close
Array ( ) 1

తాజా వార్తలు

మహిళలకు శాశ్వత శక్తి..!  

  న్యాయస్థానం తీర్పుతో మారనున్న సైన్యం తీరు

మహిళల పర్మినెంట్‌ కమిషన్‌కు అవకాశం ఇవ్వాలని వారం క్రితం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైంది. ప్రపంచంలోని అతికొద్ది దేశాలు మాత్రమే మహిళలకు సైన్యంలో శాశ్వత అవకాశాలు కల్పిస్తున్నాయి. భారత్‌ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరనుంది. శౌర్యపరాక్రమాల్లో తాము ఎవరికీ తీసిపోమని వారు నిరూపించుకొనే అవకాశం లభించింది. మహిళలకు సామర్థ్యం ఉంటే కీలక బాధ్యతలు అప్పజెప్పాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాదాపు దశాబ్దానికి పైగా వారి న్యాయపోరాటానికి ఒక విలువ దక్కింది.  -ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తీర్పుతో దక్కినవి..

* ప్రస్తుతం షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)లో అధికారులుగా పనిచేస్తున్న మహిళలు పురుషుల మాదిరిగానే పర్మినెంట్‌ కమిషన్‌ పొందడానికి అర్హులే.

* సైన్యంలో మహిళలు పనిచేస్తున్న అన్ని విభాగాలకు ఇది వర్తిస్తుంది.

* ప్రస్తుతం ఆర్మీలో 14ఏళ్లు దాటి సేవలు అందిస్తున్న మహిళా అధికారులు 20ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకొని పెన్షన్‌ పొందడానికి అర్హులే.

* ఇప్పటి వరకు 20ఏళ్లకు పైగా సేవలు అందించి పర్మినెంట్‌ కమిషన్‌ పొందని అధికారిణిలు కూడా పెన్షన్‌కు అర్హులే.

* కమాండ్‌ హోదా పొందడానికి ఇప్పుడు మహిళలకు కూడా అవకాశం దక్కింది. అలాగని నేరుగా ముఖాముఖి యుద్ధంలో పాల్గొనే విభాగాల్లో ఈ అవకాశం లభించలేదు. సైన్యానికి చెందిన ఇతర విభాగాల్లో కమాండ్‌ హోదాకు పోటీపడవచ్చు. కల్నల్‌ స్థాయికి ఎదిగే అవకాశం దక్కింది. 

దక్కనవి..

* యుద్ధంలో నేరుగా పాల్గొనే సైనిక విభాగాల్లో మహిళలకు ఇంకా అనుమతి లభించలేదు. (ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ తదితర విభాగాలు)

* ఈ తీర్పుతో పర్మినెంట్‌ కమిషన్‌కు అర్హత లభిస్తుందే కానీ.. పర్మినెంట్‌ కమిషన్‌ ఒక హక్కులా నేరుగా లభించదు.  అక్కడ నియమ నిబంధనలను వీరు పూర్తి చేయాల్సి ఉంటుంది.

* కమాండ్‌ హోదా కోసం ప్రయత్నించే అవకాశం మాత్రమే లభించింది. కమాండ్‌ హోదా లభించాలంటే ఇప్పటికీ  ప్రతిభే కొలమానం.  అంతేకానీ సాధారణ ప్రమోషన్‌లా లభించదు. అర్హత, ఖాళీల ఆధారంగానే దీనిని ఇస్తారు. కనీసం 20ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి.  సరైన కారణాలు లేకుండా వివక్ష కారణంగా కమాండ్‌ హోదాను తిరస్కరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. 

* ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు అనుమతించిన 10విభాగాల్లోనే కమాండ్‌ పొజిషన్‌ లభిస్తుంది. 

మహిళలు కమాండ్‌ హోదా పొందే 10 విభాగాలు ఇవే..

* జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌

* ఆర్మీ ఎడ్యూకేషన్‌ కోర్‌

సిగ్నల్‌

* ఇంజినీర్స్‌

* ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌

* ఆర్మీ ఏవియేషన్‌ కోర్‌

* ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీర్స్

*  ఆర్మీ సర్వీస్‌ కోర్‌

ఆర్మీ ఆర్డినెన్స్‌ కోర్‌

*  ఇంటెలిజెన్స్ కోర్‌

సైన్యంలో పరిస్థితి..

మహిళా అధికారుల నియామమకాలు 1992 నుంచి మొదలయ్యాయి.  ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీలో 42,000 మంది అధికారులు ఉన్నారు.  వీరిలో మహిళా అధికారుల సంఖ్య 1,560 అంటే కేవలం 3.9శాతం మాత్రమే. 

వాయుసేనలో ప్రస్తుతం 

వాయుసేనలో అన్ని విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారు. వాయుసేన సహాయ(సపోర్టింగ్‌) విభాగంలో 1994లో తొలిసారి మహిళలను పైలెట్లుగా తీసుకొన్నారు. 2015లో యుద్ధ పైలెట్లుగా మహిళల నియామకాలను మొదలుపెట్టారు. ప్రస్తుతం వాయుసేనలో 1500 మహిళలు ఉండగా.. వీరిలో 94 మంది పైలెట్లు.. 14 మంది నావిగేటర్లు. వింగ్‌ కమాండర్‌ షల్జా దామి తొలిసారి వాయుసేనలో పర్మినెంట్‌ కమిషన్‌ పొందిన అధికారిణి. స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌ యుద్ధసేన పతకం పొందిన తొలి అధికారిణిగా నిలిచారు. వాయుసేనలో మన తిరుపతికి చెందిన పద్మావతి బంధోపాధ్యాయ ఎయిర్‌ మార్షల్‌ స్థాయికి ఎదిగిన తొలిమహిళ. రక్షణ దళాల్లో అత్యున్నత ర్యాంక్‌ సాధించిన రెండో మహిళ కూడా ఈమే. 

నావికాదళంలో మెరుగ్గా..

పై రెండు దళాలతో పోలిస్తే నావికాదళంలో మహిళలు అత్యున్నత స్థానాలకు వెళ్లారు. డాక్టర్‌ పునీతా అరోరా తొలి మహిళా వైస్ అడ్మిరల్‌ జనరల్‌గా ఎదిగారు.  2019 డిసెంబర్‌లో నావికాదళం వినియోగించే డోర్నియర్ నిఘా విమానంలో తొలి మహిళా పైలెట్‌గా లెఫ్టినెంట్‌ శివంగి రికార్డు సృష్టించారు.

 

‘‘ఇది మా అందరికి విజయానికి లభించిన సమయం. ఇప్పుడు మాకు పూర్తి శక్తి లభించింది.  దీనికి తొలుత మా నాన్నకు కృతజ్ఞతలు చెబుతాను. ఆయన నా ఆశలకు రెక్కలు తొడిగారు. బ్యాంకు ఉద్యోగులు, డాక్టర్లు, టీచర్లుగానే మహిళలు ఉన్న రోజుల్లో నా తండ్రి నన్ను సైన్యంలోకి  పంపించారు.  నాన్న నన్ను నా సోదరులతో సమానంగా చూశారు. మా మధ్య ఎటువంటి లింగభేదాలను ఆయన చూడలేదు. మా పోరాటం మొత్తం లింగసమానత్వం తీసుకురావడానికే.  ఇది చాలా ప్రగతిశీల తీర్పు. సైన్యంలో రావాలనుకునే యువతులకు మంచి కెరీర్‌ను అందించేందుకు ద్వారాలు తెరుచుకున్నాయి.’’ -  లెఫ్టినెంట్‌ కల్నల్‌ సీమా సింగ్‌, మహిళా ఆఫీసర్ల తరపున 2007 నుంచి  న్యాయపోరాటం చేసిన అధికారి.

పర్మినెంట్‌ కమిషన్‌ కేసు వాదన సందర్భంగా పలువురు మహిళా అధికారుల విజయాలు సుప్రీం కోర్టు దృష్టిని ఆకర్షించాయి. వారిలో కొందరు..

లెప్టినెంట్‌ కల్నల్‌ సోఫియా ఖురేషీ(ఆర్మీ సిగ్నల్‌ రెజిమెంట్‌):  ‘ఎక్సర్‌సైజ్‌ ఫోర్స్‌ 18’ పేరుతో  జరిగిన అంతర్జాతీయ సైనిక విన్యాసాల్లో భారత సైనిక బృందానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి.  భారత్‌లో జరిగిన అతిపెద్ద సైనిక విన్యాసాలు ఇవే. 2006లో కాంగోలోని ఐరాస శాంతి దళంలో విధులు నిర్వహించారు.

లెఫ్టినెంట్‌ కల్నల్‌ అనువందన జగ్గి:  బురుండిలో ఐరాస సైనిక పరిశీలన విభాగంలోని మహిళా బృందానికి నాయకత్వం వహించారు. దీనికి ఐరాస శాంతి దళ కమాండర్‌ నుంచి ప్రశంసలు పొందారు. 

మేజర్‌ మధుమిత: గ్యాలెంటరీ అవార్డు అందుకొన్న తొలి మహిళా అధికారిణి. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులతో పోరాడినందుకు ఈ అవార్డు లభించింది. అక్కడి భారత దౌత్యకార్యాలయంలో పలువురి ప్రాణాలు కాపాడారు. 

మేజర్‌ గోపికా భట్టి: లేహ్‌ నుంచి పఠాన్‌ కోట్‌కు భారీ ఆయుధ సామగ్రితో కాన్వాయ్‌ను విజయవంతంగా తరలించగలిగారు. ఈ కాన్వాయ్‌కు ఆమె కమాండర్‌గా వ్యవహరించారు. 

మేజర్‌ గోపికా అజిత్‌సింగ్‌ పవార్‌: లెబనాన్‌లో ఐరాస శాంతి దళంలో సేవలు అందించినందుకు ‘ఐరాస శాంతి దళ పతకం’ను అందుకొన్నారు. 

మేజర్‌ మధురాణా, ప్రీతి సింగ్‌, అనూజ యాదవ్‌: కాంగోలో ఐరాస దళాల్లో పూర్తిస్థాయి సైనిక సిబ్బందిగా విధులు నిర్వహించారు. ఇందుకు గానూ వీరు ఐరాస పతకాలను అందుకొన్నారు. 

కెప్టెన్‌ అశ్వనీ పవార్‌ (ఆర్డినెన్స్‌ కార్ప్స్‌), కెప్టెన్‌ షిప్ర మజుందార్‌: 2007లో సేవా పతకాలు అందుకొన్నారు. 

లెఫ్టినెంట్‌ ఎ దివ్య: ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 170 మంది పురుషులు, 57 మంది మహిళలను దాటుకొని 2010లో గౌరవ కరవాలాన్ని అందుకొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.