన్ని కరోనా పరీక్షలు జరగుతున్నాయని వివరించారు. కరోనా పరీక్షలు క్రమంగా పెంచుతున్నామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు బులిటెన్‌లో మరిన్ని వివరాలు ఇస్తున్నామని, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రతి బెడ్‌కు ఆక్సిజన్‌ వ్యవస్థ ఉండేలా కసరత్తు చేస్తున్నామని వివరణ ఇచ్చారు. కేంద్రం మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయని, కరోనా నియంత్రణకు రాష్ట్ర యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

‘‘కరోనా గణాంకాలు పత్రికలు, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలి. 21 నుంచి 50ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారన్న విషయాన్ని, హితం యాప్‌పై ప్రచారం చేయాలి. కమ్యూనిటీ హాళ్లలో ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటు అంశం పరిశీలించాలి. కేసులు మృతుల వివరాలు తప్పుగా వెల్లడిస్తున్నారన్న అంశాన్ని, ర్యాపిడ్‌ టెస్టుల కచ్చితత్వాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై తీసుకున్న చర్యల వివరాలు వెల్లడించాలి’’అని హైకోర్టు ఆదేశించింది. దీనికి సీఎస్‌ స్పందిస్తూ.. కరోనా విషయంలో ప్రచారంపై పత్రిక, మీడియా సంస్థలతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరే ప్రక్రియను సులభతరం చేస్తామన్నారు. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న వారికి చికిత్సలు అందిస్తామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులపై 726 ఫిర్యాదులు అందాయన్నారు. ర్యాపిడ్‌ టెస్టుల కోసం మరో 4 లక్షల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను ఆర్డర్‌ చేసినట్లు హైకోర్టుకు సీఎస్ వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలన్నీ అమలు చేసేందుకు రెండు వారాలు సమయం కావాలని సీఎస్‌ కోరారు. దీంతో న్యాయస్థానం కరోనా కేసుల విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. ఆ రోజున సీఎస్‌, ఇతర అధికారులు హాజరు కావాలని ఆదేశించింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.