close

తాజా వార్తలు

విజయవాడ భవానీ కథ సుఖాంతం

విజయవాడ: హైదరాబాద్‌లో అదృశ్యమై విజయవాడలో ఆచూకీ లభించిన భవానీ కథ సుఖాంతమైంది.  ఇప్పటి వరకూ పెంచిన తల్లి జయరాణి తన పాపను అప్పగించాలని విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి నుంచి భవానీని కలిసేందుకు వచ్చిన కన్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పెంచిన తల్లి, కన్నతల్లి ఇద్దరూ భవానీ మాకంటే మాకు కావాలని కోరడంతో ఈవిషయంపై పోలీసులు న్యాయసలహాలు తీసుకున్నారు. ఈనేపథ్యంలో పెంచిన వారి దగ్గర కొన్నిరోజులు, కన్నవారి వద్ద కొన్ని రోజులు ఉంటానని భవానీ చెప్పింది. ముందుగా పెంచిన తల్లిదండ్రుల వద్ద, ఆ తర్వాత కన్నవారి వద్దకు వెళ్తానని భవానీ తెలిపింది.  రెండు కుటుంబాలతో మాట్లాడి భవానీ నిర్ణయం మేరకు పంపుతామని పోలీసులు వెల్లడించారు. భవానీ నిర్ణయానికి రెండు కుటుంబాల వారు అంగీకరించడంతో వివాదానికి తెరపడింది. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన భవానీ ఇవాళే కన్నవారిని చూసింది. భవానీకి డీఎన్‌ఏ పరీక్ష చేసి కన్న తల్లిదండ్రులకు అప్పగించాలని పెంచిన తల్లి జయమ్మ పోలీసులను కోరింది.

భవానీ ఆచూకీ తెలిసిందిలా...
విజయవాడ పడమటలంక వసంత సదన్‌ అపార్ట్‌మెంట్‌లో వంశీధర్‌ కుటుంబం నివాసం ఉంటోంది. వంశీ ఇంట్లో పనిచేస్తున్న జయరాణి పడమటలంకలో ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటోంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆమె స్వస్థలం. 15 ఏళ్ల క్రితం జయరాణి హైదరాబాద్‌లో పనికి వెళ్లిన సమయంలో ఓ ఇంటి వద్ద భవానీ కనిపించింది. భవానీ గురించి చుట్టుపక్కల వారిని వివరాలు అడిగినప్పటికీ ఎవరూ ఏమీ చెప్పలేదు. చిన్నారిని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సనత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో జయరాణి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చిన జయరాణి 15 ఏళ్లుగా ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

జయరాణి పనిచేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో మొదటిసారి యజమాని వంశీ, అతని భార్య కృష్ణకుమారికి పరిచయం చేసింది. భవానీది చిన్నవయసు కావడంతో ఆమె గురించి వివరాలను వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని.. తనకు గుర్తు ఉన్నంతవరకు కుటుంబసభ్యుల వివరాలను చెప్పింది. భవానీ చెప్పిన వివరాలను వంశీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో భవానీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చూసిన విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన కుటుంబం ఫేస్‌బుక్ ద్వారా వంశీకి వీడియోకాల్‌ చేశారు. వీడియోకాల్‌  చేసిన వ్యక్తిని తన సోదరుడిగా భవానీ గుర్తుపట్టింది. ఆమె తల్లిదండ్రులు కూడా వీడియోకాల్‌ ద్వారా భవానీతో మాట్లాడారు. త్వరలోనే కన్నతల్లిదండ్రులను కలుస్తానని భవానీ ఆనందం వ్యక్తం చేసింది. భవానీ సమాచారం తెలిసిన తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మీ, సోదరులు సంతోష్‌, గోపి విజయవాడకు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామం భవానీ స్వస్థలం. భవానీ తల్లిదండ్రులు గతంలో హైదరాబాద్‌లో కూలీపనులు చేసేవారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.