close

తాజా వార్తలు

Published : 24/01/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ట్రాక్టర్‌ ర్యాలీలో అలజడికి పాక్‌లో కుట్ర: పోలీసులు

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో అలజడికి పాక్‌లో కుట్ర జరిగిందని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం  సుమారు 300 ట్విటర్‌ ఖాతాలు సృష్టించారని దిల్లీ ప్రత్యేక పోలీస్‌ కమిషనర్‌ (ఇంటిలిజెన్స్‌) దీపేంద్ర పాథక్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్‌ ర్యాలీ జరగనుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పవన్‌తో సోము వీర్రాజు భేటీ

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపిక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించారు. భాజపా, జనసేనలో ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారనేది తమకు ముఖ్యం కాదని.. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతామని సోమువీర్రాజు పునరుద్ఘాటించారు. ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జనసేన కూటమి సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నిమ్మగడ్డ కావాలనే వ్యతిరేకిస్తున్నారు: రోజా

3. ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించండి: కేసీఆర్‌

వేతన సవరణ, సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వేతన సవరణ సంఘం కొద్దిరోజుల క్రితం సీఎంకు నివేదిక సమర్పిచింది. నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వారం, పదిరోజుల్లో చర్చలు పూర్తిచేయాలని సీఎస్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* యాదాద్రి.. కేసీఆర్‌ కలల ప్రాజెక్టు: కేటీఆర్‌

* ప్రభుత్వం టార్గెట్లు పెట్టడం సరికాదు: కిషన్‌రెడ్డి

4. ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 44,382 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 158 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,010కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,147 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 155 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,387కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,476 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘మీరు చెప్తే వింటారు’.. మోదీ తల్లికి రైతు లేఖ!

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తుండగా.. మరోవైపు ఓ రైతు మాత్రం చట్టాల రద్దు కోరుతూ ప్రధాని మోదీ తల్లికి లేఖ రాశారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తన కుమారుడికి చెప్పాలని కోరారు. ఈ మేరకు మోదీ తల్లి హీరాబెన్‌కు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్‌ సింగ్‌ అనే రైతు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* భాజపా హయాంలో అన్ని వర్గాలకు భద్రత: షా

6. డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డులు.. రేపే ప్రారంభం

ఓటరు ఐడీలను ఇకపై మొబైల్‌/ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్‌ వెర్షన్‌ ఓటరు గుర్తింపు కార్డులు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా సోమవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వీటిని ఆవిష్కరించనున్నారు. ఈ డిజిటల్‌ ఓటరు గుర్తింపు కార్డును డిజిలాకర్‌లో పొందుపరచుకోవచ్చు. అలాగే పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ప్రింట్‌ చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మొబైల్‌ ఫోన్లపై దిగుమతి సుంకాల బాదుడు

 విదేశాలకు భారీగా మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేస్తున్న తరుణంలో దిగుమతి సుంకాలు అధికంగా ఉండటంలో అర్థం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రే మార్కెట్‌ను నివారించేందుకు మొబైల్‌ ఫోన్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై వచ్చే బడ్జెట్‌లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని దేశీయ మొబైల్‌ మార్కెట్‌ రంగం కేంద్రాన్ని కోరుతోంది. 2021-22 బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఫోన్‌ ఛార్జింగ్‌..మీరూ ఈ తప్పులు చేస్తున్నారా..?

8. కరోనా: వారిలో కొత్తరకాలను ఎదుర్కొనే సామర్థ్యం!

కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి దీర్ఘ కాలం ఉండడంతో పాటు కొత్తరకం వైరస్‌లను కూడా నిరోధించగలిగే సామర్థ్యం ఉన్నట్లు తాజా పరిశోధన వెల్లడిస్తోంది. అంతేకాకుండా, రోగనిరోధకశక్తితో వచ్చే యాంటీబాడీలు ఎక్కువకాలం పాటు ఉండడం, కొత్తరకాలను ఎదుర్కొనే సామర్థ్యాలను కలిగి ఉండటం ఊరట కలిగించే విషయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కణాల్లో దాగి ఉండే వైరస్‌ అవశేషాల వల్ల ఇది సాధ్యమయ్యే ఆస్కారం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అది నా గొప్పతనం కాదు: ద్రవిడ్‌

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా రిజర్వ్‌ బెంచ్ బలమేంటో క్రికెట్‌ ప్రపంచానికి తెలిసింది. ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా బలమైన ఆసీస్‌ను.. కంగారూల గడ్డపై ఓడించి తమ సత్తాను భారత యువ ఆటగాళ్లు చాటిచెప్పారు. అయితే రిజర్వ్‌ బెంచ్‌ ఇంత బలంగా మారడానికి టీమిండియా మాజీ క్రికెటర్‌, ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కారణమని కొనియాడుతున్నారంతా. గతంలో అండర్‌-19, భారత-ఎ జట్టుకు ద్రవిడ్‌ కోచ్‌గా ఉండటం వల్లే ఆటగాళ్లు అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పంత్‌ క్రీజులో ఉంటే బౌలర్లపైనే ఒత్తిడి: సుందర్‌

10. యూఎస్‌లో ‘కొత్త ఆశలకు రెక్కలు’!

అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే అనేక కొత్త మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విదేశీ నిపుణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ట్రంప్‌ సర్కారు తీసుకువచ్చిన ఇమ్మిగ్రేషన్‌ చట్టాన్ని సంస్కరిస్తూ బైడెన్‌ ప్రభుత్వం కొత్త యూఎస్‌ సిటిజన్‌షిప్‌ యాక్ట్‌ 2021ను అమెరికన్‌ కాంగ్రెస్‌కు పంపింది. ఇది కనుక ఆమోదం పొందితే ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఎక్కువగా ఉపయోగకరం కానుంది. ఇప్పటికే వర్క్‌ వీసాల మీద పనిచేస్తున్న  భారతీయులతో పాటు ఇతర దేశాల నుంచి హెచ్‌-1బీ వీసాలు ఉన్న వారందరూ కూడా వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశాలు రాబోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని