ఈటల భూకబ్జాలే కనిపిస్తున్నాయా.. మరి వారివి
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 17:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈటల భూకబ్జాలే కనిపిస్తున్నాయా.. మరి వారివి

సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఈటల రాజేందర్‌ భూకబ్జాలకు పాల్పడ్డారని వస్తున్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ను సీఎం చేయాలన్న కోరిక కేసీఆర్‌కు ఉందని.. అదే సమయంలో సీఎం పదవికి ఈటల అర్హుడనే అంశం తెరమీదకు రావడంతో కేసీఆర్‌కు మింగుడు పడటం లేదన్నారు. ఈటల రాజేందర్ సామాజిక స్ఫూర్తి కలిగిన వ్యక్తి అని.. కుట్ర పూరితంగానే ఆయనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈటల స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి అని.. పౌల్ట్రీలో రంగంలో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆస్తులు, ఈటల ఆస్తులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఎవరి ఆస్తులు ఎలా.. ఎంత పెరిగాయో ప్రజలకు తెలుస్తుందన్నారు.

‘‘మంత్రి కేటీఆర్ 111 జీవో ఉల్లంఘించి ఫామ్ హౌస్ నిర్మాణం చేపడితే విచారణ ఎందుకు చేపట్టలేదు? నీ కుమారుడని కేటీఆర్‌పై ఆరోపణలు పట్టించుకోరా? మంత్రి మల్లారెడ్డిపై వచ్చిన ఆరోపణలు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూ కబ్జాలపై ఎందుకు విచారణ జరిపించలేదు? కేవలం ఈటల రాజేందర్ భూకబ్జాలు మాత్రమే కనిపిస్తున్నాయా. ఓర్వలేని తనంతోనే ఈటలను బలిచేయాలని చూస్తున్నారు. అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన గొంతుక వినిపించిన వ్యక్తి ఈటల రాజేందర్‌. ఆయన ఉద్యమ ఫలితంగానే కేసీఆర్ సీఎం అయ్యారు. విచారణ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకుండా మీడియాకు చెప్పడం సరికాదు. కేసీఆర్ ఫామ్ హౌస్‌పై కూడా రకరకాల ఆరోపణలు వచ్చాయి. వాటిపై ఎందుకని విచారణ జరగలేదు?ధరణి వెబ్ సైట్‌లో కేసీఆర్ ఫామ్ హౌస్ భూములు ఎందుకు కనిపించడం లేదు? కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపైనా విచారణ జరిపించాలి’’ అని జీవన్‌ రెడ్డి తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని