close

తాజా వార్తలు

Published : 07/07/2020 09:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జన హితం.. శబ్ద రహితం...!

● ‘నిశ్శబ్ద్‌’ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతి

● తిరుమలలోనూ అమలు

● చర్యలు చేపట్టిన అర్బన్‌ పోలీసులు

న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం): సాధారణంగా వాహనాల నుంచి 60- 80 డెసిబుల్‌ శబ్ద తరంగాలు వెలువడేలా ఉండాలి. అంతకు మించితే శబ్దం విన్నవారిలో అసహనం పెరిగి రక్తపోటుకు దారితీస్తుంది. తరచూ ఇలాంటి శబ్దాలు వింటుంటే గుండెపోటు, పక్షవాతం బారిన పడే అవకాశాలూ ఎక్కువే. ముఖ్యంగా నిద్రలేమి వెంటాడుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలైన తిరుపతి, తిరుమలలో శబ్దం వల్ల భక్తులు ఏకాగ్రతను కోల్పోతారు. ఇక్కడ ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. సీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రజలు ఆరోగ్య నగరంగా తిరుపతిని పరిగణిస్తూ.. చికిత్స కోసం వస్తుంటారు. ఇక్కడున్న రుయా, స్విమ్స్‌, బర్డ్‌, ఆయుర్వేద ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రులు వంద వరకు ఉన్నాయి. చికిత్సకు వచ్చే రోగులు శబ్దం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తిరుపతిలో ఆరు యూనివర్సిటీలు, పలు కార్పొరేట్‌ స్కూళ్లు ఉన్నాయి. విద్యార్థులు అధిక శబ్దం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది.

●*● రోడ్డుపై వెళుతున్నవారి గుండెలు ఝల్లుమనేలా టప టపమనే శబ్దాలతో బుల్లెట్లు.. ముందు వెళుతున్న వాహనదారుల చెవులు చిల్లులు పడేలా హారన్లు.. సిగ్నల్‌ పాయింట్‌ వద్ద వాహనదారులు వినలేనంతగా ఎక్సలేటర్‌ రైజింగ్‌.. జన సంచారంతో రద్దీగా ఉండే రోడ్లపైనే బైక్‌ రైడింగ్‌.. ఇదీ తిరుపతి నగరంలో ప్రస్తుత పరిస్థితి.

●*ఇకపై ఇలాంటి శబ్దాలకు సెలవిస్తూ ‘నిశ్శబ్ద్‌’ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతిని తీర్చిదిద్దాలని అర్బన్‌ జిల్లా పోలీసు శాఖ తలచి.. అడుగులు వేసింది. కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు మార్చిన వాహనాలు సీజ్‌ చేశారు. వాహనదారులు, మెకానిక్‌లకు అవగాహన కల్పించారు. పలు కూడళ్లలో గోడ పత్రికలు అతికించి తిరుపతి, తిరుమలను శబ్ద కాలుష్య రహితంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా కృషి చేస్తున్నారు.

ప్రజలు తలచుకుంటే..

స్మార్ట్‌సిటీ, స్వచ్ఛ నగరానికి సహకరించిన ప్రజలు.. స్వచ్ఛందంగా నిశ్శబ్ద్‌ నగర రూప కల్పనకు సహకరించాలి. ట్రాఫిక్‌ అంతరాయం ఉన్నట్లు కన్పిస్తున్నా పదేపదే హారన్‌ మోగించడం.. క్షణం వేచి ఉండలేక శబ్దం చేయడం మానుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

సోదాలు.. వాహనాలు సీజ్‌

విదేశాల తరహాలో సిగ్నల్‌ పాయింట్‌ వద్ద వాహనం నుంచి శబ్దం ఏ మేరకు వెలువడిందో గుర్తించే టెక్నాలజీ ప్రస్తుతం హైదరాబాదులో ఉంది. శబ్దాన్ని గ్రహించే యంత్రాలు పలు కూడళ్లతోపాటు ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరంలో ప్రత్యేక సోదాలు జరిపి కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు, హారన్లు మార్చి అధిక శబ్దం చేస్తున్న వాటిని అమర్చుకొని తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేశారు. అధిక మొత్తంలో జరిమానా విధించి అప్రమత్తం చేశారు. శబ్దం వచ్చే పరికరాలు అమర్చవద్దని నగరంలోని మోకానిక్‌లకు చెప్పారు. ఆటో, ట్యాక్సీ సిబ్బందికి అవగాహన కల్పించారు. నిశ్శబ్ద్‌ తిరుపతి పేరిట స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానంలో స్టాల్స్‌ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సరదాగా హారన్‌ కొట్టొద్దు

కొందరు వాహనం ఎక్కగానే అవసరం లేకున్నా సరదాగా హారన్‌ కొడుతుంటారు. ఈ అలవాటును మానుకోవాలి. అధిక శబ్దం వచ్చే పరికరాలు అమర్చి ఉంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలి. తిరుపతి, తిరుమలతోపాటు జిల్లా వ్యాప్తంగా హారన్‌ ఫ్రీ జోన్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. శబ్దాన్ని ఎక్కడికక్కడ గుర్తించి జరిమానాలు విధిస్తాం. యువత శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి నడుం కట్టాలి. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యం. - ఆవుల రమేష్‌రెడ్డి, అర్బన్‌ జిల్లా ఎస్పీ

నో హారన్‌ సిటీ పోస్టర్‌లను విడుదల చేస్తున్న ఎస్పీ, ఆర్టీవో తదితరులు (పాత చిత్రం)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని