close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. పురపాలికల్లో తెరాస పాగా!

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తోంది. మెజారిటీ సాధించినా.. అధికార పార్టీ సంధించిన ఎక్స్‌అఫిషియో అస్త్రంతో  చాలాచోట్ల ప్రతిపక్షాలు పుర పీఠాలకు దూరమవుతున్నాయి.  స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థులతో పాటు పలు చోట్ల కాంగ్రెస్‌ నుంచి ఎంపికైన వారు కారెక్కుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తొమ్మిది కార్పొరేషన్లకు గాను తొమ్మిదింటిలో తెరాస జెండా ఎగురనుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌కు ఓట్ల లెక్కింపు ఇవాళ జరగుతోతుంది.  రాష్ట్రంలో 113 మున్సిపల్‌ పీఠాలను గులాబీ నేతలు సొంతం చేసుకోబోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మండలి రద్దుకే మొగ్గు!

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి భవితవ్యం సోమవారం తేలిపోనుంది. పెద్దల సభను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టమైన నిర్ణయం వెలువడనుంది. ఈ నెల 23న (గురువారం) శాసనసభ వాయిదా పడినప్పటి నుంచి జరిగిన పరిణామాలను చూస్తే మాత్రం మండలి రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వ అడుగులన్నీ ఆ దిశగానే పడుతున్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలోనూ, 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశంలోనూ మండలి రద్దుపై తీర్మానం చేసే అవకాశాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ

రాజ్యాంగ వ్యవస్థల్ని కించపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శాసనసభ సమావేశాలను నిర్వహించాలనుకుంటోందని తెదేపా శాసనసభాపక్షం మండిపడింది. సమావేశాల్ని బహిష్కరించాలని నిర్ణయించింది. ‘సోమవారం నాటి శాసనసభ సమావేశాల ఎజెండానే రాజ్యాంగ విరుద్ధం. ఒక సభ గురించి మరో సభలో చర్చించడం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధం. మండలిలో జరిగిన చర్చలపై గురువారం అసెంబ్లీలో చర్చించడం ద్వారా ఇప్పటికే నిబంధనలను ఉల్లంఘించారు. సోమవారం మళ్లీ చర్చించాలనుకోవడం మరో ఉల్లంఘన’ అని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. హత్యాచారాలు నాలుగు.. తీర్పులు ఒకే రోజు

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాలుగు హత్యాచార ఘటనలపై సోమవారం తీర్పులు వెలువడనున్నాయి. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన ముగ్గురు అమ్మాయిలపై వేర్వేరు ఘటనల్లో శ్రీనివాసరెడ్డి అత్యాచారానికి పాల్పడి హతమార్చాడని పోలీసులు నల్గొండ న్యాయస్థానంలో అభియోగాలు మోపారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో గత ఏడాది నవంబరు 24న ఓ వివాహితపై షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ మగ్దూం అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేశారని ఆదిలాబాద్‌ న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. వీటిపై నేడు తీర్పు రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ప్రభుత్వం అంగుళం కూడా కదల్చలేదని వివిధ క్షేత్రాల పీఠాధిపతులు స్పష్టం చేశారు. 13వేల గ్రామాల నుంచి మట్టి, 37 క్షేత్రాలు, పవిత్ర నదుల నుంచి జలాలు తీసుకొచ్చి నిక్షిప్తం చేసిన రాజధానిని కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ముక్కలు చేయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని తీర్మానం చేశారు. రాష్ట్రంలోని 153 మంది పీఠాధిపతుల ఆధ్వర్యంలో త్వరలో లక్ష మందితో తిరుపతిలో మహాసభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. జూపల్లికి తెరాస అధిష్ఠానం షాక్‌

పూర్వ పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్‌, అయిజ పురపాలక సంఘాల్లో తెరాస తిరుగుబాటు అభ్యర్థులను పోటీ చేయించారనే కారణంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై తెరాస అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం జూపల్లి.. సీఎంను కలిసేందుకు యత్నించగా అనుమతి ఇవ్వలేదు. మంత్రిగా పనిచేసి, పార్టీని నష్టపరుస్తారా అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసేందుకు తెలంగాణ భవన్‌కు రాగా ఆయనా నిరాకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. మొదలైన వడపోత

ఏపీలో రేషన్‌ కార్డులు, పింఛను లబ్ధిదారుల వడపోత మొదలైంది. అనర్హులుగా గుర్తించిన వారి వివరాల పరిశీలనలో గ్రామ సచివాలయ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. పంచాయతీ/వార్డుల వారీగా ఇప్పటికే జాబితాలు విడుదల చేశారు. సోమవారం వరకు అభ్యంతరాలను స్వీకరించి.. మంగళవారం గ్రామ సభల్లో చదివి.. బుధవారమే తుది జాబితాను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా హడావుడిగా చేస్తుండటంతో తమ పేర్లు ఉన్నాయా? లేవా? అనే ఆందోళన లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘‘ఈ నెల 29న హతమారుస్తాం!’’

నటుడు ప్రకాశ్‌రాజ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతోపాటు మరో 13 మందిని హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సంఘ్‌ పరివార్‌ను విమర్శిస్తూ వస్తున్న నిజగుణానందస్వామికి వచ్చిన ఆ లేఖలో వీరి పేర్లున్నాయి. కన్నడలో ఉన్న ఆ లేఖలో ‘ధర్మ ద్రోహులు, దేశద్రోహులను జనవరి 29న హతమార్చేందుకు ముహూర్తం పెట్టాం. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. నిజగుణానందస్వామీ! మీరు ఒక్కరే కాదు. దిగువ ఉన్న పేర్లను చూడండి. వారిని కూడా చివరి ప్రయాణానికి మీరే సిద్ధం చేయాలి’ అని ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ‘చేయగలం’.. ఇదే నూతన మంత్రం

‘‘చేయగలం’’ అన్న మాటే నూతన భారతదేశానికి కొత్త మంత్రం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మంత్రాన్ని ఆచరించి ప్రజలు భాగస్వాములైతే నూతన పంథాలు ఆవిష్కృతమవుతాయని చెప్పారు. ఆదివారం ఆయన ‘మన్‌ కీ బాత్‌’లో ప్రసంగిస్తూ ‘‘చేయగలం’’ అన్న స్ఫూర్తి జల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ‘‘ఇంతవరకు పారిశుద్ధ్యం విషయంలో ప్రజల భాగస్వామ్యం ఉండేది. ఇప్పుడు అది జలసంరక్షణకు విస్తరించింది. నీటి నిల్వకు దేశం నలుమూలలా కొత్త పద్ధతులను కనిపెడుతున్నారు’’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ప్రమాదంలో దిగ్గజ ప్లేయర్‌ కోబ్‌ బ్రయింట్‌ మృతి

బాస్కెట్‌బాల్  దిగ్గజం కోబ్ బ్రయింట్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించారు. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో కోబ్‌ బ్రయింట్, ఆయన కుమార్తె (13) జియానాతో సహా 9 మంది మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న సికోర్సికీ ఎస్ 76 హెలికాఫ్టర్‌ లాస్‌ఏంజెల్స్‌లోని పశ్చిమాన ఉన్న ఓ కొండను ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న అందరూ కన్నుమూశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.