close

తాజా వార్తలు

Published : 22/11/2020 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రేటర్‌లో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం సాధ్యమేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌ : అసంతృప్తులు, అలకలు, వర్గాలతో రాష్ర్టంలో జాతీయపార్టీ కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని ఆ పార్టీ అగ్రనాయకులు తాజా పోరును సవాలుగా తీసుకున్నారు. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలనే కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. 2009 గ్రేటర్‌ ఎన్నికల్లో 52 డివిజన్లలో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ మజ్లిస్‌తో కలిసి మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంది. అనంతరం రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు అంతగా కలిసి రాలేదు. 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 2 డివిజన్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

గత అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే.. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. వాళ్లలో కొందరు ఇతరత్రా కారణాలతో అధికార పార్టీ తెరాసలో చేరారు. 2014లో 22 మందిని గెలిపించుకున్న కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో అధికార పార్టీ 63 స్థానాల నుంచి 88 స్థానాలకు తమ బలాన్ని పెంచుకుంది. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొంతమేర బలాన్ని పుంజుకుంది.  మూడు సీట్లు గెలుచుకొని రాష్ర్టంలో తన ఉనికిని చాటుకుంది. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో మల్కాజ్‌గిరి ఒక్కదాంట్లోనే కాంగ్రెస్‌ బలంగా కనిపిస్తోన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లోక్‌సభ  సీటు పరిధిలో 47 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డిపైనే ఆ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.  

కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి.. 

గ్రేటర్‌ ఎన్నికల టికెట్ల కేటాయింపు సంప్రదాయాలను కాంగ్రెస్‌ పాటించడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో గ్రేటర్‌ కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు, నగరంలోని నాయకులు, స్థానిక నేతలు అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఈ సారి కొత్తగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి సీట్లను కేటాయించే అధికారాలను వీరికే బదలాయించారు. దీంతో ఆ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ అగ్రనాయకులు పార్టీని వీడారు. వాళ్లందరినీ భాజపా ఆకర్షిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ర్ట వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితర అగ్రనాయకులు పార్టీపై అసంతృప్తిగా ఉన్న నాయకులను బుజ్జగిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడంలేదనే వాదనలూ ఉన్నాయి.   

మాజీ మేయర్‌ నుంచి మొదలుకొని.. 

తాజా గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ జాబితాలో ముందుగా గతంలో మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన బండ కార్తీకరెడ్డి ఉన్నారు. రెండు రోజుల కిందట ఆమె భాజపాలో చేరారు.  ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని.. 150 డివిజన్లలో భాజపా తరఫున ప్రచారం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ అతని కుమారుడు రవికుమార్‌యాదవ్‌ కూడా ఇటీవల కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. దీంతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌యాదవ్‌కు ఎన్నికల వ్యవహారాల్లో సముచిత స్థానం కల్పించలేదని గుసగుసలు వినిపించాయి. దీంతో ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీ వీడతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. కార్పొరేటర్‌ టికెట్‌ ఆశించి జాబితాలో పేర్లు లేని పదుల సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇప్పటికే తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా గోషామహల్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌నేత, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ ఆ పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన వర్గీయులకు టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీని వీడి భాజపాలో చేరతారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో కేడర్‌ కొంతబలంగానే ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయలోపం, అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి చేటు చేస్తున్నాయి.  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నగరంలో పునర్వైభవం సాధించగలదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి

 


Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని