close

తాజా వార్తలు

Updated : 03/08/2020 17:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజధానికై పోరాటం చేయాల్సిన అవసరముంది

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: ఏపీ రాజధాని విషయంలో రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా మంచిదేన్నారు. మూడు రాజధానులు నిర్మించడం సాధ్యమేనా అని ఆలోచించాలని రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు.

‘‘అమరావతి రాజధానిని కాపాడుకునే పోరాటాన్ని మహిళలే ముందుండి నడపాలి. మహిళా నాయకత్వానికి మచ్చుతునకలైన రాణిరుద్రమ, అబ్బక్క వంటి వీర నారీమణులే స్ఫూర్తిగా మీరు ముందుకు సాగండి. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పేరుతో రైతులను దగా చేసే ప్రయత్నం జరుగుతోంది. సీఆర్‌డీఏ ద్వారా రైతులకు వచ్చిన అధికారాన్ని కాల రాసేందుకు ప్రభుత్వమే కుట్ర పన్నుతోంది. ప్రభుత్వం చేసిన కొత్త చట్టసవరణ ద్వారా రైతులకు దక్కేదేమి లేదు. కొత్త రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఉంది. సెక్షన్‌ 94(3) ద్వారా ఒకే రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ వంటి భవనాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని స్పష్టంగా ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది’’అని రఘురామకృష్ణరాజు తెలిపారు.

రాజీలేని పోరాటం అవసరం

కృష్ణా, గుంటూరు జిల్లాల తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేయడంపై వైకాపా ఎంపీ స్పందించారు. రాజీనామా చేయడం కంటే రాజీలేని పోరాటం చేయడం అవసరమని పవన్‌ కల్యాణ్ గుర్తించాలన్నారు. బీటెక్‌ రవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆలోచన మానుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగాలని సూచిస్తున్నట్లు తెలిపారు.

‘‘సీఎం గారూ.. సాక్షిని కాకుండా మనస్సాక్షిని నమ్మండి. రిఫరెండం పెట్టి ప్రజల ఆలోచన తెలుసుకోండి. ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ల రూ. 250 పెంచేందుకు మన దగ్గర డబ్బు లేనప్పుడు రూ.వేల కోట్లతో మూడు రాజధానుల నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది? కేవలం సంక్షేమ పథకాలు నమ్మి మనకు ఓట్లు వస్తాయని భ్రమించి ప్రజాభిష్టాన్ని నిర్లక్ష్యం చేయకండి. విలువలకు కట్టుబడి నేను రాజీనామా చేయాలని కోరుతున్న వైకాపా నేతలు.. అదే విలువల కోసం మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధపడతారా?’’అని ఎంపీ రాఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

ఆత్మహత్యలు చేసుకోవద్దు

రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆందోళనకు గురికావొద్దని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ ఉన్నారని, విజ్ఞప్తి పత్రాలతో సీఎం దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందన్నారు. తనకు సెక్యూరిటీ వచ్చిన తర్వాత అమరావతి వెళ్లి మహిళలు, రైతుల వెనక ఉండి పోరాటం చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తామన్న మేరకు ముందుకు వెళ్తే అభివృద్ధి సాధ్యం కానీ.. మూడు రాజధానుల వల్ల సాధ్యం కాదన్నారు. 151 స్థానాలు గెలుచుకున్న వైకాపా నేతలు రాజీనామా చేసి ప్రజల వద్దకు రిఫరెండం కోసం వెళ్తే మొత్తం 175 స్థానాలు గెలుచుకోవచ్చు కదా అని సూచించారు. ఇది ప్రభుత్వానికి, సీఎంకు తాను ఇచ్చే సూచనే తప్ప.. పార్టీకీ, పార్టీ అధ్యక్షుడికి కాదని స్పష్టం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.