
తాజా వార్తలు
రైతులకు న్యాయం జరిగేలా చూస్తా: పవన్
విజయవాడ: నివర్ తుపాను కారణంగా జరిగిన పంటనష్టాన్ని పరిశీలించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కు కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.
అనంతరం కంకిపాడు, పామర్రు తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు భరోసా ఇచ్చేందుకే వచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు ఆర్థిక సాయం వచ్చే కృషి చేస్తామన్నారు. అధైర్య పడొద్దని రైతులకు ధైర్యం చెప్పారు. కంకిపాడు మీదుగా ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. అంనతరం గుంటూరు జిల్లా వెళ్లనున్నారు.
పవన్ పర్యటనలో అపశృతి
పవన్ రాకతో కంకిపాడులో అభిమానుల కోలాహలం నెలకొంది. జనసేనానిని చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో ఉప్పలూరు, పునాదిపాడుల మధ్య ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందు పోలీసులు తంటాలు పడుతున్నారు. ఉయ్యూరు సమీపంలో పవన్ కల్యాణ్ వెంట వెళ్తున్న కార్యకర్తల బైక్‌లు ఢీకొని ప్రమాదం జరిగింది. ముగ్గురు జనసేన కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి