close

తాజా వార్తలు

Published : 22/11/2020 08:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధికారే పురోహితుడి అవతారమెత్తి...

● దగ్గరుండి పిండ ప్రదాన పూజలు

● ఘాట్‌ వద్ద పురోహితులు లేకపోవడంతో నిర్ణయం


పురోహితుడిగా పిండ ప్రదాన పూజలు నిర్వహిస్తున్న ఘాట్‌ ఇన్‌ఛార్జి, ఈవో

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: పుష్కరాల్లో పిండ ప్రదానం అనే క్రతువుకు అధిక ప్రాధాన్యం ఉంది. పుష్కరాల్లో 33 కోట్ల దేవతలతోపాటు, పితృ దేవతలు నదికి వస్తారని, తమ పిల్లలు పిండ ప్రదానం చేస్తే సంతృప్తిగా వెనుదిరుగుతారనేది శాస్త్ర వచనం. రెండో రోజు పుష్కరాలకు కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి నలుగురు అన్నదమ్ములు మంత్రాలయం మండలంలోని రాంపురం ఘాట్‌కు శనివారం వచ్చారు. గతించిన తమ తండ్రికి పిండ ప్రదానం పెట్టడానికి పురోహితుల కోసం రెండు గంటలకు పైగా ఎదురుచూశారు. పుష్కరాలకు వచ్చి పిండ ప్రదానం చేయకుండా వెనుదిరగాల్సి వస్తుందని బాధ పడ్డారు. నిరాశతో ఉన్న ఆ భక్తులను అక్కడే ఘాట్‌ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న నంద్యాలలోని ఆంజనేయస్వామి ఆలయ ఈవో రామాంజనేయ శర్మ గమనించారు. ఆయన పురోహితుడిగా అవతారమెత్తి దగ్గరుండి సంప్రదాయ బద్ధంగా పిండ ప్రదాన పూజలు చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన ఆ నలుగురు అన్నదమ్ములు ఆ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంపై ‘ఈనాడు’ దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సహాయ కమిషనర్‌ ఆదిశేషనాయుడు మంత్రాలయం, రాంపురం ఘాట్లకు కొత్తగా ఏడుగురు పురోహితులను పంపారు. వాస్తవానికి 350 పురోహితులకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. భక్తుల రద్దీ లేకపోవడం, ఇతర కారణాలతో పురోహితులు చాలామంది గైర్హాజరయ్యారు. వెంటనే వేరే పూజారులతో భర్తీ చేయాల్సిన అధికారులు ఆలస్యంగా స్పందించారు. దీంతో ఘాట్ల వద్దకు వచ్చే భక్తులకు పుణ్య స్నానం మాట పక్కన బెడితే కనీసం పిండ ప్రదానాలు పెట్టుకునే అవకాశం లేక అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు. తొలిరోజు సైతం కర్నూలులోని రాఘవేంద్ర మఠం వద్ద పూజారుల్లేకపోవడంతో కృష్ణా జిల్లా నుంచి వచ్చిన కుటుంబం మరో ఘాట్‌ వైపు అడుగులు వేయాల్సి వచ్చింది.

అధికారులకు భోజన సదుపాయం నిల్‌

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: గతంలో జరిగిన కృష్ణా పుష్కరాలు, 2008లో తుంగభద్ర పుష్కరాల్లో ఘాట్ల వద్ద విధులు నిర్వహించే అధికారులకు దేవాదాయ శాఖ తరఫున భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత పుష్కరాలకు మాత్రం భోజన ఏర్పాట్లు చేయలేదు. దీంతో సేవా సంస్థలు, ఆలయాల వద్ద అందజేస్తున్న భోజనాలు తింటున్నారు.

‘తానా’ ఆధ్వర్యంలో...: కర్నూలులో పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నారు. శనివారం ఆహార పంపిణీని స్థానిక పురపాలక కమిషనర్‌ డీకే బాలాజీ, ట్రాఫిక్‌ డీఎస్పీ మాహబూబ్‌ బాషా ప్రారంభించారు. పుష్కరాలు పూర్తయ్యే వరకు తానా సహకారంతో భక్తులకు ఆహారం పంపిణీ చేయనున్నట్లు బాలాజీ క్యాంటిన్‌ అధినేత ముప్పా రాజశేఖర్‌ తెలిపారు.


తానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార పంపిణీని ప్రారంభిస్తున్న పురపాలక కమిషనర్‌

కరోనా కలకలం

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: తుంగభద్ర పుష్కరాల్లో కరోనా మొదటి కేసు నమోదైంది. నగరంలోని నగరేశ్వరస్వామి ఘాట్‌లో పార్కింగ్‌ ప్రదేశం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డుకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కడప నుంచి పుష్కర విధులకు వచ్చిన హోంగార్డు జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతుండగా తోటి సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. పాజిటివ్‌గా ఫలితం రావడంతో భక్తుల్లో, తోటి సిబ్బందిలో కరోనా కలకలం రేగింది. బాధిత రోగితోపాటు పుష్కర విధులకు వచ్చిన సిబ్బందికి ఓ పాఠశాలలో బస చేయడానికి కేటాయించారు. దీంతో అతనితో ప్రైమరీ కాంటాక్టు ఉన్న పోలీసు సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. నగరేశ్వరస్వామి ఘాట్‌లో శనివారం 1024 మంది భక్తులు తిలకించడానికి రాగా, 501 మంది సంప్రదాయ పూజల్లో పాల్గొన్నారు.

రెండు రోజుల్లో 2500 పరీక్షలు: పుష్కరాల్లో వైద్య, ఆరోగ్య శాఖ తరఫున మొత్తం ఘాట్ల వద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు చేస్తున్నారు. తొలిరోజు హాజరైన భక్తులకు 1350 పరీక్షలు చేయగా, అంతా నెగిటివ్‌గానే వచ్చాయి. రెండోరోజు 1150 పరీక్షలు చేశారు. ఘాట్ల వద్ద రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ముందుగా కరోనా పరీక్షలు చేయాలి. ఆ దిశగా పూర్తిస్థాయిలో అడుగులు పడలేదు. కౌతాళం పరిధిలోని మేళిగనూరు పుష్కర ఘాట్‌లో సుమారు 400 మంది విధులు నిర్వహిస్తుంటే 20 మందికి తప్ప మిగిలిన వారెవ్వరికీ కరోనా పరీక్షలు జరగలేదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.