close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/02/2020 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అహోబలా మహాశయా!

ఫిబ్రవరి 28 నుంచి అహోబిల బ్రహ్మోత్సవాలు

భగవంతుడా... ఎక్కడున్నావ్‌! అని భక్తుడు పిలవగానే సమయాసమయాలు లేవు, దివాసంధ్యలు లేవు, స్థలనియమాలు లేవు...ఇదిగో...నువ్వు ఎక్కడ చూస్తే అక్కడున్నాను...ఏమని తలిస్తే అలాగే ఉంటాను...అంటూ హరి స్తంభంలోంచి నృసింహావతారంలో వ్యక్తమయ్యాడు...మిగిలినవాటికన్నా విశిష్టమైన ఈ అవతారం ‘ఎందెందు వెదికి చూసినా అందందేగలడు’ అన్న పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. స్వామి ప్రహ్లాదుడి కోసం  స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన క్షేత్రం అహోబిలం అని చెబుతారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని ఈదివ్యక్షేత్రం ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది...
న నారసింహో అధికశ్చ దేవః
న తీర్థమన్వ భవనాస హేతోః
న గారుడాద్రేరపరోస్తు శైలః
న భక్తజన్తోరపరోస్తు యోగి

ఇది బ్రహ్మాండ పురాణంలోని శ్లోకం. నృసింహస్వామిని మించిన దైవం లేదు. భవనాశి నదిని మించిన తీర్థం లేదు. గరుడాద్రిని మించిన పర్వతం లేదు. స్వామి భక్తులకన్నా యోగులు లేరని దీని భావం. భగవంతుడి అద్భుత లీలకు నిదర్శనంగా భావించే పుణ్యస్థలం అహోబిలం. ఇది నవ నారసింహ క్షేత్రం. తొమ్మిది రూపాల్లో నృసింహస్వామిని దర్శించుకోగలిగే ఏకైక స్థలమిది. పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాద చరిత్రకు సాక్ష్యమీ భూమి. కృతయుగంనాటి అత్యద్భుత గాథ ఇక్కడే జరిగినట్లుగా భావిస్తారు. పసి వయసులో తండ్రి చేతిలో చిత్ర హింసలకు గురైన ఆ మహాభక్తుడు ‘ఇందుగలడందులేడని’ పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని చాటిచెప్పిన చోటిదేనని స్థలపురాణం వివరిస్తోంది. ప్రహ్లాదుని భక్తికి స్వామి స్తంభం నుంచి మహోగ్ర రూపంతో నారసింహుడై అవతరించాడు. దిక్కులు పిక్కటిల్లేటట్టు వికటాట్టహాసం చేస్తూ గడప మీద కూర్చొని, పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో దుష్టశిక్షణ చేశాడు. తెలుగు గడ్డపై ఉన్న రెండు వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఇదొకటి..మరొకటి తిరుమల. హిరణ్యకశిపుని సంహారం జరిగిన తర్వాత దేవతలు, మునులు నారసింహుని ‘అహోబలా’ అని కీర్తించారని, అదే ఈ క్షేత్రానికి పేరుగా స్థిరపడిందని కాలక్రమేణా అహోబిలంగా మారిందని చెబుతారు.


అది ఉగ్ర స్తంభం

బాలుడైన ప్రహ్లాదుడు కోరిన వెంటనే నృసింహస్వామి హిరణ్యకశిపుని సభాస్తంభం నుంచి బయటకు వచ్చి సంహరిస్తాడు. స్వామి పుట్టిన స్తంభమే అచలఛ్చాయమేరు పర్వతం అనే పేరుతో ఇప్పటికీ దర్శనమిస్తోంది. ఉగ్రస్తంభం, ఉక్కు కంభమని ఇది ప్రసిద్ధి చెందింది. ఎగువ అహోబిలం అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి దీన్ని దర్శిస్తారు.


9 రూపాల్లో...
ఈ దివ్యక్షేత్రంలో ప్రహ్లాద వరదుడు తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తాడు. అహోబిలం పరిసర ప్రాంతాల్లో ఈ నవ నారసింహాలయాలున్నాయి. వివిధ గ్రహాలకు అధిపతులుగా ఈ మూర్తులను భావిస్తారు.  
జ్వాలా నృసింహస్వామి : గరుత్మంతుడి ఘోర తపస్సుకు జ్వాలా నృసింహస్వామి మహోగ్ర రూపంతో, ఎనిమిది ఆయుధాలతో దర్శనమిచ్చాడని చెబుతారు. నవగ్రహాల్లో కుజ గ్రహానికి అధిపతిగా ఈయనను భావిస్తారు. కుజ దోషం ఉన్న వారు, వివాహాలు కాని వారు ఈ స్వామిని దర్శించుకుంటుంటారు.
అహోబిల నృసింహస్వామి : హిరణ్యకశిపుని సంహరించిన స్వామి బలాన్ని చూసిన దేవతలు అహోబలా అని పిలుస్తారు. కొండ గుహలో వెలిసిన స్వామిని అహోబిల నృసింహస్వామి అనీ పిలుస్తారు. స్వామి ఎదురుగా ప్రహ్లాదుడు కనిపిస్తాడు.  స్వామి గురు గ్రహానికి అధిపతి అని, ఆయన దర్శనం విద్యాప్రదాయకమని నమ్ముతారు.
మాలోల నృసింహస్వామి : స్వామి వారి ఉగ్రస్వరూపం చూసి విశ్వమంతా భయపడితే శ్రీ మహాలక్ష్మి మాత్రం ఆయన అంకపీఠం చేరి శాంతింపజేసింది. మా అంటే లక్ష్మి, లోల అంటే ప్రియుడు అని అర్థం. నవగ్రహాల్లో శుక్ర గ్రహానికి ఈయన అధిపతి అని, స్వామిని దర్శించుకొంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని అంటారు.
వరాహ నృసింహస్వామి : ఈయననే కోఢ నృసింహస్వామి అంటారు. వేదాలను, భూదేవిని రక్షించేందుకు స్వామి ఈ అవతారంలో వచ్చినట్లు చెబుతారు. రాహుగ్రహ శాంతి కోసం స్వామిని పూజిస్తారు.  
కారంజ నృసింహస్వామి : కానుగ చెట్టు నీడలో చక్రం, విల్లుతో యోగపీఠంపై దర్శనమిస్తారు. గోబిల మహర్షికి, ఆంజనేయస్వామికి ప్రత్యక్షమైన ఈ స్వామిని చంద్రగ్రహానికి అధిపతిగా భావిస్తారు.
భార్గవ నృసింహస్వామి : క్షత్రియ సంహారం చేసిన పరశురాముడి పాపాలను ప్రక్షాళన చేసింది ఈయనేనని  చెబుతారు. సూర్యుడికి అధిపతి అయిన భార్గవ నృసింహుడిని ఉన్నత పదవీ యోగం కోరుతూ దర్శించుకుంటారు.
యోగానంద నృసింహస్వామి : హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ప్రహ్లాదునికి రాజనీతి శాస్త్రం, యోగశాస్త్రం నేర్పించి యోగానంద నృసింహస్వామిగా ప్రసిద్ధి చెందారీయన. శని గ్రహ బాధల నివారణ కోసం ఈయనను దర్శించుకుంటారు.
ఛత్రవట నృసింహస్వామి : హాహా, హుహు అనే ఇద్దరు గంధర్వుల గానానికి మైమరిచి, తాళం వేస్తూ దర్శనమిచ్చే స్వామి ఛత్రవట నృసింహస్వామి. కేతు గ్రహానికి ఈ స్వామి అధిపతి అని చెబుతారు.
పావన నృసింహస్వామి : భరద్వాజ మహాయోగికి దర్శనమిచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడీయన. చెంచులు బావగా భావించే పావన నృసింహస్వామి బుధ గ్రహానికి అధిపతి. మంచి విద్యాబుద్ధులను ఈయన ప్రసాదిస్తాడని చెబుతారు.
పరమాత్ముడి బ్రహ్మోత్సవాలు ఏటా రెండుసార్లు జరిగే క్షేత్రాలు మనం చూస్తుంటాం. కానీ రెండు చోట్ల బ్రహ్మోత్సవాలు జరిగే ఏకైక క్షేత్రం ఇదొక్కటే. ఎగువ, దిగువ అహోబిలాల్లోని రెండు ఆలయాల్లోనూ ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కొండపై ప్రళయ భీకర రూపంలో వెలిసి అహోబిలేశుడికి, కొండ కింద భక్తులను అనుగ్రహించే ప్రహ్లాద వరదుడికి ఒకేసారి ఉత్సవాలు జరుగుతాయి. ఒక రోజు ముందు ఎగువన, మరుసటి రోజు దిగువన ఆరంభమవుతాయి. మరో విశేషం కూడా ఈ ఉత్సవాలకు ఉంది... 108 దివ్య దేశాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామి కల్యాణోత్సవం కూడా ఇదే సమయంలో జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో అంతర్భాగంగానే  ఈ వేడుకలనూ నిర్వహిస్తారు. ఎగువన జ్వాలా నృసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవారికి, దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదస్వామి, అమృతవల్లి అమ్మవారికి కల్యాణం జరుగుతుంది.

పెళ్లికి రండి...
అహోబిలంలో అరుదైన, ఆసక్తికరమైన మరో విశేషం పార్వేట ఉత్సవం. స్వామి వారు పల్లకిలో కొలువుదీరి 32 గ్రామాల్లో పర్యటించి తన పెళ్లికి భక్తులను స్వయంగా ఆహ్వానించే అరుదైన వేడుక ఇది. 622 ఏళ్ల క్రితం అహోబిలం మొదటి పీఠాధిపతి ఆదివన్‌ శఠగోప యతీంద్ర మహాదేశికన్‌కు నృసింహస్వామి కలలో కనిపించి తన విగ్రహంతో ఊరూరా తిరిగి భక్తులకు ఉపదేశం చేయాలని చెప్పడంతో ఈ ఉత్సవాలకు బీజం పడింది. ప్రతి సంక్రాంతి మరుసటి రోజు కనుమ నాడు ఆరంభమయ్యే ఈ ఉత్సవం 40 రోజుల పాటు సాగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న పార్వేట ఉత్సవం ముగిసింది. స్వామికి లఘు సంప్రోక్షణ చేసిన తర్వాత బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి.ఈ ఉత్సవాల్లో నృసింహస్వామిని బావగా భావించి చెంచులు చేసే విన్యాసాలు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి.
ఎగువన, దిగువన ఒకేలా...
ఈ దివ్యక్షేత్రంలో లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఎగువ అహోబిలంలో జరిగే అంకురార్పణతో ఆరంభమవుతాయి. అంకురార్పణ జరిగినప్పటి నుంచి రోజుకో వాహనంపై విహరిస్తూ స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు జరిగే కల్యాణోత్సవం కన్నుల పండువగా ఉంటుంది. ఆ రోజు సాయంత్రం స్వామి గజవాహనంలో విహరిస్తారు. స్వామి, అమ్మవార్లను విడివిడిగా పల్లకిలో కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. తిరుమల వేంకటేశ్వర స్వామి తరఫున పట్టువస్త్రాలను అర్చకులు సమర్పిస్తారు. అనంతరం మాంగల్యధారణ జరుగుతుంది. ఉత్సవాల్లో తొమ్మిదో రోజు రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి తులువ ముడి అనే విశేషమైన ఎర్రటి తలపాగా చుట్టుకొని దర్శనమిస్తారు. సౌరి అనే జడకొప్పుతో అమ్మవారు అలరిస్తారు.
* మిగిలిన వైష్ణవ క్షేత్రాల్లో మూడో రోజుగానీ, అయిదో రోజుగానీ గరుడోత్సవం జరుగుతుండగా, అహోబిలంలో మాత్రం బ్రహ్మోత్సవాల చివరి రోజు జరుగుతుంది. ఈ సమయంలో చెంచులు తలపై కట్టెలను పొయ్యిలా పేర్చుకుని మంటలతో ప్రదక్షిణ చేస్తారు. గరుడవాహనం ఆలయానికి చేరుకోగానే ధ్వజావరోహణం చేస్తారు. కుంభప్రోక్షణతో బ్రహ్మోత్సవం ముగుస్తుంది.
-షేక్‌ మొహియుద్దీన్‌, అహోబిలం


స్థితికారుడైన విష్ణువు నరరూపం, లయకారుడైన శివుని సింహస్వరూపం కలిసి నృసింహునిగా ఆవిర్భవించాయి. శివకేశవుల అభేదభావానికి ఈ అవతారం ఓ నిదర్శనంగా నిలుస్తోంది.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.